breaking news
pharmaceutical brands
-
భారత్‌కు ట్రంప్ భారీ షాక్!
సుంకాల యుద్ధంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు(Impose New Tariffs). బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.ఈ చర్యలు అమెరికాలో తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా ట్రంప్ పేర్కొన్నారు. అప్‌హోస్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. అలాగే బ్రాండెడ్ , పేటెంటెడ్ డ్రగ్స్‌పై(pharmaceutical products) ఏకంగా 100 శాతం విధిస్తామని స్పష్టం చేశారు. అయితే.. అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు సుంకాలు వర్తించదన్నారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ తెలిపారు. భారతంపై ప్రభావం..భారత ఔషధ కంపెనీలకు అమెరికా అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం. 2024లో భారత్ 27.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషదాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. అందులో సుమారు భారత్ 3.6 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలనే అమెరికాకు ఎగుమతి చేసింది. అయితే ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలోనే దాదాపు 3.7 బిలియన్ డాలర్ల ఎగుమతులు అమెరికాకు వెళ్లడం గమనార్హం. ట్రంప్ విధించిన తాజా సుంకాలు బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధాలపై వర్తిస్తాయన్నది స్పష్టత వచ్చింది. సాధారణంగా భారత్ అమెరికాకు ఎగుమతి చేసే మందుల్లో జనరిక్ ఔషదాలే ఎక్కువ. అయితే ట్రంప్ తాజా నిర్ణయం స్పెషాలిటీ డ్రగ్స్ తయారీ చేస్తున్న భారత మల్టీనేషనల్ కంపెనీలపై ఈ ప్రభావం పడనుంది. ఈ నిర్ణయం భారత ఔషధ పరిశ్రమను గట్టి దెబ్బే కొట్టవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సిప్లా, డివిస్ లాబ్స్, అజంత ఫార్మా, అలాగే.. నిఫ్టీ ఫార్మా స్టాక్స్‌పై టారిఫ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. మరింత తప్పదు!ఇప్పటికైతే 100 శాతం సుంకాలు ప్రకటించిన ట్రంప్.. భవిష్యత్తులో మరింత పెంచే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. ఆ సుంకాలు 150% నుంచి 250% వరకు ఉండే అవకాశం ఉంది. ఇక.. అమెరికాలో తయారీ ప్లాంట్లు నిర్మిస్తున్న కంపెనీలకు ట్రంప్ మినహాయింపు ఇచ్చారు. అయితే అమెరికాలో తయారీ ప్లాంట్లు నిర్మిస్తున్న ఉన్న కంపెనీలకు ఈ సుంకాలు వర్తించవని అన్నారు. దీంతో ఇప్పటికే ప్లాంట్లు ఉన్న కంపెనీలకు మినహాయింపు వర్తిస్తుందా అనే విషయంలో స్పష్టత కొరవడింది.ఇదీ చదవండి: ‘ఇడియట్ ట్రంప్’పై సుందర్ పిచాయ్ ఏమన్నారంటే.. -
బ్రాండ్స్ వైపు ఫార్మా చూపు..
