breaking news
rail way police
-
విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు
సాక్షి,విశాఖ : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. కిరండోల్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికల అక్రమణ రవాణా జరుగుతుందనే సమాచారంతో రైల్వే పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 11మంది మైనర్లను రక్షించారు. బాలికల్ని తమిళనాడుకు తరలిస్తున్న ముఠాను నిందితుడు రవి బిసోయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ దర్యాప్తులో ఒరిస్సాలోని నవరంగ్ పూర్ ప్రాంతానికి చెందిన చిన్నారులుగా గుర్తించారు. పూర్తి స్థాయి దర్యాప్తు కోసం విశాఖ రైల్వే పోలీసులు కేసును ఒరిస్సా పోలీసులకు అప్పగించారు. -
భార్య కళ్లెదుటే భర్త అనంత లోకాలకు..
సాక్షి, టెక్కలి రూరల్: జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త కళ్ల ఎదుటే మృతి చెందటంతో భార్య ఆవేదన వర్ణనాతీతం. భర్తతో కలిసి తన పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులతో ఆనందంగా గడిపారు. తిరిగి అత్తవారింటికి వెళ్తుండగా మృత్యువు ట్రైన్ రూపంలో భర్తను తీసుకుపోయింది. పెళ్లై మూడు నెలలు గడవక ముందే ఇంతటి కష్టం రావడంతో ఆమె గుండెలు అవిసేలా రోధించింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం..టెక్కలిలోని పాలకేంద్రం వెనుక నివాసం ఉంటున్న లావణ్యకు మూడు నెలలు క్రితం చిత్తూరుకు చెందిన కావడి భరత్‌తో(29) వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత లావణ్య కన్నవారి ఇంటికి భర్తతో కలిసి 5 రోజులు క్రితం వచ్చారు. అనంతరం తిరిగి మంగళవారం తన అత్తవారి ఊరు అయిన చిత్తూరు వెళ్లేందుకు పయానమయ్యారు. నౌపడ ఆర్ఎస్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు సికింద్రాబాద్ వరకు టిక్కెట్ తీశారు. లావణ్య ట్రైన్ ఎక్కిన తర్వాత భరత్ ట్రైన్ ఎక్కే సమయంలో ట్రైన్ ముందుకు కదిలింది. భార్య కళ్లెదుటే భర్త ట్రైన్ కిందకు వెళ్లిపోవడంతో రెండు కాళ్ల పైనుంచి ట్రైన్ వెళ్లింది. తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ప్రమాదం పై ఫోరెన్సిక్ పరిశీలన
తన టీంతో వివరాలు సేకరిస్తున్న ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డెరైక్టర్ శారద పదిరోజుల్లో నివేదిక; షార్ట్ సర్క్యూటే ప్రమాద కారణం కావచ్చని వ్యాఖ్య ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని స్పష్టీకరణ బెంగళూరులో మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు సాక్షి, హైదరాబాద్, బెంగళూరు/ పుట్టపర్తి అర్బన్, న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా కొత్త చెరువు వద్ద శనివారం తెల్లవారు జామున నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ విచారణ ప్రారంభమైంది. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డెరైక్టర్ శారద అవధానం ఆదివారం తన బృందంతో ఘటనా స్థలాన్ని, ప్రశాంతినిలయం రైల్వే స్టేషన్లో ఉంచిన కాలిపోయిన బీ1 బోగీని పరిశీలించారు. అధికారులు తులసిరాం, శివప్రసాద్, డీఎన్ఏ నిపుణులు గోపీనాథ్, వెంకన్న, సైంటిఫిక్ అసిస్టెంట్ నాగరాజు, క్లూస్‌టీం టెక్నీషియన్ గాంధీ, రైల్వే సీఐ మురళీధర్‌రెడ్డి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ.. బోగీలోని బెర్తుల వారీగా లభించిన వస్తువులను రికార్డు చేస్తున్నామని చెప్పారు. ల్యాబ్‌కు పంపాల్సినవి ఒక వైపు.. రైల్వే పోలీసులు సేకరించినవి మరో వైపు భద్రపరిచి వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. ప్రమాదం జరిగినపుడు బోగీలో పేలుడు సంభవించలేదని ప్రాథమిక అంచనాకు వచ్చామని, షార్ట సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చునన్నారు. అయితే, కచ్చితమైన కారణాన్ని ఇప్పుడే చెప్పలేమని, ఇంత పెద్ద ఘటన వెనుక గల కారణాలను ఘటనాస్థలాన్ని పరిశీలించిన వెంటనే చెప్పడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రమాదానికి విద్రోహచర్య సహా మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా?, మంటలు పెరగడానికి దోహదం చేసేవి బోగీలో ఏమైనా ఉన్నాయా?.. అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నామన్నారు. పదిరోజుల్లో విచారణ నివేదిక సిద్ధం చేస్తామన్నారు. అగ్నిప్రమాదం ప్రారంభమైన చోట తెల్లని బూడిద.. అగ్ని ప్రమాదం జరిగిన బీ1 బోగీలోని ఎల్-2 డోర్ వద్ద ఉన్న బెర్తు కింది భాగంలో తెల్లని బూడిద వంటి పదార్థం దొరికింది. ఇది పేలుడు పదార్థమా లేక టపాసులకు సంబంధించినదా? అనే విషయాన్ని పరిశీలిస్తామని శారద తెలిపారు. బోగీలో అగ్ని ప్రమాదం ప్రారంభమైన చోటే తెల్లని బూడిద బయట పడిందని, దీన్ని ప్రత్యేకంగా సేకరించి సైన్స్ ల్యాబ్‌కు పంపుతున్నామన్నారు. డోర్‌కు ఉన్న రబ్బర్ అంటుకోవడం కారణంగా డోర్ తెరుచుకోకపోయి ఉండవచ్చన్నారు. పదకొండు మృతదేహాల అప్పగింత నాందేడ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో చనిపోయిన 26 మందిలో 11 మృతదేహాలను సంబంధీకులకు రైల్వే శాఖ అధికారులు అప్పగించారు. మిగిలిన వాటిని డీఎన్ఏ పరీక్షల అనంతరం బంధువులు తీసుకువెళ్లవచ్చని తెలిపారు. ఘటనాస్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో భద్రపరిచారు. మృతదేహాలను గుర్తుపట్టిన బంధువులకు వాటిని అధికారులు అప్పగించారు. అయితే వీటిని దహనం చేయకూడదని, ఖననం మాత్రమే చేయాలని సూచించారు. భవిష్యత్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే డీఎన్ఏ పరీక్షలకు వీలుగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ భీమయ్య, సుభాష్‌రెడ్డి, రాతి ప్రేమ్‌లత, రాతి చంపాలాల్, బసవరాజ్, సర్వమంగళ, కులకర్ణి, జుహి నాగ్రే, లీల, సుధ, రామనాథన్ మృతదేహాలను సంబంధీకులకు అప్పగించారు. ఇదిలాఉండగా నిన్నటి వరకూ ప్రమాదం జరిగిన బోగీలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 65గా పేర్కొన్న రైల్వే శాఖ.. ఆదివారం మీడియాకు విడుదల చేసిన బులిటెన్‌లో ఆ సంఖ్యను 68కి పెంచింది. మరోవైపు, మృతుల్లో భీమయ్య, సురేష్‌రెడ్డి పాటిల్‌లకు రిజర్వేషన్ లేదు. అయితే మృతుల్లో వీరు ఉన్నట్టు బంధువులు గుర్తించి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఎటువంటి రిజర్వేషన్ లేకుండా బోగీలో వారెలా ప్రయాణిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయుడి ఆత్మహత్య మృత్యుబోగీని చూసి చలించిపోయిన ఉపాధ్యాయుడొకరు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. పుట్టపర్తికి చెందిన బసవరాజు ఉపాధ్యాయుడు. ప్రమాదం జరిగినప్పటి నుంచీ దిగాలుగా ఉన్న బసవరాజు.. ఆదివారం ఉదయం రైల్వేస్టేషన్లో ప్రమాదం జరిగిన బోగీని చూస్తూ.. స్టేషన్లోకి వస్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ కిందపడి ప్రాణాలు తీసుకున్నారు.