breaking news
Perfectionism
-
ఫలితం కంటే ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి!
మా పాప ఆరోతరగతి. చిన్నప్పటి నుంచి చదువులో టాపరే. మేము ఫస్ట్ రావాలని ఎప్పుడూ ఒత్తిడి చేయం. తనే చదువును సీరియస్‌గా తీసుకుని ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ రావాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ మధ్య అర్ధరాత్రి ఒక్కసారిగా లేచి, ‘‘నాకు క్లాస్రూమ్ గుర్తొస్తోంది. టీచర్ చెప్పిన పాఠాలు గుర్తొస్తున్నాయి. ఇవన్నీ గుర్తొస్తుండటంతో నిద్ర రావడం లేదు’’ అంటూ ఏడుస్తోంది. తరచు ఇలా జరుగుతోంది. అంత బాగా చదివే అమ్మాయి ఇలా అనేసరికి మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీనివెనుక ఏదైనా మానసిక సమస్య ఉందా? – రమేష్, వరంగల్చిన్నప్పటి నుంచి చదువులో టాప్‌గా ఉంటూ, చదవడం ఇష్టపడే పిల్లల్లో ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా కంగారుపడటం సహజమే. ప్రాథమికంగా దీన్ని అకాడమిక్ యాంగై్జటీ, పర్ఫెక్షనిజం వల్ల ఏర్పడుతున్న ఒత్తిడిగా భావించవచ్చు. మీ అమ్మాయిపై బయట నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోయినా, ‘‘నేను ఎప్పుడూ క్లాస్‌లో ఫస్ట్ రావాలి’’ అనే పెద్ద బాధ్యతను తనకు తానే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే విజయం, రాకపోతే తాను విఫలమైనట్లు భావించడం. తన ప్రతిభను, తన విలువను కూడా మార్కులు, ర్యాంకులతో ముడిపెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ అమ్మాయిలో కొన్ని పర్ఫెక్షనిస్టిక్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఏరోజు హోంవర్క్‌ను ఆరోజే పూర్తిచేయాలి, అనుకున్న సిలబస్ మొత్తం చదివిన తర్వాతే పడుకోవాలి, ఏదీ మిగలకూడదు అనుకోవడం మంచి అలవాటే. కానీ ‘‘అన్నీ పర్ఫెక్ట్గా జరగాల్సిందే’’ అనే స్థాయికి వెళ్లినప్పుడు అదే అలవాటు మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. మనం ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు, ముఖ్యంగా చదివిన విషయాలను నిద్ర సమయంలో మెదడు మళ్లీ ప్రాసెస్ చేసి జ్ఞాపకాల్లో స్థిరపరుస్తుంది. పిల్లల్లో అప్పుడప్పుడు పగటిపూట జరిగిన విషయాలు కలల్లోకి రావడం, నిద్రలో మాట్లాడటం లేదా కలవరించడం కూడా కనిపించవచ్చు. అవి మాత్రమే ఉంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మీ అమ్మాయి విషయంలో ఇది కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. శరీరం నిద్రలోకి వెళ్లినా, మెదడు మాత్రం చదువు, క్లాస్, ర్యాంకుల గురించి ఇంకా అప్రమత్తంగానే ఉండవచ్చు. ఆ సమయంలో ఆలోచనలు వరుసగా రావడం వల్ల తిరిగి నిద్రపట్టక భయపడటం, ఏడవడం జరగవచ్చు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులు పడుకోవడానికి కనీసం గంట ముందు నుంచే పుస్తకాలు, హోంవర్క్ పక్కన పెట్టే అలవాటు చేయండి. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడటం, తేలికపాటి కథల పుస్తకం చదవడం, ప్రశాంతమైన సంగీతం వినడం, ధ్యానం లేదా శ్వాసపై దృష్టి పెట్టే చిన్న రిలాక్సేషన్ ఎక్సర్సైజులు చేయడం ఉపయోగపడతాయి. అన్నింటికంటే ముఖ్యంగా, ఆమె సాధించిన ఫలితం కంటే ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకోండి. ప్రతిసారీ ఫస్ట్ రావడం పూర్తిగా మన చేతుల్లో ఉండదని, దానిగురించి ఆందోళన పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలి. మార్కులు, ర్యాంకులతో ఆమె విలువను నిర్ణయించలేమని, ఫస్ట్ వచ్చినా రాకపోయినా ఆమెపై మీ ప్రేమలో ఎలాంటి మార్పూ ఉండదనే భరోసా ఇవ్వాలి. ఈ సూచనలను పాటించడం ద్వారా సమస్య తగ్గే అవకాశం ఉంది.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
overthinkers club: అతిగా ఆలోచన ఆనందానికి శత్రువు
