breaking news
Railway income
-
దక్షిణమధ్య రైల్వేలో భారీ కుదుపు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేకు భారతీయ రైల్వేల్లోనే ఐదోస్థానం ఉంది. ప్రయాణికుల రాకపోకల్లోనూ, సరుకు రవాణాలోనూ రికార్డుస్థాయిలో ఆదాయం వస్తుంది. అలాంటి దక్షిణమధ్య రైల్వే ఘనత ఇక మసకబారనుంది. మొట్టమొదట హైదరాబాద్ కేంద్రంగా నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే సేవలు ఆరంభమయ్యాయి. భారతీయ రైల్వేలో విలీనమైన తరువాత 1966 అక్టోబర్ 2వ తేదీన దక్షిణమధ్య రైల్వే జోన్ (south central railway) ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొంతభాగంతో కలిపి మొత్తం 6 డివిజన్లతో సేవలందజేస్తున్న దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధి ప్రస్తుత విభజనతో గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం సుమారు 650 రైళ్లు ప్రతి రోజు రాకపోకలు సాగిస్తున్నాయి. 12 లక్షల మందికి పైగా ప్రయాణికులు దక్షిణమధ్య రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు.విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణమధ్య రైల్వే పరిధి గణనీయంగా తగ్గనుంది. ప్రయాణికులు, రైళ్ల రాకపోకలతో పాటు, ఆదాయం కూడా భారీగా తగ్గుముఖం పట్టనుందని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం నగరంలోని వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిలో సగానికి పైగా కొత్త జోన్‌కు తరలి వెళ్లనున్నారు. డివిజన్ల సంఖ్య కూడా 6 నుంచి 3 కు తగ్గనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో ఉంటాయి. వీటితో పాటు లాలాగూడ వర్క్‌షాపు ఉంటుంది. అలాగే లాలాపేట్‌లోని రైల్వే కేంద్ర ఆసుపత్రిలో విధులు నిర్వహించే డాక్టర్లు, అధికారులు, సిబ్బంది విభజన కూడా అనివార్యం కానుంది. తగ్గనున్న పరిధి..ప్రస్తుతం సుమారు 6400 కి.మీ.పరిధిలో దక్షిణమధ్య రైల్వే రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే 12 లక్షల మంది ప్రయాణికుల ద్వారా ప్రతి రోజు రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తుంది. జోన్ విభజన వల్ల ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకు తగ్గనుంది. జోన్ పరిధి కూడా 2500 కి.మీ. వరకు తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలోని జిల్లాల కంటే హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. ఆదాయార్జనలో హైదరాబాద్ మాత్రమే కీలకం కానుంది.‘ప్రయాణికులు ఏ జోన్ ఒరిజినేటింగ్ (ప్రారంభ) స్టేషన్ నుంచి బయలుదేరితే టిక్కెట్లపైన వచ్చే ఆదాయం ఆ జోన్‌కే చెందుతుంది. ఈ లెక్కన విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి వంటి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి లభించే ఆదాయం దక్షిణ కోస్తా జోన్‌కు వెళ్లనుంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి బయలుదేరే ప్రయాణికుల ఆదాయం దక్షిణమధ్య రైల్వేకు లభిస్తుంది. దీంతో ఈ జోన్ పరిధిలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గనుంది. ఇప్పటికే దక్షిణకోస్తా జనరల్ మేనేజర్ నియామకం పూర్తయిన దృష్ట్యా మరో ఐదారు నెలల్లో జోన్‌లోని అన్ని విభాగాల విభజన ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక అధికారి అభిప్రాయపడ్డారు.ఉద్యోగుల విభజన... దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని అన్ని విభాగాల్లో 1.05 లక్షల మంది పనిచేయవలసి ఉండగా ప్రస్తుతం 92 వేల మంది పని చేస్తున్నారు. 14 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డివిజన్లలో విధులు నిర్వహించే డివిజనల్ రైల్వేమేనేజర్లు మొదలుకొని ఆయా డివిజన్లకు చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది యదావిధిగా అక్కడే ఉంటారు. కానీ హైదరాబాద్ కేంద్రంగా ఉమ్మడి కార్యాలయాలుగా ఉన్న రైల్‌నిలయం, లేఖాభవన్, రైల్ నిర్మాణ్ భవన్, రైల్వే కేంద్రీయ ఆసుపత్రిల్లో పని చేసే అధికారులు, సిబ్బంది మాత్రం రెండు జోన్లకు చెందనున్నారు. చదవండి: నాలుగో నగరి భవిష్యత్తు.. మూడో నగరిలో..ఈ కార్యాలయాల్లో 3500 మందికి పైగా పనిచేస్తున్నారు. విభజన నేపథ్యంలో 2000 మందికి పైగా దక్షిణ కోస్తాకు బదిలీ కానున్నారు. విభజన ఏర్పాట్లు ప్రాథమిక దశలో ఉన్నాయని, అన్ని అంశాల్లోనూ త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఒక అధికారి వివరించారు. పూర్తిస్థాయి విభజన జరిగిన తరువాత కొత్త జోన్ అవతరణ తేదీని ప్రకటించనున్నట్లు చెప్పారు. -
రైల్ టికెట్ ధర తక్కువే.. ఆదాయం రూ.లక్షల కోట్లు.. ఎలా సాధ్యమంటే..
