National borders
-
‘సరిహద్దు’లో అక్రమ నిర్మాణాలను కూల్చేయండి: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల సమీపంలో అక్రమ నిర్మాణాలపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో వెలసిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని సూచించారు. భారత్–పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించిన భద్రతా సమస్యలను ఆయన సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని సంస్థలు బ్యాంకుల బ్యాంకింగ్ లావాదేవీల్లో చట్టబద్ధ, ఆర్థిక నిబంధనలను పాటించేలా చూడాలన్నారు. పెద్ద వ్యాపార సంస్థలను ధృవీకరించడం, వాటి నిధుల మూలాలను పరిశీలించడం, మ్యూల్ ఖాతాలు, నకిలీ కంపెనీలను గుర్తించడం, నకిలీ ఆధార్ కార్డులను గుర్తించడం, సరిహద్దు స్మగ్లింగ్‌ను నియంత్రించడం వంటి బాధ్యతలను జిల్లా మేజి స్ట్రేట్లకు అప్పగించారు. నేరాలు, మాదకద్రవ్యాల బెడద వెనుక ఉన్న మూలాలు, తీరు, నెట్‌వర్క్‌లపై లోతైన అధ్యయనం చేయాలని, భవిష్యత్తులో ఈ సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు రూపొందించాలని సరిహద్దు జిల్లాలను ఆదేశించారు. ప్రతి సరిహద్దు జిల్లాకు పౌరులు, ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా సంస్థలతో కూడిన భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. చొరబాటు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ఆక్రమణలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఇతర సరిహద్దు నేరాల వంటి సమస్యలను పరిష్కరించడానికి, సరిహద్దు నిర్వహణ కోసం బీఎస్ఎఫ్, సీబీడీటీ, ఎన్సీబీ, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమన్వయ విధానం రూపొందించాలన్నారు. సరిహద్దు గ్రామాల్లో అన్ని ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అమలు అయ్యేలా చూడాలని షా ఆదేశించారు. అలాగే సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ‘1930’ కాల్ సెంటర్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
చొరబాట్లపై ఉక్కుపాదం: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల గుండా జరిగే చొరబాట్లను ఏమాత్రం ఉపేక్షించబోమని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అక్రమ వలసదారులను గుర్తించి, వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు, సరిహద్దులను పూర్తిగా మూసివేసేందుకు ఈ ఏడాది ‘స్మార్ట్ బోర్డర్’ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం విజ్ఞాన్ భవన్లో జరిగిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సదస్సులో ఆయన ఈ విషయం వెల్లడించారు. దేశ అంతర్జాతీయ సరిహద్దుల్లో 6 వేల కిలోమీటర్ల మేర అభేద్యమైన భద్రతా గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. స్మార్ట్ బోర్డర్ విధానంలో భాగంగా వచ్చే ఏడాదిలోగా బీఎస్ఎఫ్ బలగాలకు డ్రోన్ రాడార్లు, అత్యాధునిక కెమెరాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూరుస్తామన్నారు. అక్రమ వలసలు దేశ జనాభా స్వరూపాన్ని మార్చేందుకు పన్నుతున్న ఉద్దేశపూర్వక కుట్రగా ఆయన అభివరి్ణంచారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి తిప్పి పంపుతామని ఆయన స్పష్టం చేశారు. అట్టడుగు స్థాయి నుంచి సమన్వయం: సరిహద్దుల్లో చొరబాట్లు, పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్ అధికారులు రాష్ట్ర పోలీసులు, జిల్లా కలెక్టర్లు, గ్రామ పటా్వరీలతో నేరుగా సమన్వయం చేసుకోవాలని అమిత్ షా సూచించారు. ఇందుకోసం నిఘా వ్యవస్థను మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలనను ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. ‘సమస్యను అదుపులో ఉంచడం భద్రత అనిపించుకోదు, దానిని మూలాల నుంచి నిర్మూలించడమే సరైన విధానం‘అని వ్యాఖ్యానించారు. సరిహద్దు భద్రతా గ్రిడ్ కట్టుదిట్టమైన అమలుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కీలకమని షా పేర్కొన్నారు. ముఖ్యంగా పచ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాలతో విధానపరమైన సమన్వయం అవసరమని తెలిపారు. దీనిపై చర్చించేందుకు త్వరలోనే ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని వివరించారు. -
