breaking news
objectionable photo
-
Instagram: శివుడి చేతిలో మందు గ్లాసు.. సెల్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ వివాదంలో చిక్కుకుంది. యాప్‌లో ఉన్న జిఫ్ ఫొటోలలో శివుడి చేతిలో మందు గ్లాస్.. సెల్‌ఫోన్ ఉన్నాయని ఓ బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫొటోలు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఇన్స్టాగ్రామ్ సీఈఓపై ఆ నాయకుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లోని సెర్చ్ బాక్స్‌లో శివ్ అని టైప్ చేస్తే శివుడు రూపాలు రాగా వాటిలో ఒక ఫొటోలో శివుడు చేతిలో మందుగ్లాస్, సెల్‌ఫోన్ పట్టుకుని ఉన్నట్లు ఉంది. ఇది చూసిన ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకుడు మనీశ్ సింగ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్టాగ్రామ్ సీఈఓ, ఆ సంస్థపై ఢిల్లీలోని పార్లమెంట్ వీధిలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించాడు. జిఫ్ స్టిక్కర్ అభ్యంతరకరంగా ఉందని పోలీసులకు చూపించాడు. అతడి ఫిర్యాదును పోలీసులు పరిశీలిస్తున్నారు. కోట్లాది ప్రజలు శివుడిని పూజిస్తారని.. అలాంటి వారి మనోభావాలు దెబ్బతినేలా అభ్యంతరకరంగా జిఫ్ స్టిక్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రూపొందించారని మనీశ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపాడు. ఆదిదేవుడిగా పూజించే శివుడిని అలా చిత్రీకరించడం దారుణమని.. ఇదంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించాడు. అందుకే ఇన్స్టాగ్రామ్ సీఈఓపై క్రిమినల్ కేసు పెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. మనీశ్ సింగ్ గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి. -
అభ్యంతరకరంగా మోదీ ఫొటో పెట్టి..
ముజఫర్‌నగర్: వాట్సాప్ గ్రూప్ లో ఓ వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను అభ్యంతరకరంగా మార్చి పెట్టి బుక్కయ్యాడు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బీజేపీ కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. తివారీ అనే పోలీసు అధికారి వివరాల ప్రకారం ముజఫర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ప్రధాని మోదీ ఫొటోను అభ్యంతరంగా మార్చి దానిని వాట్సాప్ గ్రూప్ లో పెట్టి అవమానించాడు. ఇది గమనించిన ఓ బీజేపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆ ఫొటోను కూడా పోలీసులకు చూపించాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.