దేశంలో రైల్వే అతిపెద్ద రవాణ వ్యవస్థగా చలామణి అవుతోంది. ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. అందులో ఛార్జీలు తక్కువ ఉండటంతో సామాన్య జనాలు కూడా రైలు ప్రయాణం వైపే మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఛార్జీలు వసూలు చేస్తూ రైల్వేశాఖ లక్షల కోట్లు ఆర్జిస్తోంది. అయితే దాదాపు 15 లక్షల మంది పనిచేస్తున్న ఈ సంస్థ టికెట్ ఛార్జీలపైనే ఆధారపడి ఇంతపెద్ద నెట్‌వర్క్‌ను ఎలా నిర్వహిస్తుంది..? అంతమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి తగినంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానం రాకమానదు.. కేవలం టికెట్ల ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా చాలా మార్గాల్లో రైల్వేశాఖ డబ్బు సమకూర్చుకుంటోంది. అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ట్రెయిన్లో ఎక్కడికైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నప్పుడు రిజర్వేషన్ లభిస్తుందో లేదోనని ముందుగానే ఐఆర్సీటీసీలో లేదా రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్లలో టికెట్లను బుక్ చేస్తుంటారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం దాదాపు అందరూ ఆన్లైన్ ద్వారానే బుక్ చేస్తున్నారు. వేసవి సెలవులు, రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, పండుగ సీజన్లలో రైలు టికెట్లు దొరకడం చాలా కష్టం. అందుకే అడ్వాన్స్‌గా రిజర్వేషన్ చేస్తుంటారు. బుక్ చేసుకున్న తర్వాత ఏవైనా మార్పులు ఉంటే రైల్ టికెట్లను రద్దు చేస్తుంటారు. ఒకసారి టికెట్ క్యాన్సిల్ చేస్తే మనం మందుగా చెల్లించిన మొత్తం తిరిగిరాదు. అందులో క్యాన్సలేషన్ ఛార్జీలు, ఇతరత్రా ఛార్జీల పేరిట రైల్వేశాఖ అదనపు భారాన్ని విధిస్తోంది. దాంతోపాటు బుక్ చేసుకున్న సమయంలో టికెట్ బుక్ కాకుండా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి, చివరి సమయం వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా ఛార్జీలు విధిస్తుంటారు. అలా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి క్యాన్సిల్ అయిన టికెట్ల ద్వారా రైల్వేశాఖకు 2021-24(జనవరి వరకు) మధ్యకాలంలో ఏకంగా రూ.1,229.85 కోట్లు సమకూరినట్లు తెలిసింది. ఖజానాలో ఇలా తేరగా వచ్చిచేరే ఆదాయంతోపాటు రైల్వే వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తోంది. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. అద్దెలు: రైల్వేశాఖ కొన్ని ప్రముఖ నగరాల్లో వాణిజ్యభవనాలు నిర్మించి, వాటిని ఇతర ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అద్దెకు ఇస్తుంది. దాంతో ఆదాయం సమకూర్చుకుంటోంది. టోల్లు: క్లిష్టమైన మార్గాల్లో బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయడం వంటి రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ అక్కడి ప్రయాణికుల ద్వారా టోల్ ఆదాయాన్ని పొందుతుంది. కేటరింగ్ సేవలు: ఇందులో రెండు మార్గాల ద్వారా రైల్వేకు ఆదాయం సమకూరుతుంది. ఒకటి ఆన్లైన్ కేటరింగ్, రెండోది ఆఫ్‌లైన్ కేటరింగ్. ఆన్లైన్ కేటరింగ్ జొమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరి సంస్థలతో జతకూడి రైళ్లలోని ప్రయాణికులకు సేవలిందిస్తూ ఆదాయం సమకూర్చుకుంటుంది. ఒకవేళ ప్రయాణికులు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే పర్సంటేజ్ ప్రకారం ఫుడ్ డెలివరీ సంస్థకు కొంత, రైల్వేశాఖకు కొంతమేర ఛార్జీల రూపంలో డబ్బు వెళ్తుంది. ఇక ఆఫ్‌లైన్‌లో.. నిత్యం రైల్ కాంపార్ట్‌మెంట్‌లో నేరుగా ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు, స్నాక్స్, ఫుడ్.. అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది. క్లెయిమ్ చేయని వస్తువుల అమ్మకం: కొన్నిసార్లు గూడ్స్ రైళ్లలో రవాణా అయిన వస్తువులు స్టోర్‌రూమ్‌ల్లో చాలాఏళ్లపాటు అలాగే ఉండిపోతాయి. వాటికి సంబంధించిన న్యాయపరమైన నిర్ణయాలు తీసుకుని వేలం వేయడమో లేదా ఇతర మార్గాల ద్వారా వాటిని విక్రయించి సొమ్ముచేసుకుంటారు. తుక్కుగా మార్చి ఆదాయం: రైల్వే విభాగంలో నిత్యం వినియోగిస్తున్న వస్తువులు, కాలం చెల్లిన ఇనుప వస్తువులను తుక్కుగా మార్చి ఇతర కంపెనీలకు బిడ్డింగ్ ద్వారా కట్టబెట్టి ఆదాయం ఆర్జిస్తారు. పెట్టుబడులు: స్టాక్మార్కెట్లో ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్, ఐఆర్ఎఫ్సీ వంటి ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంతో డివిడెండ్ల రూపంలో ఆదాయం సంపాదిస్తోంది. రాయితీ మాఫీ: కరోనా వైరస్ విజృంభించడంతో వయోవృద్ధులు సహా ప్రయాణికులకు ఇచ్చే పలు రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది. వారి నుంచి పూర్తిస్థాయి ఛార్జీలను వసూలు చేసింది. ఇలా వయోవృద్ధులకు నిలిపివేసిన రాయితీ కారణంగా రైల్వే దాదాపు రూ.1500 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందినట్లు తేలింది. ప్రకటనలు: ఇతర కంపెనీలు రైల్వేప్లాట్ఫామ్లు, బోర్డింగ్‌లో తమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటాయి. దానికోసం రైల్వేకు డబ్బు చెల్లిస్తారు. ప్లాట్‌ఫామ్ రెంట్‌కు ఇస్తూ..: కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ప్లాట్‌ఫామ్ స్థలాన్ని రెంట్ ఇచ్చి ఆదాయం సమకూరుస్తుంది. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో సినిమా షూటింగ్‌లు వంటివాటికి కూడా ప్లాట్‌ఫామ్‌ను కిరాయికి ఇస్తారు. పైన తెలిపిన ఆదాయ మార్గాలతోపాటు ప్రధానంగా ప్రయాణ టికెట్లు, సరకు రవాణాతో సాధారణంగా రైల్వే ఖజానా నిండుతోంది. ప్రయాణికులు, సరకు రవాణా ద్వారా నవంబరు 2023లో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించినట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఆ నెలలో ప్రయాణికుల నుంచి రూ.469.40 కోట్లు, 11.57 మిలియన్ టన్నుల వస్తు రవాణా ద్వారా రూ.1,131.13 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించింది. రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే రూ.2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాదితో పోల్చుకుంటే 2022-23లో ఆదాయం రూ.49 వేల కోట్లు ఎక్కువ. దీనిలో భారతీయ రైల్వే గరిష్టంగా 1.62 లక్షల కోట్ల రూపాయలను సరుకు రవాణా ద్వారా ఆర్జించింది. టిక్కెట్ల ద్వారా రూ.63,300 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలింది ఇతర ఆదాయం రూపంలో వచ్చింది. ఇదీ చదవండి: జొమాటో యూనిఫామ్‌లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి.. భారతీయ రైల్వే చరిత్ర దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ కాలంలో 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు. మొదటి రైలు బొంబాయి-థానేల మధ్య 34 కి.