సరిహద్దు భద్రతకు యాంటీ–డ్రోన్ యూనిట్
జోద్పూర్: మన దేశ సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. సరిహద్దుల్లో సమగ్ర యాంటీ–డ్రోన్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. శత్రుదేశాల నుంచి డ్రోన్లు, మానవ రహిత వైమానిక వాహనాల ముప్పు పెరుగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోందని పేర్కొన్నారు. అందుకే సరిహద్దుల్లో శత్రుదేశాల డ్రోన్లను గుర్తించి, ధ్వంసం చేయడానికి యాంటీ–డ్రోన్ యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించినట్లు స్పష్టంచేశారు. సరిహద్దు భద్రతా దళాలు, రక్షణ శాఖ, పరిశోధన సంస్థలు, డీఆర్డీఓ భాగస్వామ్యంతో దీన్ని తీసుకురాబోతున్నట్లు వివరించారు. రాజస్తాన్‌లో ఆదివారం సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) 60వ రైజింగ్ డేలో అమిత్ షా పాల్గొన్నారు. బీఎస్ఎఫ్ జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. లేజర్‌తో పనిచేసే యాంటీ–డ్రోన్ గన్ మౌంటెడ్ వ్యవస్థను ఇప్పటికే ప్రవేశపెట్టామని, దీంతో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. పంజాబ్‌లో భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ వ్యవస్థ అమల్లో ఉందని అమిత్ షా పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం.. 2023లో భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత సైన్యం 110 డ్రోన్లను కూలి్చవేసింది, కొన్నింటిని స్వాధీనం చేసుకుంది. -
ఆపరేషన్ నమస్తే
న్యూఢిల్లీ/చండీగఢ్: కరోనా వైరస్ విస్తృతి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికుల కోసం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవాణే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఆపరేషన్ నమస్తే అనే ఈ కార్యక్రమంలో కరోనాపై పోరులో ప్రభుత్వానికి సాయం అందించడంతోపాటు పాక్, చైనా సరిహద్దుల్లోని 13 లక్షల మంది సైనికులు, వారి కుటుంబాలు వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకోనున్నారు. సైనిక సిబ్బంది తమ క్లిష్టమైన విధుల దృష్ట్యా సామాజిక దూరం పాటించడం సాధ్యం కాదని, అందుకే సాధ్యమైనన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘మీ కుటుంబాల సంక్షేమం గురించి మేం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని సరిహద్దులోని జవాన్లకు హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మేం విజయం సాధిస్తాం’ అని తెలిపారు. ఆపరేషన్ నమస్తేలో భాగంగా ప్రత్యేకంగా కమాండ్ల వారీగా సాయం అందించేందుకు హెల్ప్లైన్లు ఏర్పాటు చేయడంతోపాటు పలు సూచనలు జారీ చేసింది. అదేవిధంగా, కరోనా వైరస్ అనుమానిత కేసుల కోసం ఆర్మీ వెస్టర్న్ కమాండ్ పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా బారినపడిన సైనిక సిబ్బందికి, ప్రజలకు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను 28 సైనికాస్పత్రుల్లో సిద్ధం చేసింది. కేంద్రానికి నోటీసులు... ఇరాన్‌కు తీర్థయాత్రకు వెళ్లిన 850 మందిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. కరోనా నేపథ్యంలో ఇరాన్‌లోని క్వోమ్ నగరంలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించాలంటూ లదాఖ్‌కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అదేవిధంగా, బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన 580 మంది కశ్మీర్ వైద్య విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన చర్యలను తెలపాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. -
20 లక్షల కస్టమర్లకు చేరువయ్యాం..