‘నేను చేసింది తప్పేమో’ ‘నేను చేసిన పని వల్ల ఇలా అవుతుందేమో’ ‘వాళ్లు అలా చేస్తే ఏం చేయాలి?’ ‘నా పరువు పోతుందేమో’... చిన్న చిన్న కారణాలకు కూడా ఎంతో ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటారు కొందరు. దీనిని ‘ఓవర్‌థింకింగ్’ అంటారు మానసిక నిపుణులు. ‘ఇలాంటివారిని ఒకచోట చేర్చి ఆలోచనలు పంచుకుంటే ధైర్యం వస్తుంది’ అంటుంది వర్షా విజయన్. ఈమె మొదలు పెట్టిన ‘ఓవర్‌థింకర్స్ క్లబ్’ ఇలాంటి క్లబ్‌ల అవసరాన్ని తెలియచేస్తోంది. ‘ఓ మీరూ అంతేనా?’ అంది ఒక మహిళ ఆ పార్క్‌కు వచ్చిన మరో మహిళతో. తిరువనంతపురానికి చెందిన 27 ఏళ్ల వర్షా విజయన్ ‘ఓవర్‌థింకర్స్ క్లబ్’ను ప్రారంభించింది. ఇదేదో ఒక భవంతో, క్లినిక్కో కాదు. పార్కులో కొంతమంది కలవడమే. సోషల్ మీడియా ద్వారా ఈ క్లబ్ గురించి ఆమె ప్రచారం చేసింది. ‘ప్రతి దానికీ తీవ్రంగా ఆలోచించే మనం ఈ ఆలోచనల నుంచి బయటపడదాం రండి’ అనే ఆమె పిలుపునకు స్పందించిన స్త్రీ, పురుషులు రకరకాల వయసుల వాళ్లు వారానికి ఒకసారో నెలలో రెండుసార్లు కలవసాగారు. ‘జీవితంలో మార్పులు సహజం. కాని జరగబోయే మార్పు గురించి చదువు, ఉద్యోగం, వివాహం, విడాకులు, పిల్లల ఆరోగ్యం లేదా తల్లిదండ్రుల చివరి రోజులు... వీటి గురించి రోజుల తరబడి ఆలోచిస్తూ ఉంటారు కొందరు. ఆ ఆలోచనలు పాజిటివ్ వైపు కాకుండా నెగెటివ్ వైపుగా వెళ్లడంతో ఆందోళన చెందుతుంటారు. దాని వల్ల డిప్రెషన్ వస్తుంది. అన్నింటికీ మించి ఏ నిర్ణయమూ జరక్క ఏ పనీ ముందుకు కదలదు. వర్తమానంలో ఉండే ఆనందాన్ని అనుభవించక ఎప్పుడో ఏదో నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళనతో బాధ పడుతుంటారు ఓవర్‌థింకర్లు’ అంటుంది వర్షా విజయన్. ఆలోచన.. అతి ఆలోచన ‘ఆలోచన మంచిదే. కాని అతి ఆలోచన మంచిది కాదు’ అంటుంది వర్షా విజయన్. ఓవర్‌థింకర్ల క్లబ్‌కు హాజరైన వారు ఒకరి మాటల్లో మరొకరు తెలుసుకునే విషయం ఏమిటంటే తమ చేతుల్లో లేని వాటి గురించి కూడా అధికంగా ఆలోచించడం. ఉదాహరణకు ఎప్పుడో పెట్టుకున్న శుభకార్యం రోజు వాన పడితే... వాన పడితే... వాన పడితే అని ఆలోచించడం. వానను ఆపడం మన చేతుల్లో లేదు. పడితే పడుతుంది... లేకపోతే లేదు. పడినప్పుడు అందుకు తగ్గ సర్దుబాట్లతో పనులు అవసరం అవుతాయి. అలా అనుకుని వదిలేయాలిగాని అదే పనిగా ఆలోచించడం ఆరోగ్యం కాదు. దాని వల్ల ఇవాళ్టి ఆనందాలు మిస్ అవుతాయి. ధ్యాస మళ్లించాలి ఓవర్‌థింకర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మెరుగ్గా ఉండొచ్చు అంటుంది వర్షా విజయన్ ► అతిగా ఆలోచించే చాలా విషయాలు పడే భయాలు దాదాపుగా నిజం కావు. పిల్లల్ని స్కూల్‌బస్ ఎక్కించాక దానికి ప్రమాదం జరిగితే.. ప్రమాదం జరిగితే అని ఆలోచించడం మంచిది కాదు. అలా లక్షసార్లలో ఒకసారి జరుగుతుంది. ఆ ఒకసారి గురించి అతి ఆలోచన చేయకూడదు ► ఎక్కువ ఆత్మవిమర్శ చేసుకోకుండా ఏదో ఉన్నంతలో బెస్ట్ చేద్దాం... చేశాం అని ముందుకెళ్లాలి. ఏదో ఒక మేరకు సంతృప్తి చెంది పని జరిగేలా చూడాలి ► ఆలోచనలు శ్రుతి మించుతుంటే స్నేహితులతో మాట్లాడాలి. చెప్పుకోవాలి. కొత్త పనులేవైనా నేర్చుకుని ధ్యాస మళ్లించాలి ∙సోషల్ మీడియాలో పనికిమాలిన పరిజ్ఞానం, వీడియోలు తగ్గించాలి ► ఈ క్షణంలో ఉండటం ప్రాక్టీస్ చేయాలి. అందుకు యోగా ఉపయోగపడుతుంది ► అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు అనే వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి. సమస్య ఎదురైనప్పుడు చూసుకుందాంలే అనుకుని ధైర్యంగా ఉండాలి. ఓవర్‌థింకర్ల లక్షణాలు ► ఆత్మవిమర్శ అధికంగా చేయడం ► ఒక పని పూర్తిగా లోపరహితంగా చేయాలనుకోవడం (పర్ఫెక్షనిజం) ► జరిగిపోయిన ఘటనలు, మాటలు తలచుకుని వాటిలో ఏమైనా తప్పులు జరిగాయా, పొరపాట్లు జరిగాయా, వాటి పర్యవసానాలు ఏమిటి అని తల మునకలు కావడం ► ప్రయాణాల్లో ప్రమాదాలు ఊహించడం ► శుభకార్యాలప్పుడు అవి సరిగ్గా జరుగుతాయో లేదోనని ఆందోళన చెందడం ► చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పర్యవసానాలు ఊహించడం ► ఎవరికీ చెప్పుకోక ఆ ఆందోళనల్లోనే రోజుల తరబడి ఉండటం.


