breaking news
promotional material
-
అవసరమైనప్పుడు మరిన్ని చర్యలుంటాయ్
న్యూఢిల్లీ: ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రంగాలకు మరిన్ని ప్రోత్సాహక చర్యలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. వృద్ధికి ప్రోత్సాహకంగా అవసరమైనప్పుడు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినియోగాన్ని పెంచడం ద్వారా వృద్ధికి ఊతమిస్తాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సీనియర్ అధికారులతో కలసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పెంచబోతున్నట్టు తన కార్యాలయం మినహా అంతటా వదంతులు వ్యాప్తి చెందుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ నెల 18న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార బకాయిలపై అవగాహన ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి చెప్పారు. ఆర్థిక రంగం ఎప్పుడు పుంజుకోవచ్చంటూ ఈ సందర్భంగా ఎదురైన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ‘‘నేను ఎటువంటి అంచనాలు వేయను. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటాను. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది’’ అని వివరించారు. స్టాగ్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం పెరుగుతూ, వృద్ధి తగ్గుతుండడం)పై తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ భారత్ స్టాగ్ఫ్లేషన్ దశలోకి వెళుతోందని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. ధరలు దిగొస్తున్నాయి.. ఉల్లిపాయల దిగుమతులతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ధరలు దిగొస్తున్నట్టు మంత్రి చెప్పారు. తాజా పంట దిగుబడులు కూడా మార్కెట్‌కు చేరితే ధరలు మరింత తగ్గుముఖం పడతాయన్నారు. -
యువ ఓటర్లే లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: యువఓటర్ల ప్రాధాన్యాన్ని రాజకీయ పార్టీలే కాదు, ప్రచార సామగ్రి విక్రేతలూ గుర్తించారు. ఎన్నికల ప్రచార సామగ్రి విక్రయించే దుకాణ ల్లో యువ ఓటర్లను ఆకట్టుకునే పలు వస్తువులు కనిపిస్తున్నాయి. యువతీయువకులు ఎక్కువగా ఉపయోగించే నెక్ బ్యాండ్, చీర్ స్టిక్, కార్ పెర్ఫ్యూమర్ వంటి సామగ్రి ఇప్పుడు రాజకీయ పార్టీల నేత చిత్రాలు, పార్టీల గుర్తులతో లభిస్తున్నాయి. ఎన్నికల ప్రచార సామగ్రిలో యువతను ఆకట్టుకునే వస్తువులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆల్ ఇండియా ఎలక్షన్ మెటీరియల్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ చెప్పారు. ఈ ఎన్నికలు నిజంగా యువతరం ఎన్నికలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదివరకు జెండాలు, పోస్టర్లు, బ్యానర్లు మాత్రమే కొనే రాజకీయ పార్టీలు.. కొంతకాలంగా టీషర్టులు, మాస్కుల వంటివాటిని కూడా కొనడం ప్రాంభించాయన్నారు. ఇప్పుడు యువతరాన్ని ఆకట్టుకునే హైటెక్ ప్రచార సామగ్రికి కూడా ఆర్డర్లు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు ఈ సామగ్రిని ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలిపారు. మొబైల్ డైరీలు, ఎల్ఈడీ బ్యాడ్జ్‌లు, రిస్ట్‌బ్యాండ్ కమ్ పెన్‌డ్రైవ్‌లు నెక్ బ్యాండ్, సిలి కాన్ బ్యాండ్, సోలార్ కౌటౌట్లు, త్రీడీ విసనకర్రలు, త్రీడీ పాకెట్ కేలండర్ల వంటి ప్రచార సామగ్రిని రాజకీయ పార్టీలు యువ ఓటర్ల కోసం కొంటున్నాయని ఆయన చెప్పారు. సోలార్ కటౌట్లు రోజంతా సౌరశక్తిని గ్రహించి రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతాయని ఆయన చెప్పారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల వ్యయంపై విధించిన ఆంక్షల కారణంగా తమ సామగ్రి ఎక్కువగా అమ్ముడుపోవడం లేదని దుకాణదారులు అంటున్నారు. మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకుని కూడా ప్రచార సామగ్రిని తయారు చేసినట్లు అనిల్ కుమార్ తెలిపారు. నేతల చిత్రాలు, రాజకీయ పార్టీల చిహ్నాలతో కూడిన సౌందర్య సాధనాలను మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి తయారు చేశామన్నారు. బిందీలు, హెయిర్ క్లిప్పులు, గొలుసులు, కడియాల వంటి వాటినీ అమ్ముతున్నామని అనిల్ వివరించారు. సదర్‌బజార్‌లో లభించే ఎన్నికల ప్రచార సామగ్రిని నగరంలోని పార్టీలతోపాటు పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, బీహార్‌కు చెందిన రాజకీయ పార్టీల నాయకులు కూడా తీసుకెళ్తుంటారని దుకాణదారులు తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు కూడా తాము ప్రచార సామగ్రిని ఆర్డరుపై అందజేస్తుంటామని చెప్పారు. కాగా ఈ ఎన్నికల్లో యువఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండ నుందని పలు సర్వేలు ఇప్పటికే ప్రకటించాయి.