rapid development
-
ఆర్ఆర్టీఎస్.. మెట్రో రైలా?
సాక్షి, హైదరాబాద్: ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్).. మెట్రో రెండో దశకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో అనూహ్యంగా తెరపైకి వచ్చింది. తక్కువ నిర్మాణ వ్యయంతో వేగవంతమైన రవాణా సదుపాయాన్ని అందజేసే ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును హైదరాబాద్‌లో చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం నగరంలో నడుస్తున్న మెట్రో కంటే ఆర్ఆర్టీఎస్ ఎక్కువ వేగంతో పరుగులు తీస్తోంది. ప్రయాణికులకు హైస్పీడ్ రైల్ అనుభూతిని అందజేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధిమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. మెట్రో రెండోదశ నిర్మాణంలో భాగంగానే ప్రభుత్వం మొదటి దశ ప్రాజెక్టును ఎల్అండ్టీ నుంచి కొనుగోలు చేసింది. కానీ.. ప్రస్తుత మెట్రో కంటే ఢిల్లీ నుంచి మీరట్‌కు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆర్ఆర్టీఎస్ తరహాలో హైదరాబాద్‌లో నిర్మించాలని పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రం అనుమతి కోసం పంపించిన రెండో దశ డీపీఆర్‌లకు అనుమతి లభిస్తుందా లేక, ఆర్ఆర్టీఎస్కే కేంద్రం కట్టుబడి ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మెట్రో రెండో దశకు భారీ వ్యయం.. రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్,(36,8 కి.మీ.) రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ (11.6 కి.మీ, ) ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియూపూర్–పటాన్చెరు (13.4 కి.మీ.),ఎల్బీనగర్–హయత్‌నగర్ (7.1 కి.మీ.) చొప్పున మొత్తం 76.4 కి.మీ వరకు.. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీ (39.6 కి.మీ.), జేబీఎస్–మేడ్చల్ (22 కి.మీ.), జేబీఎస్– శామీపేర్‌పేట్ (22కి.మీ,) కారిడార్లలో మరో 86.1 కి.మీ మెట్రో నిర్మాణం చేపట్టాలనేది ప్రతిపాదన. ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.48 వేల కోట్లు.. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.48 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. మొదటి దశ కొనుగోలు కోసం వెచి్చంచే సుమారు రూ.15000 కోట్ల వ్యయంతో కలిపి రూ.63000 కోట్లకు చేరనుంది. మెట్రో రెండో దశకు అవసరమైన నిధులను జైకా,ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి కేవలం 2 శాతం వడ్డీకి నిధులను సేకరించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఈ మేరకు ఇప్పటికే ప్రాథమికంగా జైకాతో ఒప్పందం కూడా ఏర్పడింది. కేవలం రూ.48000 కోట్లతో 192.2 కి.మీ వరకు ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును చేపట్టవచ్చని కేంద్రం ప్రతిపాదిస్తోంది. నిర్మాణ వ్యయం తగ్గుతుందని.. పటాన్చెరు–లక్డీకాపూల్– ఆరాంఘర్, రాయదుర్గం–కోకాపేట్, ఎల్బీనగర్– హయత్‌నగర్, ఎంజీబీఎస్– చాంద్రాయణగుట్ట, ఎయిర్పోర్ట్–ఫ్యూచర్‌సిటీ, జేబీఎస్–మేడ్చల్, జేబీఎస్– శామీర్‌పేట్ రూట్లలో ఆర్ఆర్టీఎస్ చేపట్టాలని మెట్రోరైల్ సంస్థకు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. కానీ.. ప్రతిపాదిత ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని హెచ్ఎంఆర్ఎల్ పేర్కొంది. అయితే.. భూగర్భ కారిడార్లను నిర్మించి వ్యయాన్ని తగ్గించుకోవచ్చని కేంద్రం సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలకు భిన్నంగా మెట్రో నిర్మాణ దిశగానే రాష్ట్రం ముందుకువెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వేగం ఎక్కువే.. ప్రస్తుతం మెట్రో రైళ్లు గంటకు గరిష్టంగా 80 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. ఆర్ఆర్టీఎస్ రైళ్లు గరిష్టంగా 160 కి.మీ వేగంతో పరుగులు తీస్తాయి. ఈ రైళ్లు యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ (ఈటీఎస్సీ) సిగ్నలింగ్ వ్యవస్థతో నడుస్తాయి. ఇది మెట్రో రైళ్లలో వినియోగించే సిగ్నలింగ్ వ్యవస్థ కంటే అత్యాధునికమైనది. ఢిల్లీ నుంచి మీరట్ వరకు 82.15 కి.మీ మార్గంలో ఆర్ఆర్టీఎస్ నడుస్తోంది.‘నమో భారత్’ పేరుతో ఈ రైళ్లను నడుపుతున్నారు. -
కార్నీ పర్యటన ప్రారంభం
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం భారత్ చేరుకున్నారు. ఉన్నతాధికారుల బృందంతో కలిసి శుక్రవారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో దిగారు. అనంతరం పలువురు వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. ఆదివారం కార్నీ ఢిల్లీ చేరుకుంటారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో కూడా భేటీ అవుతారు. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యానంతరం ఇరుదేశాల సంబంధాలు బాగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. వాటిని తిరిగి బలోపేతం చేసుకోవడంతో పాటు పలు రంగాల్లో నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడమే లక్ష్యంగా కార్నీ భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత్, కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా వాణిజ్యం, ఇంధనం, టెక్నాలజీ సహా పలు రంగాలపై ప్రధానులు లోతుగా చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ పేర్కొంది. -
