breaking news
NTPS
-
ఎన్టీపీఎస్ పరిసరాల్లో చిరుత సంచారం
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వద్ద ఉన్న నార్ల తాతారావు థర్మల్ కోల్ ప్లాంట్ సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. అర్ధరాత్రి సమయంలో కార్మికులు ఇళ్ళకు వెళుతున్న సమయంలో పొదల్లో తిరుగుతున్న చిరుత కనిపించింది. పక్కనే ఉన్న కొండపల్లి ఖిల్లా పరిసర అడవుల నుంచి చిరుత కిందకు వచ్చి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కోసం గాలింపు ప్రారంభించారు. మరోవైపు చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిరుత సంచారం కలకలం
-
ఎన్టీటీపీఎస్లో నిలిచిన విద్యుదుత్పత్తి
ఇబ్రహీంపట్నం: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ ఏడో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తికి బుధవారం అంతరాయం ఏర్పడింది. బాయిలర్ ట్యూబ్‌కు సాంకేతిక లోపం ఏర్పడడంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సీనియర్ ఇంజినీర్లు మరమ్మతులు చేస్తున్నారు. ఈ సాంకేతిక లోపం కారణంగా తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. -
ప్రైవేటు పవరెందుకు?
ఏడాదికి రెండు పంటలు పండే భూమి ఉంది. పండించే సామర్థ్యముంది. నీటి వసతి కూడా ఉంది. అయినా పండించకుండా తిండి గింజల్ని కూడా దుకాణంలో కొనుక్కునేవారిని చూసి ఏమంటాం? వీడికి డబ్బులెక్కువయ్యాయిరా... అనేకదా విమర్శిస్తాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఇలాగే మందలించాలేమో..? లేకపోతే ఏంటీ.. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా.., 90పైసలకే యూనిట్ చొప్పున సరఫరా అయ్యే విద్యుత్ అందుబాటులో ఉన్నా.. ఇవేవీ ఉపయోగించుకోకుండా ప్రైవేటు సంస్థల నుంచి యూనిట్‌కు రూ. 6 చెల్లించి కొనేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారమెంతో తెలుసా? అక్షరాలా నెలకు రూ. 710 కోట్లు. చివరికి దీన్నంతా చార్జీల రూపంలో ప్రజల నుంచే కదా వసూలు చేసేది! సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ లోటును తగ్గించుకోవాలన్నా, కొత్త రాష్ట్రంలో ప్రజల అవసరాలు తీర్చాలన్నా ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత పొదుపుగా వ్యవహరించాల్సిన అవసరముంది. అయితే సర్కారు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా అధిక ధర చెల్లించి విద్యుత్‌ను ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకే ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. జెన్కో ప్లాంట్లలో పూర్తిస్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయకుండా ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా పావులు కదుపుతోంది. వేసవి తర్వాత విద్యుత్ డిమాండ్ తగ్గింది. దీంతో డిమాండ్ కంటే ఎక్కువగానే విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర విద్యుత్ స్టేషన్లలో ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ అందుబాటులో ఉంది. యూనిట్ 90 పైసల నుంచి రూ. 1.25కు దొరికే అవకాశం ఉంది. అయినాసరే వచ్చే మార్చి వరకు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎప్పటిలాగే ముందుకు వెళ్లేందుకు జెన్కో సిద్ధమవుతోంది. ప్రైవేటు సంస్థలకు యూనిట్‌కు సగటున రూ. 6 వరకు చెల్లించి కొనేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో విద్యుత్ సంస్థలపై నెలకు రూ. 710 కోట్ల మేర భారం పడనుంది. ఆగస్టు నుంచి వచ్చే మార్చి వరకు పరిగణనలోకి తీసుకుంటే ఈ ఎనిమిది నెలల కాలంలో రూ.5,680 కోట్లు ప్రైవేటు సంస్థలకు అప్పనంగా చెల్లిస్తారన్నమాట. అంతిమంగా ఈ భారం చార్జీల రూపంలో ప్రజలపైనే పడుతుంది. ఎలా చూసినా మిగులే.. రెండు నెలల క్రితం రాష్ట్రంలో రోజుకు 158 మిలియన్ యూనిట్ల (ఎంయూల) విద్యుత్ డిమాండ్ ఉంది. ఇప్పుడది 135 ఎంయూలకు తగ్గింది. అంతేకాదు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు విద్యుత్ వాడకం తగ్గుతూనే ఉంటుంది. మరోవైపు కృష్ణపట్నం రెండో యూనిట్ ఉత్పత్తికి సిద్ధమైంది. ఇంకోవైపు కేంద్ర విద్యుత్ స్టేషన్లలో ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ ఉంది. అయినప్పటికీ ఖరీదైన కొనుగోలు విద్యుత్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపడంపై జోన్కో వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. జెన్కో వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలోని నార్ల తాతారావు విద్యుత్ కేంద్రం (ఎన్టీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) సామర్థ్యం 2,810 మెగావాట్లు. వీటిని పూర్తిస్థాయిలో పనిచేయిస్తే రోజుకు 67.44 ఎంయూల విద్యుత్ వస్తుంది. కృష్ణపట్నం రెండు యూనిట్లు కలుపుకుంటే మరో 39 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా సుమారు 105 ఎంయూల మేర థర్మల్ విద్యుత్‌కు అవకాశం ఉంది. ఇక రోజుకు మరో 32 ఎంయూల మేరకు కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి అందుతోంది. మరో 5 ఎంయూలు జల విద్యుత్ ద్వారా లభ్యమవుతోంది. స్వతంత్ర విద్యుత్ ప్రాజెక్టుల (ఐపీపీ) నుంచి మరో 4 ఎంయూలు వస్తోంది. అంతా కలిపితే దాదాపు 146 ఎంయూల విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలోనే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న 135 ఎంయూల డిమాండ్ 140కి చేరినా, ఇంకా రాష్ట్రం మిగులు విద్యుత్‌లోనే ఉంటుందన్నమాట. సామర్థ్యం తగ్గించడం వెనుక.. థర్మల్ యూనిట్లను ఉద్దేశపూర్వకంగానే సామర్థ్యం తగ్గించి నడుపుతూ అందుబాటులో ఉన్న విద్యుత్‌ను తక్కువ చేసి చూపిస్తుండటంపై జెన్కో వర్గాల్లో చర్చ జరుగుతోంది. రోజుకు 105 ఎంయూల విద్యుత్‌ను అందించాల్సిన ఈ ప్రాజెక్టులు కేవలం 63 ఎంయూలకే పరిమితం అవుతున్నాయి. బొగ్గు నిల్వలున్నప్పటికీ వీటిని కనీసం 80 శాతం పీఎల్‌ఎఫ్‌తో కూడా నడపక పోవడం ప్రైవేటు సంస్థలకు మేలు చేసేందుకేనని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టులో 1,163 ఎంయూల విద్యుత్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చారు. సెప్టెంబర్‌లో 1,402 ఎంయూలు, ఇలా వచ్చే మార్చి వరకు ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు సర్కారు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఏపీఈఆర్సీ 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేవలం 757 ఎంయూల కొనుగోలుకే అనుమతించింది. అయితే ప్రభుత్వం అనేక రెట్లు అధికంగా కొనుగోలు విద్యుత్‌కు ఆర్డర్లు ఇవ్వాలని తీర్మానించింది.