breaking news
raise money
-
కరోనాతో భర్తను కోల్పోయిన బామ్మ.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కరోనాతో ఆప్తులను కోల్పోయిన బాధతోపాటు, తీరని ఆర్థిక ఇబ్బందులు వారిని కోలుకోలేని దెబ్బతీశాయి. అయితే స్వయంగా కరోనా బాధితురాలు, ఈ కష్టాలను స్వయంగా చూసిన 87 ఏళ్ల బామ్మ ‘పెద్దమనసు’ విశేషంగా నిలిచింది. ఆ వివరాలు.. కోవిడ్-19కారణంగా భర్త రాజ్‌కుమార్‌ను కోల్పోయిన ఉషాగుప్తా (87) మొదట్లో చాలా కృంగిపోయారు. ఆరు దశాబ్దాల తమ ప్రేమ సౌధం ఒక సెకనులో కూలిపోయినట్టుగా పుట్టెడు దుఃఖం ఆవిరించింది. చివరికి ఆ బాధను దిగమింగి, కరోనా బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు నడుం బిగించారు. నడుం ఒంగిపోయిన తన వల్ల ఏమవుతుందిలే అని మిన్నకుండిపోలేదు. తన చేతనైన విద్య ద్వారా అసహాయులకు ఆపన్న హస్తం అందించేందుకు నిర్ణయించారు. అలా రూపుదిద్దుకున్నదే ‘పికెల్డ్ విత్ లవ్’ వ్యాపారం. ఉషా గుప్తా, రాజ్‌కుమార్ దంపతుల 60 ఏళ్ల వైవాహిక జీవితాన్ని చూసి ఆ కరోనాకు కన్నుకుట్టిందేమో.. ఇద్దరికీ ఒకేసారి మహమ్మారి వైరస్ సోకింది. అయితే ఉష కోలుకున్నప్పటికీ, ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో 27 రోజులపాటు పోరాడిన ఆమె భర్త రాజ్‌కుమార్ కన్నుమూశారు. దీంతో ఉషాగుప్తా ఒక్కసారిగా అగాధంలోకి కూరుకు పోయినంత ఆవేదన చెందారు. భర్త మరణానికి తోడు, ఆక్సిజన్ కొరత, బెడ్లు దొరక్క ఢిల్లీ ఆసుపత్రిలో కరోనా బాధితుల కష్టాలను గుర్తు చేసుకుని మరింత చలించిపోయారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న రోగులు, వారి బంధువుల నిస్సహాయతను చూసి కలత చెందారు. హాస్పిటల్లో చుట్టూ చాలా కష్టాలు చూశాను. ఆక్సిజన్ కొరత ఒకటైతే.. అక్కడున్నవారంతా ఏదో యుద్ధంలో ఉన్నట్టనిపించింది. అందరిలో చాలా అందోళన అంటూ తన అనుభవాలను ఉష గుర్తుచేసుకున్నారు “నా భర్తను కోల్పోయిన తరువాత సర్వం కోల్పోయిన వేదన అనుభవించాను. అదే సందర్భంలో కరోనా కుటుంబాలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేసిందో ఈ సందర్భంగా చూశాను, ముఖ్యంగా ఆర్థికంగా ఎలాంటి అండ లేనివారిని చూస్తే బాధ అనిపింది. అందుకే తోచినంత సహాయపడాలని అనిపించింది’’ అని ఉషా చెప్పారు. పికెల్డ్ విత్ లవ్ ఉషాకుమొదటినుంచి రుచికరమైన వంటలు, పచ్చళ్లు చేయడం అలవాటు. అందుకే దాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. ‘పికెల్డ్ విత్ లవ్’ పేరుతో ఈ నెలలోనే ( 2021, జూలై) పచ్చళ్ల వ్యాపారం మొదలు పెట్టారు. దీని ద్వారా వచ్చిన డబ్బులను బాధితులను అందిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇందులో ఉషా కుమార్తె తోడ్పాటుతో పాటు, మనవరాలు, ఢిల్లీకి చెందిన శిశువైద్యురాలు డా. రాధిక బాత్రా పాత్ర కూడా చాలా ఉంది. వాస్తవానికి భర్త పోయిన వేదనలో ఉన్న అమ్మమ్మకు స్వాంతనివ్వడంతోపాటు, బాధితుల కష్టాలను చూసి చలించిపోతున్న ఆమెకు ఊరట కలిగేలా ఏదైనా చేయాలని ఆలోచించారు. అలా పుట్టిందే ‘పికెల్డ్ విత్ లవ్’. చిన్నప్పటినుంచీ అమ్మమ్మ చేతి కమ్మనైన వంటలు, రకరకాల పచ్చళ్లేరుచే రాధికను ఈ వ్యాపారం వైపు ఆలోచించేలా చేసింది. ఎందుంటే అమ్మమ్మ చేతివంట ఎంత రుచిగా ఉంటుందో ఆమెకు బాగా తెలుసు. అందుకే అమ్మమ్మను ఆ వైపుగా ప్రోత్సహించారు. అంతేకాదు దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా స్వయంగా రాధిక దగ్గరుండి పూర్తి చేశారు. సంబంధిత వ్యక్తులు అనేక మందితో చర్చించి, బాటిల్స్ ఎక్కడ సేకరించాలి, లేబుల్స్, ఇలాంటి వ్యాపారానికి అవసరమైన అన్ని అనుమతులు, తదితర విషయాలపై సమాచారాన్ని సేకరించారు. వెంచర్ పేరు, లోగో సిద్ధం చేశారు. అంతే.. వెంచర్ అలా మొదలైందో లేదో, చీఫ్ చెఫ్ నానీకి అంతులేని క్రేజ్ వచ్చేసింది. సాధారణంగానే ప్రారంభ ఆర్డర్లన్నీ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండే వచ్చాయి. కానీ, అనూహ్యంగా వారికి తెలియకుండానే 180 సీసాల ఊరగాయలు, చట్నీలు విక్రయించారు. ఇది వారిలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. అమ్మమ్మ సాయంతో ఒకేసారి పది కిలోల మామడికాయ పచ్చడి పెట్టే సామర్థ్యం తనకు వచ్చిందంటూ డా. రాధిక సంతోషం వ్యక్తం చేశారు. మొదట్లో ఖట్టా ఆమ్ (పుల్ల మామిడి), తురిమిన మామిడి పచ్చడి, గులాబీ మీఠా ఆచార్ అనే మూడు రుచులతో ప్రారంభమైన ప్రస్తానం మిక్స్డ్ వెజిటబుల్ పికెల్, చింతకాయ పచ్చడి దాకా విస్తరించింది. ఇపుడు వీటికే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని డాక్టర్ రాధిక చెప్పారు. ప్రతి పచ్చడి బాటిల్‌ను అందమైన రిబ్బన్‌తో , ఉషా చేతితో రాసిన నోట్‌తో పంపించడం తమ పికెల్డ్ విత్ లవ్ స్పెషాల్టీ అని ఆమె చెప్పారు. అమ్మమ్మ గారి టాలెంట్ ఇంతటితో ఆగిపోలేదు. పలు రెసిపీలతో ‘ఇండియన్ శాకాహారీ వంజన్’ అనే కుక్‌బుక్ కూడా రాశారు ఉష. 200 గ్రాముల ఊరగాయను 150 రూపాయలకు విక్రయిస్తామని, ఇప్పటికి 20 వేల రూపాయలు సమకూరాయని ఉషా చెప్పారు. తనకు ప్రతి రూపాయి అపురూపమే.. చిన్న మొత్తంలో అయినా ఒకరికి సాయం చేయడం ఎంతో ఆనందాన్నిస్తోందంటారు ఉషా. అలాగే తన పచ్చళ్లకు లభిస్తున్న ఆదరణకు కూడా మరింత ఉత్సాహానిస్తోందన్నారు. ఆ శక్తి నిజంగా ప్రేమకు ఉండి ఉంటే.. కరోనాను తరిమికొట్టే శక్తి నిజంగా ప్రేమకు ఉండి ఉంటే.. తాతగారు చనిపోయేవారు కాదని, ఎపుడో రికవరీ అయ్యి ఇంటికి చేరేవారంటారు రాధిక భావోద్వేగంగా. ఎందుకంటే ఆసుపత్రిలో చేరిన తరువాత ఒక్క క్షణం కూడా ఆయనను విడిచి ఉండలేదు. అలా అమ్మమ్మ కోవిడ్‌నుంచి కోలుకుంటూ తాతగారిని కంటికి రెప్పలా చూసుకున్నా కానీ ఫలితం లేక పోయిందన్నారు తాత రూపాన్ని కళ్లనిండా నింపుకుంటూ... (ద బెటర్ ఇండియా కథనం ఆధారంగా) -
రూ.10,000 కోట్ల సమీకరించనున్న జేఎస్పీఎల్
న్యూఢిల్లీ: నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) కంపెనీ, ఎన్సీడీలు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.10,000కోట్ల నిధులు సమీకరించనున్నది. ఆగస్టులో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో ఈ నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం కోరతామని జేఎస్పీఎల్ పేర్కొంది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్సీడీ) జారీ ద్వారా రూ.5,000 కోట్లు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.5,000 కోట్లు నిధుల సమీకరించే ప్రతిపాదనకు సోమవారం జరిగిన కంపెనీ బోర్డ్ మీటింగ్ ఆమోదం తెలిపిందని జేఎస్పీఎల్ వెల్లడించింది. -
విదేశాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ బాండ్ల విక్రయం
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ అంతర్జాతీయ బాండ్ మార్కెట్ నుంచి 50 కోట్ల డాలర్ల నిధులు సమీకరించనున్నది. 750 కోట్ల డాలర్ల గ్లోబల్ మీడియం టర్మ్ నోట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ పదేళ్ల మెచ్యూరిటీ ఉన్న ఈ 50 కోట్ల డాలర్ల బాండ్ల విక్రయాన్ని చేపట్టింది. ఈ ఏడాది ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టిన తొలి భారత ఆర్థిక సంస్థగా ఐసీఐసీఐ బ్యాంక్ నిలిచింది. ఈ బాండ్లను ఐసీఐసీఐ బ్యాంక్ తన దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్సెంటర్ బ్రాంచ్ ద్వారా విక్రయిస్తోంది. ఈ బాండ్ల విక్రయం సోమవారం రాత్రి ముగియనున్నది. ఈ ఇష్యూకి మూడీస్ సంస్థ బీఏఏ3 రేటింగ్‌ను, ఎస్ అండ్ పీ సంస్థ బీబీబీమైనస్ రేటింగ్‌ను ఇచ్చాయి. ఈ రెండు రేటింగ్‌లు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌ను సూచిస్తాయి. తన ఆర్థిక లక్ష్యాలను సాధించే సత్తా ఆ సంస్థకు ఉందని ఈ రేటింగ్‌లు పేర్కొంటున్నాయి.