breaking news
Pharm D
-
‘ఆ కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదు’
సాక్షి, న్యూఢిల్లీ : ఆరేళ్ళ ఫార్మ్.డి కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే మంగళవారం రాజ్య సభలో స్పష్టం చేశారు. ఫార్మ్.డి కోర్సును క్లినికల్ ఫార్మసిస్ట్‌లకు సమానంగా గుర్తించాలన్న డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి వస్తున్నా ఎంబీబీఎస్‌తో సమానంగా గుర్తించాలన్న డిమాండ్ మాత్రం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. ‘ఆరేళ్ళ ఫార్మ్.డి కోర్సులో ప్రతి విద్యార్ధి రెండో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఏడాదికి 50 గంటలపాటు ఆస్పత్రిలో పని చేయాల్సి ఉంటుంది. అయిదో ఏట ప్రతి రోజు ఒకపూట వార్డు రౌండ్ డ్యూటీ విధిగా నిర్వర్తించాలి. ఆరో ఏట 300 పడకల ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంద’ని మంత్రి వివరించారు. ఫార్మ్.డి కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్ధులకు వారి ప్రొవిజనల్ సర్టిఫికెట్‌పై డాక్టర్ ఆఫ్ ఫార్మసీగా రాయడంతోపాటు వారి పేరు ముందు డాక్టర్ అని కూడా పెట్టాలని 2012లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీలను అదేశించినట్లు మంత్రి తెలిపారు. అలాగే ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్ చట్టం కింద ఫార్మ్.డి ఉత్తీర్ణులైన వారిని ఫార్మసీ ప్రాక్టీషనర్‌గా చేర్చడం జరిగినట్లు తెలిపారు. అలాగే డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్స్, సీనియర్ ఫార్మసిస్ట్, చీఫ్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అవసరమైన విద్యార్హతల కింద ఫార్మ్.డి కోర్సును కూడా చేర్చినట్లు ఆయన వెల్లడించారు. -
ఫార్మ్.డి గ్రాడ్యుయేట్స్ ఎంబీబీఎస్‌తో సమానమే కానీ..
సాక్షి, న్యూఢిల్లీ: ఫార్మ్.డి కోర్సును ఎంబీబీఎస్ కోర్సుతో సమానంగా గుర్తించాలన్న ఏ డిమాండ్ ప్రభుత్వం దృష్టికి రాలేదని ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మంగళవారం రాజ్య సభకు తెలిపారు. రోగులకు వైద్య సేవలు అందించే విషయంలో ఎంబీబీఎస్‌తో సమానంగా తమ కోర్సును కూడా గుర్తించాలంటూ ఫార్మ్.డి గ్రాడ్యుయేట్ల నుంచి డిమాండ్ వస్తున్న విషయం వాస్తవమేనా అంటూ వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఇంటర్మీడియెట్ అనంతరం ఫార్మ్.డి విద్యార్దులు ఆరేళ్ళపాటు ఈ కోర్సును అధ్యయనం చేస్తారని మంత్రి వివరించారు. కోర్సులో భాగంగా రెండు, మూడు, నాలుగో సంవత్సరంలో విద్యార్ధులకు ఏటా 50 గంటలపాటు ఆస్పత్రిలో అధ్యయనం ఉంటుందని పేర్కొన్నారు. అయిదో సంవత్సరంలో ప్రతి రోజు వార్డు రౌండ్ డ్యూటీ నిర్వహిస్తారని, ఆరవ సంవత్సరంలో 300 పడగకల ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తారని వెల్లడించారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అధ్యాపకుడి పర్యవేక్షణలో విద్యార్ధి ఫార్మసీ, హెల్త్ కేర్ ప్రాక్టీస్ చేస్తారని మంత్రి తెలిపారు. ఫార్మ్.