వైఎస్సార్ సీపీకే ప్రజల మద్దతు
పట్నంబజారు(గుంటూరు), న్యూస్‌లైన్: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను క్లీన్‌స్వీప్ చేస్తుందని ఆ పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు వల్లభనేని బాలశౌరి ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా సర్వేలు సైతం వైఎస్సార్ సీపీకే ప్రజలు అనుకూలంగా ఉన్న విషయాన్ని స్పష్టం చేశాయని చెప్పారు. గుంటూరు నలందానగర్లోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలోని పరిస్థితులన్ని గందరగోళంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతన్న పుట్టెడు కష్టంలో ఉన్నా...రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన పాలకులు పదవులు కాపాడుకునేందుకు ఢిల్లీలో సోనియా కాళ్లకు మొక్కుతున్నారని విమర్శించారు.
పభుత్వ విధానాలను ఎండగట్టాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ హోదాకు కళంకాన్ని తెచ్చారని మండిపడ్డారు. దేశచరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే, ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఆయన దివాళాకోరు రాజకీయాలను మరోసారి బయట పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రం ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇప్పటికీ తాను విభజనవాదో..లేక సమైక్యవాదో చెప్పకపోవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషి ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు చేయటం లేదని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాము 30 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవటం తథ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్ట విభజనపై తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కారణంగా రైతుల నీటి కోసం అనేక కష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. గ్రామీణ ప్రజల సమస్యలపై దృష్టి సారించి, సమన్వయకర్తల సహకారంతో వాటి పరిష్కారం కోసం పోరాడతామని బాలశౌరి స్పష్టంచేశారు. సమావేశంలో పార్టీ నాయకులు థామస్‌నాయుడు, గాజుల మోహన్, వెంకటప్పారెడ్డి, డి.శ్రీనివాస్, అనసూయచౌదరి తదితరులున్నారు.