breaking news
own father
-
మారుతండ్రి కర్కశత్వం
నాలుగేళ్ల కూతురుకు వాతలు పెట్టి చిత్రహింసలు జవహర్‌నగర్‌లోని బీజేఆర్‌నగర్‌లో దారుణం జవహర్‌నగర్: కన్నతండ్రి, మారుతల్లి చేతుల్లో చిత్రహింసలకు గురైన ప్రత్యూష వ్యవహారం మరచిపోకముందే జవహర్‌నగర్‌లో మరో దారుణం వెలుగుచూసింది. నాలుగేళ్ల కూతురుని మారుతండ్రి చిత్రహింసలకు గురిచేశాడు. కంటికి రెప్పలా కాపాడి ప్రేమను పంచాల్సిన కన్నతల్లి వంతపాడింది. తల్లిదండ్రుల కర్కశత్వానికి ఆ చిన్నారి చివరకు నడవలేని స్థితికి చేరుకుంది. జవహర్‌నగర్ సీఐ వెంకటగిరి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా శివంపేట మండలం ఊసిరికపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి, ప్రమీల దంపతులు. వీరికి కుమార్తెలు పవిత్ర, సంధ్య(4) ఉన్నారు. బతుకుదెరువుకోసం జవహర్‌నగర్ కు వలస వచ్చి బీజేఆర్‌నగర్‌లో నివాసముంటున్నారు. అనారోగ్యంతో వెంకట్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ప్రమీల తన తల్లి సుశీలతో కలసి ఉంటోంది. రెండు నెలల క్రితం ప్రమీల అల్వాల్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. ఇటీవల ప్రశాంత్ సంధ్యను చెంపలపై గాయపర్చి.. తొడలపై వాతలు పెట్టాడు. నెల రోజులగా అతడు వేధిస్తున్నా చిన్నారి ఏడుస్తూ భరించింది. ఇదంతా చూస్తూ కన్న తల్లి ప్రమీల భర్తకు వంతపాడింది. దీంతో పాపను చూసి తల్లడిల్లిన అమ్మమ్మ సుశీల, మేనమామ శ్రీనివాస్‌లు పలుమార్లు ప్రమీల దంపతులను హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ప్రశాంత్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. -
కన్నకూతురిపై మూడేళ్ల పాటు అత్యాచారం!!
కన్నతండ్రి అఘాయిత్యాన్ని ఆమె తనకు తెలిసీ తెలియని వయసులో పంటిబిగువున సహించింది. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే జరగడంతో ఆ అకృత్యాన్ని బయటపెట్టింది. అవును.. కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన కన్న తండ్రే ఏకంగా మూడేళ్ల పాటు వరుసగా అత్యాచారం చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. దాంతో దినేష్ సోనీ (51)ని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలికి 9 నుంచి 12 ఏళ్ల వరకు వయసు ఉన్నప్పుడు దినేష్ సోనీ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్హెచ్ఓ రాజేష్ మాలిక్ తెలిపారు. ఇప్పుడు ఆమెకు 21 సంవత్సరాలు. ఈ జనవరి లోనే పెళ్లి కూడా అయ్యింది. హోలీ సంబరాల కోసం పుట్టింటికి వచ్చినప్పుడు మరోసారి తనపై తండ్రి అత్యాచారం చేయబోగా తప్పించుకుని, పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతగాడిని అరెస్టు చేసి ఐపీసీ లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కుటుంబంలోని ఇతర సభ్యులకు కూడా ఈ ఘోరం గురించి తెలిసినా.. ఫిర్యాదుచేసే ధైర్యం చేయలేకపోయినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. తమ తండ్రి తన పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలి చెల్లెలు పోలీసులవద్ద వాపోయింది. బంగారం దుకాణం నడిపే దినేష్ సోనీకి తాగుడు అలవాటుందని పోలీసులు చెప్పారు.