భారత్ వృద్ధి పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను కలిగి ఉందని, 2023లోనూ ఇదే హోదాను కొనసాగిస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. మహమ్మారి, ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఎకానమీ వృద్ధి బాటన తన ప్రత్యేకతను చూటుకుంటోందని 9.35 లక్షల మంది ఉద్యోగులకు ఇచ్చిన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. పటిష్ట వినియోగ విశ్వాసం, పెట్టుబడులు భారత్ వృద్ధి బాటకు మద్దతు నిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలోకి వస్తుందన్న భరోసాను వెలిబుచ్చారు. టాటా సన్స్ విజయాలు... టాటా సన్స్ 2022లో అద్భుత విజయాలను సాధించినట్లు కూడా ఈ సందర్భంగా వివరించారు. గ్రూప్‌లోకి ఎయిర్ ఇండియాను తిరిగి తీసుకురావడం, కస్టమర్లకు చక్కటి సేవలకు సంబంధించి టాటాన్యూ ఆవిష్కరణ, క్యాలెండర్ ఇయర్లో 5,00,000 టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు, టాటా ఈవీ కార్ల 10 శాతం మార్కెట్ వాటా వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టాటా సంస్థలకు ఇదే విజయవంతమైన ప్రయాణం వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘మనం మన సంస్థల పురోగతి, వ్యాపారాలు, వాటాదారుల ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా.. మన దేశం, ప్రజల సమోన్నతి సాధనకు భవిష్యత్తుపై మరింత విశ్వాసంతో పురోగమిస్తాం. సాంకేతికత, తయారీ, స్థిరత్వ అంశాల్లో కొత్త ప్రమాణాలను మనం నెలకొల్పగలుగుతాము’’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. -
శరవేగంగా గజ్వేల్ అభివృద్ధి
గజ్వేల్ : సీఎం కేసీఆర్ చొరవతో గజ్వేల్ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయని, ఈ ప్రాంతాన్ని రాష్ట్రానికే నమూనాగా చూపడానికి ప్రయత్నం జరుగుతున్నని ‘గడ’ఓఎస్డీ హన్మంతరావు తెలిపారు. శనివారం గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కృషిని కొనియాడారు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌పై కేసీఆర్ ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంత రూపురేఖలు మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, తూప్రాన్, కొండపాక మండలాల్లో 300 కిలోమీటర్లు ఆర్అండ్బీ, మరో 300 కిలోమీటర్లు పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నిర్మాణం జరుగుతుండగా ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. అదే విధంగా ప్రతి మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడమేగాకుండా వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ఆడిటోరియం నిర్మాణం జరుగుతుందని, అదే విధంగా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం త్వరలోనే చేపట్టబోతున్నామన్నారు. ఈ కార్యాలయ ప్రాంగణంలో 40 ప్రభుత్వ శాఖలు పనిచేస్తాయని చెప్పారు. భవన నిర్మాణానికి సంబంధించి కొద్దిపాటి మార్పులు చేయడానికి సీఎం నిర్ణయించడం వల్ల పనుల ప్రారంభంలో జాప్యం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ పనులకు కూడా అంకురార్పణ జరుగుతుందన్నారు. అదే విధంగా రూ. 100 కోట్లకు పైగా వ్యయంతో ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నారు. దీంతో పట్టణ పేదలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ‘మోడల్ కాలనీ’నిర్మాణ పనులకు సైతం మార్గం సుగమమైందన్నారు. మొదటి దశలో 1250 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. ప్రస్తుత జూనియర్ కళాశాల ప్రాంగణంలో అధునాతన హంగులతో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. వంద పడకల ఆసుపత్రి పనులు పూర్తి కావచ్చాయని, త్వరలో కొత్త భవనంలో వైద్య సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. పాత భవనాన్ని మాతా శిశు సంరక్షణ కేంద్రంగా మార్చబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇవే కాకుండా మానవ అభివృద్ధి సూచికలైన శిశు మరణాల నివారణ, మహిళా సంక్షేమం, ఇతర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, గజ్వేల్ ప్రెస్‌క్లబ్ కన్వీనర్ పి. ఎల్లారెడ్డి పాల్గొన్నారు. కాగా గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన తొలి ప్రెస్‌మీట్‌ని హన్మంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు తమ సమస్యలపై హన్మంతరావుకు వినతిపత్రం అందజేశారు. -
ముచ్చెర్ల ఫార్మా సిటీని త్వరితగతిన అభివృద్ధిచేయాలి
టీఎస్ఐఐసీ, రంగారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి భేటీ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల కోసం కేటాయించిన భూముల అభివృద్ధిని వేగవంతం చేయాలని, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల ఫార్మాసిటీ, ఇతర పరిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలికసదుపాయాల కల్పన సంస్థ(టీఎస్ఐఐసీ), రంగారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముచ్చెర్ల ఫార్మాసిటీలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫార్మాసిటీకి అప్రోచ్ రోడ్డును వెంటనే నిర్మించాలని ఆదేశించారు. అలాగే పరిశ్రమల కోసం ఎంపిక చేసిన స్థలాల సర్వే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు జిల్లాలో జరుగుతున్న పనులను వివరించారు. 6000 ఎకరాల అటవీ భూమిని సేకరించి దానికి బదులుగా వేరే చోట భూములు ఇచ్చే ప్రక్రియ సాగుతుందని చెప్పారు. నెలరోజుల్లో ప్రక్రియను పూర్తిచేసి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న భూములను వెంటనే గుర్తించి సత్వర అభివృద్ధికి, మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేయాలని జూపల్లి ఆదేశించారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ ఎండీ జయేష్ రంజన్, ఈడీ నర్సింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా జేసీ రజత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