కల్యాణ్ జువెల్లర్స్ సీఎండీ టి.ఎస్.కల్యాణరామన్ వీరిలో 90 శాతం మంది పాతవారే - మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నాం - 2015-16లో రూ.13,000 కోట్ల టర్నోవర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కేరళలోని త్రిస్సూర్‌లో 23 ఏళ్ల క్రితం ఒక స్టోర్‌తో ప్రారంభమైన కల్యాణ్ జువెల్లర్స్ ప్రస్థానం ఇప్పుడు దేశ సరిహద్దులను చెరిపేసింది. విదేశీ కస్టమర్లకూ పుత్తడి వెలుగులను విజయవంతంగా పంచుతోంది. ఈ వెలుగులు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పిన్కస్ను సైతం ఆకట్టుకునేలా చేశాయి. వార్బర్గ్ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెట్టిందంటే సంస్థ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 20 లక్షల మంది కస్టమర్లను సొంతం చేసుకుందీ ఆభరణాల సంస్థ. ఇదే ఊపుతో ఇతర రాష్ట్రాలతోపాటు మరిన్ని దేశాల్లో అడుగు పెట్టబోతున్నామని అంటున్నారు కల్యాణ్ జువెల్లర్స్ సీఎండీ టి.ఎస్.కల్యాణరామన్. సంస్థ భవిష్యత్ ప్రణాళిక, చేపట్టిన కార్యక్రమాలు, పరిశ్రమ తీరుతెన్నులను సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కల్యాణ్ జువెల్లర్స్ గురించి వివరిస్తారా? భారత్‌లో 72 స్టోర్లను నిర్వహిస్తున్నాం. యూఏఈలో 10, కువైట్‌లో 3 ఔట్లెట్లు ఉన్నాయి. బంగారు ఆభరణాలకు బీఐఎస్ ధ్రువీకరణ పరిచయం చేసింది తొలుత మేమే. పారదర్శకత కోసం ఆభరణం పూర్తి వివరాలతో ప్రైస్ ట్యాగ్‌ను తీసుకొచ్చాం. ధ్రువీకరణ కలిగిన వజ్రాలను అందుబాటు ధరలో విక్రయిస్తున్నాం. క్యాష్ బ్యాక్, బై బ్యాక్ ఆఫర్లనూ నిర్వహిస్తున్నాం. మహిళలు అత్యధిక కస్టమర్లుగా ఉన్న ఆభరణాల రంగంలో పురుషులను ప్రచారకర్తలుగా నియమించాం. 20 లక్షల మంది కస్టమర్లకు చేరువయ్యాం. వీరిలో 90 శాతం మంది పాత కస్టమర్లే కావడం విశేషం. కల్యాణ్ పారదర్శక వ్యాపారానికి ఇది నిదర్శనం. కొత్తగా ఏఏ దేశాలకు విస్తరిస్తున్నారు? ఆభరణాల తయారీ, పంపిణీ రంగంలో భారత్‌లో అగ్రశ్రేణి సంస్థగా నిలిచాం. మార్చికల్లా మరో 15 స్టోర్లను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో స్టోర్ల సంఖ్య 100 కానుంది. ఖతార్‌లో అడుగు పెట్టనున్నాం. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లో ప్రవేశించనున్నాం. వచ్చే ఏడాది సింగపూర్, మలేషియాల్లో దుకాణాలను తెరుస్తాం. విస్తరణకుగాను 2015-16లో రూ.800 కోట్లు వ్యయం చేస్తాం. ఇ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించే ఆలోచన ఉంది. మై కల్యాణ్ స్టోర్ల విస్తరణ ఏమైనా ఉందా? కస్టమర్ సర్వీస్ ఔట్లెట్లను తొలిసారిగా ప్రారంభించిన ఘనత మాదే. మై కల్యాణ్ పేరుతో 600 కేంద్రాలను నిర్వహిస్తున్నాం. ఆభరణాల కొనుగోలు, పథకాలు, బీమా, వేడుకలకు ముందస్తు కొనుగోలు ప్రణాళిక, గిఫ్ట్ వోచర్లు, ఆభరణాల కొనుగోలు చిట్కాలను ఇక్కడ కస్టమర్లకు వివరిస్తాం. ఈ కేంద్రాలను మినీ డైమండ్ స్టోర్లుగా మార్చనున్నాం. రూ.5-25 వేల ధరలో లభించే వజ్రాభరణాలను విక్రయిస్తాం. ఈ విభాగంలో దేశంలో అపార అవకాశాలు ఉన్నాయి. మై కల్యాణ్ స్టోర్ల ద్వారా మార్చికల్లా రూ.100 కోట్ల వ్యాపారం ఆశిస్తున్నాం. ఆభరణాల విక్రయాలు తగ్గాయి కదా.. మీరేమంటారు? తొలి త్రైమాసికంలో అమ్మకాలు అంతగా సాగలేదు. అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని రెండవ త్రైమాసికం గణాంకాలనుబట్టి అవగతమైంది. వివాహాలు, పండుగల సీజన్ మరింత కలసి రానుంది. సంస్థ వృద్ధిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే రెండేళ్లుగా పెద్ద ఎత్తున విస్తరణ దిశగా అడుగులు పడ్డాయి. దీర్ఘకాలిక వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నాం. బంగారు ఆభరణాల పట్ల వినియోగదార్లలో ఉత్సాహం ఎన్నటికీ తరగదని మా విశ్వాసం. తరతరాలుగా ప్రీతిపాత్రమైన పుత్తడిపై ముఖ్యంగా భారతీయులకు మక్కువ ఎక్కువే. పుత్తడి ధర మరింత తగ్గే అవకాశం ఉందా? పసిడి ధర హేతుబద్ధ స్థాయి వద్ద క్రమంగా స్థిరపడుతోంది. పుత్తడి కొనుగోలుకు ఇదే సరైన సమయం. ప్రస్తుత ధర వద్ద బంగారం కొనుగోలు చేయడం ద్వారా అధిక విలువను పొందవచ్చు. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం ఆశిస్తున్నారు? 2014-15లో కల్యాణ్ జువెల్లర్స్ సుమారు రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతం వృద్ధితో రూ.13,000 కోట్లు లక్ష్యంగా చేసుకున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లు అధిక వృద్ధికి ఆస్కారం ఉన్నవి. ఈ రెండు రాష్ట్రాల నుంచి ఆదాయం ప్రముఖంగానే సమకూరుతోంది.