డి కోర్సును ఎంబీబీఎస్‌తో సమానంగా గుర్తించాలన్న డిమాండ్ ఏదీ ప్రభుత్వ దృష్టికి రానప్పటికీ ఈ కోర్సు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్‌ని క్లినికల్ ఫార్మసిస్ట్‌గా గుర్తించాలంటూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కి వినతులు వస్తున్నట్లు మంత్రి తెలిపారు. పీసీఐ రూపొందించిన ఫార్మసీ ప్రాక్టీస్ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన, రిజిస్టర్ అయిన ఫార్మ్.డి గ్రాడ్యుయేట్లు తమ వృత్తిపరమైన ప్రాక్టీస్‌లో భాగంగా రోగులకు మందులు ఇవ్వవచ్చునని మంత్రి తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా క్లినికల్ ఫార్మసిస్టులు 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో డాక్టర్లు ఇతర హెల్త్ కేర్ నిపుణులతో కలిసే పని చేస్తారు. ఫార్మసీ ప్రాక్టీస్ నిబంధనల ప్రకారం ఫార్మ్.డి గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలోని మెడికల్ సర్వీసెస్ విభాగాల్లో డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్, సీనియర్ ఫార్మసిస్ట్, చీఫ్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అర్హులని నడ్డా వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలలో ఫార్మ్.డి గ్రాడ్యుయేట్లు క్లినికల్ ఫార్మసిస్ట్‌లుగా పని చేస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. -
ఇంజనీరింగ్ ఫీజుల మోత
- సాధారణ కాలేజీల్లోనూ భారీగా ఫీజుల ఖరారు - ఎక్కువ కాలేజీల్లో ఫీజులు రూ. 60 వేలకు పైగానే.. - పలు కాలేజీల్లో పాత ఫీజులపై అదనంగా రూ. 25 వేల వరకు పెంపు - 2016-17 నుంచి కాలేజీల్లో చేరే వారికి కొత్త ఫీజులు - ఇప్పటికే చదువుతున్న వారికి పాత ఫీజులే వర్తింపు - అత్యధిక ఫీజు ఫార్మ్-డిలో 1.15 లక్షలు, ఇంజనీరింగ్‌లో 1,13,500 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న సాధారణ, ఓ మోస్తరు కాలేజీల్లో 80 శాతం వరకు ఫీజు పెంచారు. కొన్ని కాలేజీల్లో మాత్రం ఇప్పటివరకు ఉన్న ఫీజులను యథాతథంగా ఉంచారు. ఇప్పటివరకు ఎక్కువ కాలేజీల్లో రూ.35 వేల కనీస ఫీజు ఉండగా.. తాజాగా రూ.60 వేల వరకు చేరింది. గతంలో రూ.50 వేలలోపు ఫీజు ఉన్న కాలేజీల్లో రూ.75 వేల వరకు పెంచారు. కొన్ని టాప్ కాలేజీల్లోనూ ఫీజులు భారీగా పెంచారు. కొన్నింటి ఫీజుల్లో కోత పెట్టారు. మొత్తంగా ఇంజనీరింగ్‌లో కనీస ఫీజు రూ.35,000 కాగా, గరిష్ట ఫీజు రూ.1,13,500గా... ఫార్మ్-డిలో గరిష్ట ఫీజు రూ.1.15 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే చదువుతున్నవారికి పాత ఫీజులే ఉంటాయి. 2016-17 నుంచి కాలేజీల్లో చేరే వారికి కొత్త ఫీజులు వర్తిస్తాయి. కాలేజీలవారీగా ఫీజుల వివరాలను సాక్షి ఎడ్యుకేషన్ డాట్‌కామ్ వెబ్సైట్లో పొందవచ్చు. గుర్తింపు లభించిన కాలేజీలకే.. రాష్ట్రంలో 293 ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో వసూలు చేయాల్సిన వార్షిక ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళవారం జీవో 21 జారీ చేశారు. ఫీజుల ఖరారు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలన్నింటికీ కాకుండా ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపటే ్టందుకు అనుబంధ గుర్తింపు లభించిన కాలేజీలకు మాత్రమే ఫీజులను ఖరారు చేశారు. ఇందులో 179 ఇంజనీరింగ్ (బీటెక్) కాలేజీలు, 10 బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కాలేజీలు, 2 బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (బీప్లానింగ్) కాలేజీలు, 73 బీఫార్మసీ కాలేజీలు, 29 ఫార్మ్-డి కాలేజీలు ఉన్నాయి. ఈ ఫీజులు మూడేళ్ల పాటు (2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) అమల్లో ఉంటాయి. ఉత్తర్వుల్లోని ప్రధాన అంశాలు - ఎన్నారై కోటా కింద చేరే విద్యార్థులు ట్యూషన్ ఫీజు కింద 5 వేల అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. (డాలర్ విలువ పెరిగినందున ఈ ఫీజు పెంపును ఏఎఫ్ఆర్సీ ప్రతిపాదించలేదు) - ఎన్బీఏ అక్రెడిటేషన్ ఉన్న కోర్సుల్లో చేరే విద్యార్థులు ట్యూషన్ ఫీజుతోపాటు అదనంగా ఏటా రూ.3 వేలు చెల్లించాలి. - మరో రూ.2 వేలను విద్యార్థి ప్రవేశాల సమయంలో అడ్మిషన్/రిజిస్ట్రేషన్/రికగ్నైజేషన్ ఫీజుగా చెల్లించాలి. ఇందులో రూ.500 యూనివర్సిటీకి సదరు విద్యా సంస్థ చెల్లిస్తుంది. మిగతా రూ.1,500 కాలేజీలో ఉంచాలి. - విద్యార్థికి అందించే ప్రత్యేక సేవల కింద ఏటా మరో రూ.1,000 చెల్లించాలి. ఇందు లో కాలేజీ కార్యక్రమాలకు రూ.75, హెల్త్ సెంటర్ సేవలకు రూ.100, రీడింగ్ రూమ్‌కోసం రూ.25, కాలేజీ మ్యాగజైన్ కోసం రూ.50, హాబీ సెంటర్‌కు రూ.25, స్టూడెం ట్ హ్యాండ్‌బుక్ కోసం రూ.25, ల్యాబ్ ఫీజు రూ.150, లైబ్రరీ ఫీజు రూ.125, కంప్యూటర్, ఇంటర్నెట్ ఫీజు రూ.250, ప్లేస్మెంట్ సెల్‌కు రూ.125, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోసం రూ.50 కేటాయిస్తారు. - ఏటా కామన్ సర్వీసెస్ కింద కాలేజీ యాజమాన్యం ఒక్కో విద్యార్థి నుంచి మరో రూ.1,500 వసూలు చేసి యూనివర్సిటీకి చెల్లించాలి. ఇందులో పరీక్షల సంబంధ అంశాలకు రూ.500, అకడమిక్ ఆడిట్‌కు రూ.200, కరిక్యులమ్ రివిజన్, కంటెంట్ డెవలప్మెంట్కు రూ.300, స్టాఫ్ ట్రైనింగ్‌కు రూ.50, కో-ఆర్డినేషన్ మీటింగ్ కోసం రూ.50, యూనివర్సిటీ పబ్లికేషన్, వెబ్సైట్ మెయింటెనెన్స్‌కు రూ.200 చెల్లించాలి. - లైబ్రరీ డిపాజిట్ కింద రూ.500, లేబొరేటరీ డిపాజిట్ కింద రూ.500 ప్రవేశాల సమయంలో వన్‌టైమ్ ఫీజుగా చెల్లించాలి. కాలేజీలకు నిబంధనలు.. - ఏటా వార్షిక ట్యూషన్ ఫీజును ముందుగా వసూలు చేసుకోవచ్చు. లేదా ఇన్స్టాల్మెంట్ రూపంలో వసూలు చేసుకోవచ్చు. విద్యా సంస్థ ఏ విధానం ఎంచుకుంటే దానిని అమలు చేయాలి. - విద్యా సంస్థలు క్యాపిటేషన్ ఫీజు లేదా ఇతర మరే పేర్లతో అదనపు ఫీజులు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ వసూలు చేయడానికి వీల్లేదు. - యూనివర్సిటీ/ఏఐసీటీఈ అనుమతించని కోర్సులను, ఫీజు నిర్ధారించని కోర్సులను కొనసాగించడానికి వీల్లేదు. - ప్రస్తుతం నిర్ణయించిన ఫీజులు ఆయా కళాశాలలు ఆన్లైన్ ద్వారా అందజేసిన వివరాల ఆధారంగా నిర్ధారించినవి. ప్రత్యక్ష తనిఖీల సందర్భంగా ఆ వివరాల్లో తప్పులున్నట్లు తేలితే ఫీజులను సవరించడంతోపాటు ఆయా కాలేజీలపై చర్యలు చేపడతారు.