breaking news
Nursing Rao
-
ఆరె కటికలను ఎస్సీ జాబితాలో చేర్చాలి
సంఘం తెలంగాణ అధ్యక్షుడు నర్సింగ్‌రావు డిమాండ్ వికారాబాద్: ఆరె కటికలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్ తార్నాకలో అఖిలభారత ఆరె కటిక సమాజం ఆధ్వర్యంలో నర్సింగ్రావును రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తర భారతదేశంలోని 13 రాష్ట్రాలు ఆరె కటికలను ఎస్సీలుగా గుర్తించి సముచిత స్థానం కల్పిస్తున్నాయని తెలిపారు. ఎస్సీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తే వారి పిల్లలకు కూడా ఉన్నత అవకాశాలు దక్కుతాయన్నారు. గతంలో పలు ప్రతిపాదనలతో కేంద్రాన్ని కలిశామని, వాటిని పరిశీలించి మరింత సమాచారం కోరిందని చెప్పారు. ఆరె కటిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వికారాబాద్‌కు చెందిన తనను ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. అఖిల భారత ఆరెకటిక సమాజం చీఫ్ ప్యాట్రన్ నేతికార్ ప్రేమ్‌లాల్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగినట్లు ఆయన వెల్లడించారు. సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నేతికార్ రమేష్ కటిక, కోశాధికారిగా కరణ్‌కోట్ అశోక్‌జీ కటిక ఎన్నికైనట్టు చెప్పారు. సంఘం మహిళావిభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా గౌలికార్ జయనర్సింగ్రావు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. రాధాభాయ్, ప్రమీల, లక్ష్మీభాయ్లకు రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. -
సారూ.. పింఛన్ మంజూరు చేయరూ..!
డయల్ యువర్ డీఆర్డీఏ పీడీలో వినతి సంగారెడ్డి మున్సిపాలిటీ: సదరెమ్ క్యాంపునకు హాజరైనా తనకు ఇంతవరకు సర్టిఫికెట్ ఇవ్వలేదని కొండపాక మండలం దుద్డెడ గ్రామానికి చెందిన నర్సింగ్ రావు డీఆర్డీఏ పీడీకి విన్నవించుకున్నారు. గురువారం నిర్వహించిన డయల్ యువర్ డీఆర్డీఏ పీడీ కార్యమ్రంలో పీడీ సత్యనారాయణరెడ్డి హాజరుకాకపోవడంతో అసిస్టెంట్ పీడీ వెంకటేశ్వర్లు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మెదక్ మండలం కాజిపల్లికి చెందిన పెంటయ్య మాట్లాడుతూ తమ కుటుంబంలో ఉన్న బీడీ కార్మికులకు జీవనభృతి పింఛన్ అంద డం లేదన్నారు. వితంతు పింఛన్ మంజూరు చేయడంతో పంచాయతీ కార్యదర్శి పక్షపాతం చూపుతున్నాడని కంగ్టి మండలం తడ్కల్‌కు చెందిన సాయిలు ఫిర్యాదు చేశారు. జీవనభృతి పింఛన్ కోసం పీఎఫ్ కార్డుతో దరఖాస్తు చేసినా మంజూరు చేయడం లేదని నంగునూర్ మండలం ఖానాపూర్‌కి చెందిన మల్లయ్య, కొడిపాక మండలం కమ్మంపల్లికి చెందిన నర్సింలు ఫిర్యాదు చేశారు. సదరెమ్ క్యాంపునకు హాజరై సర్టిఫికెట్తో వికలాంగ ఫించన్‌కు దరఖాస్తు చేసుకున్నా పింఛన్ మంజూరు కాలేదని కొండపాక మండలం ఎర్రపల్లికి చెందిన మల్లయ్య ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో 23 మందికి వితంతు, వృద్ధాప్య పింఛన్లు రాలేదని మెదక్ మండలం సర్థనకు చెందిన రామ్‌చందర్ పేర్కొన్నారు. అభయాస్తం పింఛన్ అందడంలేదని పెద్దశంకరంపేట మండలం వీరోజ్పల్లికి చెందిన రమేష్ ఫిర్యాదు చేశారు. -