మీ. దూరం, 14 బోగీలతో, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాలపాటు ప్రయాణించింది. హైదరాబాద్ రాష్ట్రంలో 1873 నాటికి నిజాం స్టేట్ రైల్వే వ్యవస్థ కొలువు తీరింది. మొదటి రైల్వే లైను 1874, జూలై 14న గుల్బర్గా నుంచి సికింద్రాబాద్‌కు ప్రారంభమైంది. 1907లో నాంపల్లి రైల్వే స్టేషన్, 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. 1951లో భారతీయ రైల్వేలను ప్రభుత్వం జాతీయం చేసింది. ప్రపంచంలో పొడవైన రైలు ప్లాట్‌ఫాం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంది. దీని పొడవు 1.3 కి.మీ. ప్రపంచ రైల్వే నెట్‌వర్క్‌లో అమెరికా (2,28,218 కి.మీ.), చైనా (1,21,000 కి.మీ.), రష్యా (87,157కి.మీ.), భారత్ (65,408 కి.మీ.), కెనడా (46,552 కి.మీ.) వరుస స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ప్రయాణించే మొత్తం రైళ్లు 21 వేలు. ఇవి ప్రతి రోజు 13.4 లక్షల కి.మీ. ప్రయాణం చేస్తాయి. అత్యధిక దూరం ప్రయాణం చేసే రైలు వివేక్ ఎక్సెప్రెస్. ఇది కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు నడుస్తుంది. ఇది 110 గంటల్లో 4,273 కి.మీ. ప్రయాణం చేస్తుంది. -
దక్షిణ మధ్య రైల్వే ఆదాయం అదుర్స్
సాక్షి, హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి పథంలో దూసుకుపోయిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ ఒక ప్రకటణలో తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 13673 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇందులో ప్రజా రవాణా ద్వారా రూ. 3861 కోట్లు, సరుకు రవాణా ద్వారా రూ. 9260 కోట్లు ఆర్జించినట్టు వెల్లడించారు. 2016-17 తో పొల్చితే 12 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. 20 అంశాల్లో ఉత్తమ సేవలు అందించినందుకుగాను ఉత్తమ రైల్వే అవార్డు దక్కించుకున్నట్టు తెలిపారు. సగటున రోజుకు 10.4 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్టు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 113 కిలోమీటర్ల కొత్త రైల్వేలైన్లను పూర్తి చేసి, మరో 600 కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుద్దీకరణ చేసినట్టు తెలిపారు. ప్రయాణికుల భద్రత, రక్షణకు రైల్వే అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. అలాగే గత సంవత్సరం 7237 కొత్త కోచ్‌లతో 1454 ప్రత్యేక రైళ్లు నడిపించినట్టు వెల్లడించారు. -
పెరిగిన రైల్వే ఆదాయం
ఆమదాలవలస, న్యూస్‌లైన్: వరుస తుపానులతో తీవ్రంగా నష్టపోయిన రైల్వే ప్రస్తుతం కోలుకుంది. ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ కూడా రెట్టింపైంది. తుపానుల ప్రభావంతో కురిసిన వర్షాలకు ట్రాక్ దెబ్బతినడంతో కొన్ని రైళ్లు రద్దు చేయగా మరికొన్నింటిని దారిమళ్లించి నడిపారు. దీంతో రైల్వే ఆదాయానికి భారీగానే గండి పడింది. ప్రస్తుతం ట్రాక్ పనులు పూర్తైరైళ్లు యథావిధిగా రాకపోకలు సాగిస్తుండడంతో మళ్లీ ప్రయాణికుల రద్దీ పెరిగింది. శుక్రవారం రైళ్లన్నీ కిటకిటలాడుతూ కనిపించాయి. సాధారణ టిక్కెట్ల విక్రయం ద్వారా రూ 3.76 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.