మన(సు)లో మాట
మా పాప ఆరోతరగతి. చిన్నప్పటి నుంచి చదువులో టాపరే. మేము ఫస్ట్ రావాలని ఎప్పుడూ ఒత్తిడి చేయం. తనే చదువును సీరియస్గా తీసుకుని ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ రావాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ మధ్య అర్ధరాత్రి ఒక్కసారిగా లేచి, ‘‘నాకు క్లాస్రూమ్ గుర్తొస్తోంది. టీచర్ చెప్పిన పాఠాలు గుర్తొస్తున్నాయి. ఇవన్నీ గుర్తొస్తుండటంతో నిద్ర రావడం లేదు’’ అంటూ ఏడుస్తోంది. తరచు ఇలా జరుగుతోంది. అంత బాగా చదివే అమ్మాయి ఇలా అనేసరికి మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీనివెనుక ఏదైనా మానసిక సమస్య ఉందా?
– రమేష్, వరంగల్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్గా ఉంటూ, చదవడం ఇష్టపడే పిల్లల్లో ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా కంగారుపడటం సహజమే. ప్రాథమికంగా దీన్ని అకాడమిక్ యాంగై్జటీ, పర్ఫెక్షనిజం వల్ల ఏర్పడుతున్న ఒత్తిడిగా భావించవచ్చు. మీ అమ్మాయిపై బయట నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోయినా, ‘‘నేను ఎప్పుడూ క్లాస్లో ఫస్ట్ రావాలి’’ అనే పెద్ద బాధ్యతను తనకు తానే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే విజయం, రాకపోతే తాను విఫలమైనట్లు భావించడం. తన ప్రతిభను, తన విలువను కూడా మార్కులు, ర్యాంకులతో ముడిపెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ అమ్మాయిలో కొన్ని పర్ఫెక్షనిస్టిక్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఏరోజు హోంవర్క్ను ఆరోజే పూర్తిచేయాలి, అనుకున్న సిలబస్ మొత్తం చదివిన తర్వాతే పడుకోవాలి, ఏదీ మిగలకూడదు అనుకోవడం మంచి అలవాటే.
కానీ ‘‘అన్నీ పర్ఫెక్ట్గా జరగాల్సిందే’’ అనే స్థాయికి వెళ్లినప్పుడు అదే అలవాటు మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. మనం ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు, ముఖ్యంగా చదివిన విషయాలను నిద్ర సమయంలో మెదడు మళ్లీ ప్రాసెస్ చేసి జ్ఞాపకాల్లో స్థిరపరుస్తుంది. పిల్లల్లో అప్పుడప్పుడు పగటిపూట జరిగిన విషయాలు కలల్లోకి రావడం, నిద్రలో మాట్లాడటం లేదా కలవరించడం కూడా కనిపించవచ్చు.
అవి మాత్రమే ఉంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మీ అమ్మాయి విషయంలో ఇది కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. శరీరం నిద్రలోకి వెళ్లినా, మెదడు మాత్రం చదువు, క్లాస్, ర్యాంకుల గురించి ఇంకా అప్రమత్తంగానే ఉండవచ్చు. ఆ సమయంలో ఆలోచనలు వరుసగా రావడం వల్ల తిరిగి నిద్రపట్టక భయపడటం, ఏడవడం జరగవచ్చు.
ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులు పడుకోవడానికి కనీసం గంట ముందు నుంచే పుస్తకాలు, హోంవర్క్ పక్కన పెట్టే అలవాటు చేయండి. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడటం, తేలికపాటి కథల పుస్తకం చదవడం, ప్రశాంతమైన సంగీతం వినడం, ధ్యానం లేదా శ్వాసపై దృష్టి పెట్టే చిన్న రిలాక్సేషన్ ఎక్సర్సైజులు చేయడం ఉపయోగపడతాయి.
అన్నింటికంటే ముఖ్యంగా, ఆమె సాధించిన ఫలితం కంటే ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకోండి. ప్రతిసారీ ఫస్ట్ రావడం పూర్తిగా మన చేతుల్లో ఉండదని, దానిగురించి ఆందోళన పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలి. మార్కులు, ర్యాంకులతో ఆమె విలువను నిర్ణయించలేమని, ఫస్ట్ వచ్చినా రాకపోయినా ఆమెపై మీ ప్రేమలో ఎలాంటి మార్పూ ఉండదనే భరోసా ఇవ్వాలి. ఈ సూచనలను పాటించడం ద్వారా సమస్య తగ్గే అవకాశం ఉంది.
డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com