చెల్లెలి పెళ్లి ఇష్టం లేక అక్క ఆత్మహత్య
అత్తాపూర్: చెల్లెలు తన అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెంది అక్క ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జ రిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ప్రేమావతిపేటకు చెందిన అనిత (32) నర్సింగ్‌రావు భార్యాభర్తలు. కాగా అనిత చెల్లెలు జయంతి కొద్ది రోజులగా నర్సింగ్‌రావు అక్క కుమారుడు క్రాంతిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన అనిత చెల్లెల్ని మందలించింది. అయినా వినకుండా ఈనెల 2న జయంతి.. క్రాంతిని పెళ్లిచేసుకుంది. ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేని అనిత తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ప్రేమావతిపేటలోని శ్మశాన వాటికలో వేప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనిత సోదరుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీనియర్ పోలీసు అధికారుల సర్వీసు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ పోలీసు అధికారుల సర్వీసును రెండు సంవత్సరాల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇంటెలిజెన్స్ విభాగంలో పొలిటికల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి కిషన్‌రావు, యాంటీ నక్సలైట్ నిఘా విభాగంలో నాన్‌కేడర్ ఎస్పీగా పనిచేస్తున్న నర్సింగ్‌రావు, ఇంటెలిజెన్స్ హైదరాబాద్ రీజినల్ అధికారి, అదనపు ఎస్పీ జగన్మోహన్రెడ్డి ఈ సర్వీసు పొడిగించిన జాబితాలో ఉన్నారు. ఇందులో కిషన్‌రావు ఇంటెలిజెన్స్ ఎస్పీగా 2003లోనే పదవీవిరమణ చేయాల్సి ఉంది. అయితే నిఘా విభాగంలో అపార అనుభవం కలిగి, అత్యంత సమర్థుడిగా పేరు పొందిన కిషన్‌రావు సేవలు అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వాలు 2003 నుంచి పొడిగిస్తూ వస్తున్నాయి. -
ఫేస్‘బుక్కయ్యారు’
=బావ హత్య ఫొటోలతో అరుణ్.. =బాలికను కిడ్నాప్ చేసి నర్సింగ్.. సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్... ఈ సోషల్ మీడియా నేపథ్యంలోనే ఇద్దరు కటకటాల్లోకి చేరారు. ఇప్పటివరకు దీని ద్వారా అశ్లీల సందేశాలు పంపి, దుర్వినియోగం చేసిన ఆరోపణలపైనే అనేకమంది జైలుకు వెళ్లారు. దీనికి భిన్నంగా చెన్నైకు చెందిన అరుణ్‌కుమార్ గౌడ్, శేరిలింగంపల్లి బీరంగూడ వాసి నర్సింగ్‌రావు పోలీసులకు చిక్కారు. చెల్లి సంతోషం కోసమంటూ బావను అరుణ్ సుపారీ హత్య చేయించాడు. ఘాతుకానికి ఆధారం కావాలంటూ హంతకుల నుంచి మెయిల్ చేయించుకున్న మృతదేహం ఫొటోలు ఫేస్బుక్లో