♦ గడిచిన నాలుగు నెలల్లో మూడు డీల్స్ ♦ జాబితాలో సన్, స్ట్రైడ్స్, పిరమాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాధారణంగా విదేశాల్లో విస్తరణ కోసం కంపెనీల కొనుగోలు లేదా జనరిక్స్ మార్గాన్ని ఎంచుకునే దేశీ ఫార్మా కంపెనీలు ప్రస్తుతం రూటు మారుస్తున్నాయి. పేరొందిన ఔషధ బ్రాండ్లను కొనుగోలు చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ మొదలుకుని ఇటీవలి సన్ ఫార్మా, స్ట్రైడ్స్ షసన్ దాకా చాలా మటుకు దేశీ సంస్థలు గత కొన్నాళ్లుగా ఈ తరహా డీల్స్ కుదుర్చుకున్నాయి. ఫార్మా దిగ్గజం సన్ .. స్విట్జర్లాండ్ ఫార్మా సంస్థ నొవార్టిస్‌కు చెందిన 14 ప్రిస్క్రిప్షన్ బ్రాండ్లను కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. దీని విలువ దాదాపు రూ. 1,900 కోట్లు (సుమారు 293 మిలియన్ డాలర్లు). వివిధ చికిత్సల్లో ఉపయోగపడే ఈ బ్రాండ్స్ అన్నింటి వార్షికాదాయాలు 160 మిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటాయి. ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతి పెద్ద ఔషధ మార్కెట్ కావడంతో పాటు అత్యధికంగా నియంత్రణలు కూడా ఉండే జపాన్‌లో కార్యకలాపాలు విస్తరించడానికి సన్ ఫార్మాకు ఈ డీల్ ఉపయోగపడనుంది. జపాన్ ఔషధ మార్కెట్ ఏకంగా 73 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని అంచనా. 1 లక్ష కోట్ల డాలర్ల అంతర్జాతీయ ఫార్మా మార్కెట్లో జపాన్‌కు దాదాపు 7 శాతం వాటా ఉంటుంది. ఇక మరోవైపు, స్వీడన్‌కు చెందిన మోబర్గ్ ఫార్మా నుంచి స్ట్రైడ్స్ షసన్ .. జాయింట్ఫ్లెక్స్, ఫెర్గాన్, వ్యాంక్విష్ అనే మూడు బ్రాండ్లను కొనుగోలు చేసింది. ఇందుకోసం 10.4 మిలియన్ డాలర్లు వెచ్చించింది. మోబర్గ్ బ్రాండ్ల కొనుగోలు.. అమెరికా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల్లో ఓవర్ ది కౌంటర్(ఓటీసీ) ఔషధాల విభాగంలో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు తోడ్పడగలదని స్ట్రైడ్స్ పేర్కొంది. దేశీయంగాను.. ఇలా కొన్ని ఫార్మా సంస్థలు విదేశీ మార్కెట్‌పై కసరత్తు చేస్తుండగా.. మరికొన్ని సంస్థలు దేశీయంగాను బ్రాండ్ల కొనుగోలుపై దృష్టి పెట్టాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కొన్నాళ్ల క్రితం బెల్జియం బయోఫార్మా సంస్థ యూసీబీ ఎస్ఏకి చెందిన కొన్ని ఉత్పత్తులను దాదాపు రూ. 800 కోట్లకు కొనుగోలు చేసింది. వాటిని భారత్, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల్లో విక్రయించే హక్కులను దక్కించుకుంది. అటారాక్స్, జెర్టైక్, జైజాల్ వంటివి వీటిలో ఉన్నాయి. డెర్మటాలజీ, పీడియాట్రిక్స్ తదితర విభాగాల్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇవి తోడ్పడగలవని డాక్టర్ రెడ్డీస్ వర్గాలు పేర్కొన్నాయి. అంతక్రితమే నొవార్టిస్ నుంచి హాబిట్రోల్ అనే ఓటీసీ బ్రాండ్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కొనుగోలు చేసింది. పిరమాల్ ఎంటర్ప్రైజెస్ గతేడాది డిసెంబర్లో ఎంఎస్డీ సంస్థ నుంచి అయిదు బ్రాండ్స్‌ను (న్యాచురోలాక్స్, ల్యాక్టోబాసిల్ మొదలైనవి) కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 92 కోట్లు. దేశీయంగా పేరొందిన ఈ బ్రాండ్స్‌ను ఓటీసీ మార్గంలో విక్రయించాలన్నది పిరమాల్ యోచన. భారత ఓటీసీ మార్కెట్ రూ. 15,000 కోట్లు కాగా ఏటా 14 శాతం మేర వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం పిరమాల్‌కి చెందిన ఆరు బ్రాండ్లు టాప్ 100 ఓటీసీల్లో ఉండగా.. తాజాగా ఈ సంఖ్య ఎనిమిదికి చేరింది. అంతకు ముందే బేబీకేర్ బ్రాండ్ లిటిల్స్ను కూడా పిరమాల్ కొనుగోలు చేసింది.