పోటీలో టిప్పుసుల్తాన్ వారసుడు
విరుగంబాక్కం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై విరుగంబాక్కం నియోజవర్గం నుంచి నజీర్ అహ్మద్ సుల్తాన్ స్వతంత్య్ర అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేశాడు. టిప్పుసుల్తాన్ 18వ వంశీక వారసుడిగా తనను తాను ప్రచారం చేసుకున్నాడు.ప్రయాణాలకు మహారాజులు వినియోగించే ఖరీదైన గుర్రపు బగ్గీని అందంగా అలకరించగా, నజీర్ అహ్మద్ ఆ వాహనంలోనే చేరుకుని నామినేషన్ దాఖలు చేశాడు. నజీర్ తండ్రి జమాలుద్దీన్ సుల్తాన్ టైలర్ వృత్తిని నిర్వహిస్తున్నాడు. డిప్లొమో చదువుకున్న నజీర్ అహ్మద్ సమాచార రంగ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు.
నామినేషన్ వేసిన అనంతరం నజీర్ మీడియాతో మాట్లాడుతూ తాను టిప్పుసుల్తాన్ మహారాజుకు 18వ వంశానికి చెందిన వాడినని అన్నాడు. విరుగంబాక్కం నియోజకవర్గంలో సుమారు 60 వేల మందికిపైగా ఇస్లాం మతస్తులు ఉండగా, ఏ ఒక్క పార్టీ కూడా తమ అభ్యర్థిని నిలబెట్టలేదని వాపోయాడు. ఇక్కడి ఇస్లాం మతస్తుల ప్రతినిధిగా పోటీ చేస్తున్నానని తెలిపాడు. ఇటీవల చెన్నైని వరదలు ముంచెత్తినపుడు ప్రజలకు ఎన్నో సేవలు చేసి సాయపడ్డానని తెలిపాడు. తన పేరున బ్యాంకులో రూ.30 వేలు, తన భార్యకు ఐదు సవర్ల బంగారు నగలు ఉన్నాయని ఆస్తుల చిట్టాను వివరించాడీ టిప్పుసుల్తాన్ వారసుడు.