ప్రత్యక్షం కావడంతో ఎస్సార్‌నగర్ పోలీసులు ఈ కేసు ఛేదించారు. ఇక పలు అకౌంట్లను తెరిచి రెండు పేర్లతో యువతులు, మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి వల వేసిన నర్సింగ్‌రావు.. ఈ రకంగానే పరిచయమైన బాలికను కిడ్నాప్ చేశాడు. ఈ కేసునూ బేగంపేట పోలీసులు సాంకేతికంగానే దర్యాప్తు చేసి నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు. సాక్షి, సిటీబ్యూరో: ‘బీటెక్ చదివాడంటే కట్నకానుకలతో మా చెల్లిని ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాం. ఆరు నెలలకే అన్నతో కలిసి వేధింపులు మొదలెట్టాడు. విడాకుల అంశం కోర్టులో ఉండగానే మరో పెళ్లి చేసుకున్నాడు. తరచు నా చెల్లిని ఇబ్బందులకు గురిచేస్తూ అతడు మాత్రం ఆనందంగా ఉన్నాడు. అందుకే చెల్లి సంతోషం కోసం ఇలా చేశా’ - సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్‌ను సుపారీ హత్య చేయించిన అరుణ్‌కుమార్ మీడియాతో చెప్పిన మాటలివి. నాడు బావ (మద్దెలచెర్వు సూరి) కళ్లల్లో ఆనందం కోసం పరిటాల రవిని కాల్చానని మొద్దు శీను చెప్పగా... నేడు చెల్లెలి సంతోషం కోసం బావను హత్య చేయించానంటూ అరుణ్‌కుమార్ చెప్పుకొచ్చాడు. ఎస్సార్ నగర్ ఠాణాలో మిస్సింగ్‌గా నమోదై... హత్యగా మారిన ఈ కేసులో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. అదనపు డీసీపీ కె.నాగరాజు, పంజగుట్ట ఏసీపీ డి.వెంకట నర్సయ్యలతో కలిసి ఆయన తన కార్యాలయంలో విలేకరులకు పూర్తి వివరాలు వెల్లడించారు. అధికారులు, నిందితుడు అరుణ్‌కుమార్ కథనం ప్రకారం... పెళ్లైన ఆరు నెలలకే వేధింపులు... ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న అరుణ్‌కుమార్ గౌడ్ గతంలో నగరంలోనే ఉన్నాడు. బీకే గూడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చంద్రశేఖర్‌గౌడ్ బీటెక్ చదివాడని అతడి కుటుంబీకులు చెప్పడంతో తన సోదరి సంధ్యను ఇచ్చి 2006 జూలై 31న పెళ్లి చేశాడు. పెళ్లైన ఆరు నెలలకే భర్తతో పాటు అతడి సోదరుడు విజయ్బాబుగౌడ్ నుంచి సంధ్యకు కట్నం వేధింపులు ఎదురయ్యాయి. దీంతో చెన్నైలోని సీ-2 పోలీసుస్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ పరిణామాలతో ఇద్దరూ విడాకుల కోసం చెన్నైతో పాటు నగరంలోని కోర్టులోనూ దరఖాస్తు చేసుకున్నారు. భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్న సందర్భంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం చంద్రశేఖర్‌గౌడ్ కట్నకానుకల్ని తిరిగి ఇవ్వడంతో పాటు బాలానగర్‌లోని ఫ్లాట్‌ను ఇవ్వాల్సి ఉండగా... అరుణ్ ఎన్నిసార్లు కోరినా తూలనాడాడు. మరోపక్క ఏడాదిన్నర క్రితం చంద్రశేఖర్ తరఫువారు చెన్నైలోని సంధ్య ఇంటికి వెళ్లి దురుసుగా ప్రవర్తించారు. ఆమె కోర్టు వాయిదాల కోసం నగరానికి వచ్చిన ప్రతీసారి విజయ్‌బాబు మనుషులు వేధించడంతో పాటు