breaking news
National Cooperative Development Corporation
-
రుణం ఇచ్చింది.. ‘మాఫీ’కి వద్దంది!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. రుణమాఫీ కోసం అవసరమైన రూ. 31 వేల కోట్లలో రూ. 5–6 వేల కోట్లను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రుణం ద్వారా సమకూర్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలపై ఆ సంస్థ నీళ్లుచల్లింది. తెలంగాణ సర్కారు అడిగిన విధంగా రూ. 5 వేల కోట్ల రుణాన్ని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు మంజూరు చేసిన ఎన్సీడీసీ.. ఆ నిధులను రుణమాఫీకి మాత్రం వినియోగించరాదని షరతు విధించింది. దీంతో ఏం చేయాలో అర్థంగాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నిధుల ధీమాతోనే... సహకార సంఘాలను, డీసీసీబీలను బలోపేతం చేయడానికి రూ. 5 వేల కోట్ల రుణ సాయం చేయాలని గతేడాది ఎన్సీడీసీని టెస్కాబ్ కోరింది. టెస్కాబ్, డీసీసీబీల నిర్వహణ తీరును పరిశీలించిన ఎన్సీడీసీ.. ఆ తర్వాత రుణం మంజూరు చేసింది. వాస్తవానికి రైతు రుణమాఫీ చేసేందుకు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న రూ. 31 వేల కోట్లు ఎలా సమకూరుతాయన్న విషయాన్ని ఆర్థికశాఖ రహస్యంగానే ఉంచుతోంది. రుణమాఫీ చేయాల్సిన రైతుల వివరాలను తమకు ఇవ్వాలని అడిగిన ఆర్థికశాఖ అధికారులు సదరు మాఫీ మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్న విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు కూడా స్పష్టత ఇవ్వలేదు.ఇప్పటివరకు మొదటి విడత 11 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ కోసం రూ. 6,070 కోట్లను సర్దుబాటు చేసి ఆ మేరకు రైతుల అప్పు ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన సుమారు రూ. 25 వేల కోట్ల నిధులను వచ్చే నెలాఖరులోగా సర్దుబాటు చేయాల్సి ఉంది. రూ. 5 వేల కోట్లు ఎన్సీడీసీ నుంచి వస్తే మిగిలిన నిధులను ఇతర రూపాల్లో సమకూర్చుకుంటామని, అందుకు తగిన ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని అధికారులు చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్సీడీసీ షరతు నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడంలేదు. రుణమాఫీకి మళ్లింపు సాధ్యమేనా? తాజాగా మంజూరైన రుణం గురించి టెస్కాబ్ వర్గాల వివరణ కోరగా రుణమాఫీకి వినియోగించవద్దని అప్పు ఇచి్చన సంస్థ ప్రత్యేకంగా చెప్పిన తర్వాత కూడా ఆ నిధులను రుణమాఫీకి వాడుకోలేమని పేర్కొన్నాయి. అప్పుగా ఇచి్చన నిధులను ఎలా వినియోగిస్తున్నారన్న విషయమై ఏ క్షణంలోనైనా తనిఖీలు లేదా ఆడిట్ చేసే అధికారం ఆ సంస్థకు ఉందని చెబుతున్నాయి. అయితే ఈ రుణాన్ని టెస్కాబ్ ద్వారా డీసీసీబీలకు బదిలీ చేసి డీసీసీబీలు తీసుకొనే నిర్ణయం ప్రకారం నిధులను వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని అంటున్నాయి.ఒకవేళ రుణమాఫీ చేసుకుంటామని సదరు డీసీసీబీలు నిర్ణయం తీసుకున్నా ప్యాక్స్‌ల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే వర్తింపజేయగలమని, అది కూడా ఏ మేరకు సాధ్యమన్నది చూడాల్సి ఉందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రుణమాఫీ కోసం ఈ నిధులను వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నందున ఏదో విధంగా ఆ నిధులను వాడుకొనే అవకాశాన్ని పరిశీలిస్తామని, సాధ్యం కాకపోతే ప్యాక్స్‌ల ద్వారా రైతులకు కొత్త రుణాలు ఇప్పించడం లేదా రైతులకు అందించే ఇతర సహకార కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించుకుంటామని టెస్కాబ్ అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడతామని అంటున్నారు. -
మామూళ్లతో లాలూచీ పడుతున్న అధికారులు
చీరాల, న్యూస్‌లైన్: చేనేత కార్మిక సహకార సంఘాలు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. కార్మికుల పేరు చెప్పుకొని సంఘ పెద్దలు నిధులన్నీ బొక్కేస్తున్నారు. సొసైటీలో సభ్యులుగా ఉండే కార్మికులకు మాత్రం చివరకు అప్పులు, పస్తులే మిగులుతున్నాయి. కార్మికులంతా కలిసి ఓ సంఘంగా ఏర్పడి, ఆ సంఘంలోనే వస్త్రాలు ఉత్పత్తి చేసి ఆప్కో ద్వారా వాటిని విక్రయించి వచ్చిన లాభాలతో జీవనం సాగించాల్సి ఉంటుంది. అలానే ఆ సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రుణాలతో పాటు తక్కువ ధరకే నూలు, ఆప్కో సబ్సిడీతో పాటు అనేక రాయితీలు కల్పిస్తుంది. ఈ సంఘంలో పనిచేసే కార్మికులంతా ఐక్యంగా ఉండి వచ్చిన ఫలాలను సమానంగా పంచుకోవాలి. సహకార బ్యాంకుల ద్వారా కోట్లాది రూపాయలు పావలా వడ్డీ కింద రుణాలు తీసుకుంటున్నారు. అలానే ఎలాంటి వస్త్రాలు నేయకుండానే ఆప్కో ద్వారా అమ్మినట్లు రికార్డుల్లో చూపి అందులో వచ్చే 40 శాతం సబ్సిడీని కూడా మింగేస్తున్నారు. కానీ కనీసం పది మంది కార్మికులకు కూడా పని చూపుతున్న సంఘాలు లేవు. జిల్లాలో మొత్తం 74 చేనేత సొసైటీలుండగా వీటిలో 38 వేల మంది సభ్యులున్నారు. కోఆపరేటివ్ స్కీంలో 15 వేల మంది, బునకర్ బీమా యోజనలో 7 వేల మంది, ఇతర పథకాల్లో 16 వేల మంది సభ్యులుగా ఉన్నారు. చేనేత సొసైటీలు చీరాల నియోజకవర్గంలో 30, కనిగిరి నియోజకవర్గంలో 10, ఒంగోలు డివిజన్లో 10, బేస్తవారిపేటలో 10, ఉలవపాడులో 2, మార్టూరులో 3 సొసైటీలున్నాయి. ఈ 74 చేనేత సొసైటీల్లో క్యాష్ క్రెడిట్ కింద నాబార్డు నుంచి కేవలం 23 సొసైటీలకు * 2.8 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేశారు. మిగిలిన 51 సొసైటీలకు చిల్లిగవ్వ కూడా కేటాయించలేదు. పొందుతున్న రాయితీలివే.. సొసైటీల మాటున సహకార బ్యాంకుల ద్వారా ఒక్కో సొసైటీ లక్ష నుంచి * 40 లక్షల వరకు రుణాలు పొందాయి. అలానే సహకార సంఘాల్లో ఎలాంటి వస్త్రాలు ఉత్పత్తి చేయకుండానే ఆప్కోలోని అధికారులతో కుమ్మక్కై ఉత్పత్తులు ఆప్కోకు విక్రయించినట్లు సొసైటీ నిర్వాహకులు రికార్డుల్లో చూపుతారు. దీని ద్వారా ఆప్కో 30 నుంచి 40 శాతం సబ్సిడీ రూపంలో సహకార సంఘాలకు అందిస్తుంది. అంటే లక్ష రూపాయల విలువైన వస్త్రాలను అమ్మితే * 40 వేలు సబ్సిడీ కింద సహకార సంఘానికి అందుతుంది. అలానే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా నామమాత్రపు వడ్డీలకు ఈ సొసైటీలకు భారీగా రుణాలందుతున్నాయి. ఎన్‌హెచ్‌డీసీ ద్వారా సబ్సిడీ నిధులు అందుతున్నాయి. అలానే ట్రైనింగ్‌లు, ఎగ్జిబిషన్ల పేరుతో సహకార సంఘాలకు నిధులు మంజూరవుతున్నాయి. ఇవన్నీ కార్మికులందరికీ సమానంగా రావాల్సి ఉంటే సొసైటీ పెద్దలు గద్దలుగా మారి ఈ నిధులన్నీ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఉపాధి కోల్పోతున్న నేతన్నలు.. సహకార సంఘాల్లో ఉన్న చేనేత కార్మికులకు పనులు కల్పించాల్సిన సొసైటీలు నామమాత్రంగా కూడా కార్మికులకు పనులు కల్పించడం లేదు. పనులు కల్పించే నాథుడే లేక కార్మికుడు వేరే పనులపై ఆధారపడుతున్నాడు. నేతన్నలు బడాబాబుల మోసానికి గురవుతూ అర్ధాకలితో, అప్పుల ఊబిలో అలమటిస్తున్నారు. నిధులు మింగేందుకు పుట్టుకొచ్చిన కొత్త సొసైటీలు... సొసైటీలు లాభసాటి వ్యాపారంగా మారడంతో కేంద్ర, రాష్ట్రాల నుంచి నిధులు, రాయితీలను మింగేందుకు నూతనంగా మరికొన్ని సొసైటీలు ప్రవేశించాయి. కొత్తగా ఏడు సొసైటీలు జిల్లాలో ఏర్పడ్డాయి. చేనేత కార్మికుల బలహీనతను కొంత మంది సొసైటీ పెద్దలు అవకాశంగా తీసుకొని కోట్లకు పడగలెత్తుతున్నారు. కార్మికుల పేరుతో రుణాలు తీసుకొని వారు సకల భోగాలు అనుభవిస్తుంటే కార్మికులు మాత్రం కష్టాల పాలవుతున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు సొసైటీ పెద్దలిచ్చే మామూళ్లకు కక్కుర్తిపడి వాటి వైపు కన్నెత్తి చూడటమే మరిచారు. అధికారుల లాలూచీతోనే అక్రమాలు.. చేనేత సొసైటీల అక్రమాలు ప్రధానంగా అధికారుల కన్నుసన్నల్లోనే జరుగుతున్నాయి. సొసైటీలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది పరిశీలించాల్సిన అధికారులు సొసైటీ పెద్దలిచ్చే కాసులకు కక్కుర్తిపడి అటు వైపు చూడటం లేదు. రికార్డులపైనే నడుస్తున్న సొసైటీల గురించి పక్కా సమాచారం ఉన్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. చాలా సొసైటీల్లో పది మంది సభ్యులు కూడా లేకపోయినా సంబంధిత అధికారులు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం దారుణం.