breaking news
Producer Madan
-
మదన్ కోసం ప్రత్యేక బృందాలు
తమిళసినిమా: వేందర్ మూవీస్ నిర్మాత మదన్ కోసం పోలీసు ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో మెడికల్ సీట్ ఇప్పిస్తానని వారి తల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కేసులో ఇతను నిందితుడు. గత నెల 27న ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి అదృశ్యం అయ్యాడు. అప్పటి నుంచి అతని జాడ తెలియరాలేదు. అయితే ఆయనపై కేసుల పరంపర కొనసాగుతోంది. మద్రాసు హైకోర్టు ఆదేశాలతో కేంద్ర నేరపరిశోధన శాఖ అడిషనల్ డిప్యూటీ డెరైక్టర్ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఒక బృందం వారణాసి, మరో మూడు బృందాలు నెల్లై, ఇతర రాష్ట్రాల్లో మదన్ కోసం గాలిస్తున్నాయి. వైద్య సీట్ల ఇప్పిస్తానని మోసం చేశాడని ఇప్పటి వరకు 63 మంది ఫిర్యాదులు చేశారు. రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మదన్ పట్టుబడిన తరువాత ఈ కేసులన్నిటిపై విచారిస్తామని అన్నారు. -
మిస్టరీగా మదన్ అదృశ్యం
►పదిరోజులైనా దొరకని ఆచూకీ ► జీవించే ఉన్నాడా అనే అనుమానాలు ► ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు వేందర్ మూవీస్ చిత్ర నిర్మాత మదన్ అదృశ్యమై పదిరోజులు గడిచినా సంఘటన వెనుకనున్న మిస్టరీ ఇంకా వీడలేదు. దీంతో అతను జీవించే ఉన్నాడా? అనే సందేహాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇద్దరు భార్యలు రంగప్రవేశం చేయడంతో చిత్ర నిర్మాత మదన్ వ్యవహారం సినిమా కథలానే రోజుకో మలుపు తిరుగుతోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: కన్యాకుమారి జిల్లా సుచీంద్రానికి చెందిన నాంజిల్ మదన్..వేందర్ మూవీస్ అనే పేరుతో సినిమా సంస్థను నడుపుతున్నాడు. అలాగే ఎస్ఆర్ఎమ్ చాన్సలర్ పచ్చముత్తుకు అత్యంత సన్నిహితుడు కావడంతో వర్సిటీలో విద్యార్థుల అడ్మిషన్లు పర్యవేక్షిస్తుంటాడు. తన వద్ద ఏజెంట్లుగా పనిచేస్తున్న వారికి పచ్చముత్తు తాను అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఇండి యా జననాయక కట్చి అనే రాజకీయపార్టీలో పదవులు ఇప్పించాడు. ఇన్ని కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మదన్ గత నెల 27న అకస్మాత్తుగా మాయమయ్యాడు. కాశీకి వెళ్లి గంగానదిలో సమాధి అవుతానని పేర్కొంటూ ఆయన ఓ ఉత్తరం రాసిపెట్టి వెళ్లిపోవడం కలకలం సృష్టించింది. ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీకి అనుబంధ సంస్థగా పేరుగాంచిన వేందర్ మూవీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న మదన్ అకస్మాత్తుగా అదృశ్యం కావడం వెనుక అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ఎస్ఆర్ఎమ్ వైద్యకళాశాలలో సీట్లు ఇప్పిస్తానని నమ్మబలికి విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున సొమ్ము రాబట్టాడని..ఆ సొమ్ముతో పాటు ఇతర ఆర్థిక వ్యవహారాలే ఆయన అదృశ్యానికి కారణమని మొదటిరోజు ప్రచారం జరిగింది. అంతేగాక ఓ యువతిని తోడుగా తీసుకుని వెళ్లిపోయాడని కూడా చెబుతున్నారు. మదన్ మాయమై పదిరోజులు కాగా ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అసలు బతికే ఉన్నాడా, ఉత్తరంలో రాసిపెట్టినట్లుగా సమాధి అయ్యాడా అనే సందేహాలు చలామణిలో ఉన్నాయి. ఆయన కారును చెన్నై విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. దీంతో మదన్ విమానంలో వెళ్లాడా లేక అందరినీ నమ్మించేందుకు అక్కడ పెట్టాడా అని కొందరు అనుమానిస్తున్నారు. మదన్ ఆత్మహత్యకు పాల్పడే అవకాశమే లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వైద్యకళాశాలలో సీట్లు ఇప్పిస్తానని మోసం చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మదన్ అదృశ్యం తర్వాతనే ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నట్లు బైటపడింది. సుమలత, సింధులు ఇద్దరూ మొదటి భార్యను నేనంటే నేనంటూ వాదించుకోవడం మరో మలుపు కాగా, వీరిద్దరినీ కాదని మరో యువతితో వెళ్లిపోయాడనే ప్రచారం చిత్రమైన మలుపు. అయితే మదన్ మోసం చేయలేదు, విద్యార్థుల వద్ద తీసుకున్న సొమ్మును పచ్చముత్తుకు అప్పగించాడని అతని తల్లి తంగం చెబుతున్నారు. మదన్‌ను వెతికి తమకు అప్పగించాలని తల్లిదండ్రులు, భార్య సుమలత ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, వేందర్ మూవీస్ మదన్‌కు, ఎస్ఆర్ఎమ్ వర్సిటీకి ఎటువంటి సంబంధం లేదని, విద్యార్థుల అడ్మిషన్ నిమిత్తం తమకు మదన్ నుంచి డబ్బు ఏదీ అందలేదని, విచారణకు సహకరిస్తామని పేర్కొంటూ ఎస్ఆర్ఎమ్ యాజమాన్యం పోలీసు కమిషనర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేసింది. కాగా, గత ఎన్నికల్లో జేసీకే తరఫున తిరునెల్వేలీ నుంచి పోటీచేసి ఓటమి పాలుకావడంతో కోట్లాది రూపాయల అప్పు ఏర్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు బృందాలుగా ఏర్పడి ఈ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. మదన్ తన సెల్‌ఫోన్‌ను స్విచ్ఆఫ్ చేసి ఉంచడంతో సిగ్నల్ ద్వారా కనుక్కునే ప్రయత్నం విఫలమైంది.