బెదిరించారు. స్నేహితులతో చర్చించి పథకం... ఓ పక్క తన చెల్లి కాపురం చెడిపోగా, బావ మరో యువతిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండటాన్ని అరుణ్‌కుమార్ జీర్ణించుకోలేకపోయాడు. ఈ విషయాన్ని నగరానికి చెందిన తన స్నేహితుడు మహ్మద్ యూనుస్ పాషాకు చెప్పాడు. అతడిని రెండుమూడుసార్లు కలిసి చర్చించుకున్న తరవాతే చంద్రశేఖర్‌ను మట్టుపెట్టించాలని అరుణ్ నిర్ణయించుకున్నాడు. నేరుగా తానే నేరం చేస్తే పోలీసులకు చిక్కిపోవచ్చని ఆ బాధ్యతల్ని పాషాకే అప్పగించి ఁపనిరూ. పూర్తయ్యాక రూ.6.5 లక్షల సుపారీ ఇస్తానని ఒప్పుకున్నాడు. చంపిన తరవాత ఆ ఫొటోలను తనకు మెయిల్ చేయాలని షరతుపెట్టాడు. పాషా తన స్నేహితులైన మధు, శివలతో కలిసి రంగంలోకి దిగి.. చంద్రశేఖర్ కదలికలు, వ్యవహారశైలిని పూర్తిగా అధ్యయనం చేశాడు. ఇంటి నుంచే కిడ్నాప్ చేసి.. చంద్రశేఖర్ ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ పలు సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఇతడి రెండో భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లోనే ఉన్నాడు. ఈ విషయం పసిగట్టిన ముగ్గురు ముష్కరులు 4వ తేదీ తెల్లవారుజామున 4.30కి కారులో అతడి ఇంటికి చేరుకున్నారు. ఎలాంటి శబ్ధం చేయకుండా ఇంట్లోకి ప్రవేశించి.. నిద్రతో ఉన్న చంద్రశేఖర్‌గౌడ్‌కు మత్తు ఇచ్చారు. స్పృహకోల్పోయిన అతడిని కారులో కిడ్నాప్ చేసుకెళ్లి.. కారులోనే హత్య చేసి వికారాబాద్ శివార్లలో పడేశారు. కారులోనే తీసిన మృతదేహం ఫొటోలను అదే రోజు ఉదయం 10.15 గంటలకు పాషా తన మెయిల్ ఐడీ నుంచి అరుణ్‌కు చెందిన ఐడీకి పంపాడు. ఈ మెయిల్లో ఁఐ హ్యావ్ ఎటాచ్డ్ బాస్టర్డ్ డెడ్ ఫొటోస్ జస్ట్ సీ ధెమ్రూ. అని రాస్తూ... సుపారీ మొత్తాన్ని రూ.6.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచేశాడు. ఈ మొత్తంలో రూ.5 లక్షల తన ఖాతాలో వేయమని, మిగిలింది తన క్లినిక్‌లో అప్పగించమని రాశాడు. తండ్రికి కానుకగా బావ చావు... సంధ్య ఉదంతంతో అరుణ్‌కుమార్ కుటుంబం మొత్తం తీవ్ర మనస్తాపానికి గురైంది. ముఖ్యంగా అతడి తండ్రి బాగా డీలా పడిపోయాడు. మంగళవారం ఆయన పుట్టిన రోజు కావడంతో ఆ కానుకగా తన బావ చావు వార్త, ఫొటోలను అందించాలని అరుణ్ భావించాడు. ఈ నేపథ్యంలోనే పాషా నుంచి తనకు వచ్చిన ఫొటోలను సంధ్యతో పాటు మరో సోదరుడికీ మెయిల్ ద్వారా పంపిస్తూ... ఁఐ హ్యావ్ అటాచ్డ్ బాస్టర్డ్ డెత్ ఫొటోస్. దట్ ఈజ్ గిఫ్ట్ టు మై డాడ్ ఆన్ హిజ్ బర్త్ డేరూ. అని రాశాడు. ఈ ఫొటోలు ఫేస్‌బుక్‌లోకి ఎక్కడంతో పోలీసుల సాంకేతిక దర్యాప్తు ప్రారంభమై అరుణ్, పాషా, మధు కటకటాల్లోకి చేరారు. పరారీలో ఉన్న శివ కోసం గాలిస్తున్నారు. ఈ హత్యలో సంధ్య పాత్ర ఉన్నట్లు తేలితే ఆమె పైనా చర్యలు తీసుకుంటామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు.