ఆర్‌ఆర్‌టీఎస్‌.. మెట్రో రైలా? | Rapid Rail Transit System In hyderabad | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌టీఎస్‌.. మెట్రో రైలా?

May 3 2026 7:23 AM | Updated on May 3 2026 7:23 AM

Rapid Rail Transit System In hyderabad

సాక్షి, హైదరాబాద్‌: ర్యాపిడ్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టీఎస్‌).. మెట్రో రెండో దశకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో అనూహ్యంగా  తెరపైకి వచ్చింది. తక్కువ నిర్మాణ వ్యయంతో  వేగవంతమైన రవాణా సదుపాయాన్ని అందజేసే  ఆర్‌ఆర్‌టీఎస్‌ ప్రాజెక్టును హైదరాబాద్‌లో చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం నగరంలో నడుస్తున్న మెట్రో కంటే ఆర్‌ఆర్‌టీఎస్‌ ఎక్కువ వేగంతో పరుగులు తీస్తోంది. ప్రయాణికులకు హైస్పీడ్‌ రైల్‌ అనుభూతిని అందజేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధిమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. మెట్రో రెండోదశ నిర్మాణంలో భాగంగానే ప్రభుత్వం మొదటి దశ  ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి కొనుగోలు చేసింది. కానీ.. ప్రస్తుత మెట్రో కంటే  ఢిల్లీ నుంచి మీరట్‌కు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆర్‌ఆర్‌టీఎస్‌ తరహాలో హైదరాబాద్‌లో నిర్మించాలని పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రం అనుమతి కోసం పంపించిన రెండో దశ డీపీఆర్‌లకు అనుమతి లభిస్తుందా లేక, ఆర్‌ఆర్‌టీఎస్‌కే కేంద్రం కట్టుబడి ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.  
మెట్రో రెండో దశకు భారీ వ్యయం..  
రెండో దశలో మొత్తం 8 కారిడార్‌లలో మెట్రో విస్తరణకు  ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. నాగోల్‌ నుంచి ఎయిర్‌పోర్ట్,(36,8 కి.మీ.) రాయదుర్గం నుంచి కోకాపేట్‌ నియోపోలిస్‌ (11.6 కి.మీ, ) ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియూపూర్‌–పటాన్‌చెరు (13.4 కి.మీ.),ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్‌ (7.1 కి.మీ.) చొప్పున మొత్తం 76.4 కి.మీ వరకు.. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీ (39.6 కి.మీ.), జేబీఎస్‌–మేడ్చల్‌  (22 కి.మీ.), జేబీఎస్‌– శామీపేర్‌పేట్‌ (22కి.మీ,) కారిడార్‌లలో మరో 86.1 కి.మీ మెట్రో నిర్మాణం చేపట్టాలనేది ప్రతిపాదన.  

ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.48 వేల కోట్లు.. 
ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.48 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. మొదటి దశ కొనుగోలు కోసం వెచి్చంచే సుమారు రూ.15000 కోట్ల వ్యయంతో కలిపి  రూ.63000 కోట్లకు  చేరనుంది. మెట్రో రెండో దశకు అవసరమైన నిధులను జైకా,ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి కేవలం 2 శాతం వడ్డీకి  నిధులను సేకరించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఈ మేరకు ఇప్పటికే  ప్రాథమికంగా జైకాతో  ఒప్పందం కూడా ఏర్పడింది. కేవలం రూ.48000 కోట్లతో 192.2 కి.మీ వరకు ఆర్‌ఆర్‌టీఎస్‌ ప్రాజెక్టును చేపట్టవచ్చని కేంద్రం  ప్రతిపాదిస్తోంది. 

నిర్మాణ వ్యయం తగ్గుతుందని.. 
పటాన్‌చెరు–లక్డీకాపూల్‌– ఆరాంఘర్, రాయదుర్గం–కోకాపేట్, ఎల్‌బీనగర్‌– హయత్‌నగర్, ఎంజీబీఎస్‌– చాంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్ట్‌–ఫ్యూచర్‌సిటీ, జేబీఎస్‌–మేడ్చల్, జేబీఎస్‌– శామీర్‌పేట్‌ రూట్లలో ఆర్‌ఆర్‌టీఎస్‌ చేపట్టాలని మెట్రోరైల్‌ సంస్థకు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. కానీ.. ప్రతిపాదిత ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ పేర్కొంది. అయితే.. భూగర్భ కారిడార్‌లను నిర్మించి వ్యయాన్ని తగ్గించుకోవచ్చని కేంద్రం సూచించినట్లు  సమాచారం. ఈ ప్రతిపాదనలకు  భిన్నంగా మెట్రో నిర్మాణ దిశగానే రాష్ట్రం ముందుకువెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

వేగం ఎక్కువే.. 
ప్రస్తుతం మెట్రో రైళ్లు గంటకు గరిష్టంగా 80 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. ఆర్‌ఆర్‌టీఎస్‌ రైళ్లు గరిష్టంగా 160 కి.మీ వేగంతో పరుగులు తీస్తాయి. ఈ రైళ్లు  యూరోపియన్‌ ట్రైన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (ఈటీఎస్‌సీ) సిగ్నలింగ్‌ వ్యవస్థతో నడుస్తాయి. ఇది మెట్రో రైళ్లలో వినియోగించే  సిగ్నలింగ్‌ వ్యవస్థ కంటే అత్యాధునికమైనది. ఢిల్లీ నుంచి  మీరట్‌ వరకు  82.15 కి.మీ మార్గంలో ఆర్‌ఆర్‌టీఎస్‌  నడుస్తోంది.‘నమో భారత్‌’ పేరుతో ఈ రైళ్లను నడుపుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement