breaking news
rajarani
-
ఆమే మా బాస్
నజ్రియానే మా కుంటుంబానికి బాస్. ఇలా అంటున్నదేవరో కాదు స్వయానా ఆమె జీవిత భాగస్వామి ఫాహత్ ఫాజిల్‌నే. కోలీవుడ్‌లో ఐదే ఐదు చిత్రాలతో నాయకిగా ఉన్నత స్థాయికి చేరుకున్న అతి కొద్ది మంది నటీమణుల్లో నజ్రియా ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. నేరం, రాజారాణి, వియై మూడి పేసవుం, తిరుమణం ఎన్నమ్ నిక్కా, నూయ్యాండి చిత్రాలతో తమిళ ప్రేక్షకుల మనసును దోచుకున్న నటి నజ్రియా. సొంత గడ్డపై కొన్ని చిత్రాలు చేసిన ఈ బ్యూటీ నటిగా పరిచయమైన అతి తక్కువ కాలంలోనే మలయాళ నటుడు ఫాహత్ ఫాజిల్‌ను ప్రేమించి పెళ్లాడి నటనకు విరామం ఇచ్చారు. ఇది ఆమె అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిందనే చెప్పాలి.అయితే అలాంటి వారందరికీ సంతోషాన్నిచ్చే సమాచారం ఏమిటంటే నజ్రియా మళ్లీ తెరపై మెరిసే అవకాశం ఉందన్నది. ఈ విషయాన్ని ఆమె భర్త ఫాహత్నే ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారన్నది గమనార్హం. ఆయనేమన్నారో చూద్దాం. నజ్రియానే మా కుటుంబానికి బాస్. దీన్ని నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను. వివాహానంతరం నటించరాదని నజ్రియాకు నేను ఆంక్షలు విధించలేదు. ఈ విషయాన్ని తాను అప్పుడే చెప్పాను. ఇప్పుడూ అదే అంటున్నాను. తనే సంసార జీవితం కోసం నటనకు దూరమైంది. నజ్రియా మళ్లీ ఎప్పుడైనా నటించడానికి రావచ్చు. మంచి స్క్రిప్ట్ కోసం వేచి చూస్తోంది. ఎప్పుడు రీఎంట్రీ అవుతుందన్నది నజ్రియానే వెల్లడిస్తే బాగుంటుంది. తను నటనను కంటిన్యూ చేయడంలో నాకెలాంటి ఆక్షేపణ లేదు అని ఫాహత్ పేర్కొన్నారు. సో నటి నజ్రియా రీఎంట్రీ ఖరారైనట్లే. అయితే ఏ భాషా చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. -
అంత అందంగా ఉన్నానా?
ఒక్కోసారి మన మనోబలం ఎంతనేది ఇతరులు చెబితేగానీ అర్థం కాదు. సరిగ్గా నయనతారకు ఇటీవల ఇలాంటి పరిస్థితే ఎదురైందట. నటిగా నయనతార ప్రతిభ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె రీ ఎంట్రీ తర్వాత ఆరంభం, రాజారాణి వరుసగా విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఫలితాల కోసం నయన్ చాలా ఆతృతగా ఎదురు చూస్తోందట. ఈ రెండు చిత్రాల్లోనూ నయనతార అందం, అభినయం చాలా కొత్తగా ఉంటాయట. ఈ విషయం చిత్ర యూనిట్ నోట విన్న నయనతార ఆనందంతో పొంగిపోతోందట. నిజంగా తాను అంత అందంగా ఉన్నానా అని అద్దంలో చూసి ప్రశ్నించుకుంటోందట. మరో విషయం ఏమిటంటే నయన్ సేవా కార్యక్రమాలపై దృష్టి సారించింది. అనేక అనాథ శరణాయాలకు వెళ్లి తగిన సాయం అందిస్తోంది. ఇది తాను మనస్ఫూర్తిగా, ఆత్మసంతృప్తి కోసం చేస్తున్న కార్యక్రమమని, బయట ఎక్కడా ప్రచారం చేయవద్దని సన్నిహితులతో చెబుతోందట. ఉన్నట్లుండి ఈ సాయం వెనుక రహస్యమేమైనా ఉందా అని కోలీవుడ్ ఆరా తీస్తోంది. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ల తదుపరి అడుగు రాజకీయ అరంగేట్రం అన్నట్లుగా మారింది కదా పరిస్థితి. ఇటీవలి హీరోయిన్ నమిత కూడా సామాజిక కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. అంతే కాకుండా త్వరలో రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తానని చెప్పింది. దాంతో ఎందుకైనా మంచిదని ముందుచూపుతో నమిత సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.