సరిహద్దుల్లో ‘స్మార్ట్ బోర్డర్’ప్రాజెక్టు
6 వేల కిలోమీటర్ల భద్రతా గ్రిడ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల గుండా జరిగే చొరబాట్లను ఏమాత్రం ఉపేక్షించబోమని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అక్రమ వలసదారులను గుర్తించి, వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు, సరిహద్దులను పూర్తిగా మూసివేసేందుకు ఈ ఏడాది ‘స్మార్ట్ బోర్డర్’ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) సదస్సులో ఆయన ఈ విషయం వెల్లడించారు.
దేశ అంతర్జాతీయ సరిహద్దుల్లో 6 వేల కిలోమీటర్ల మేర అభేద్యమైన భద్రతా గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. స్మార్ట్ బోర్డర్ విధానంలో భాగంగా వచ్చే ఏడాదిలోగా బీఎస్‌ఎఫ్ బలగాలకు డ్రోన్ రాడార్లు, అత్యాధునిక కెమెరాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూరుస్తామన్నారు. అక్రమ వలసలు దేశ జనాభా స్వరూపాన్ని మార్చేందుకు పన్నుతున్న ఉద్దేశపూర్వక కుట్రగా ఆయన అభివరి్ణంచారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి తిప్పి పంపుతామని ఆయన స్పష్టం చేశారు.
అట్టడుగు స్థాయి నుంచి సమన్వయం: సరిహద్దుల్లో చొరబాట్లు, పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు బీఎస్‌ఎఫ్ అధికారులు రాష్ట్ర పోలీసులు, జిల్లా కలెక్టర్లు, గ్రామ పటా్వరీలతో నేరుగా సమన్వయం చేసుకోవాలని అమిత్ షా సూచించారు. ఇందుకోసం నిఘా వ్యవస్థను మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలనను ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. ‘సమస్యను అదుపులో ఉంచడం భద్రత అనిపించుకోదు, దానిని మూలాల నుంచి నిర్మూలించడమే సరైన విధానం‘అని వ్యాఖ్యానించారు. సరిహద్దు భద్రతా గ్రిడ్ కట్టుదిట్టమైన అమలుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కీలకమని షా పేర్కొన్నారు. ముఖ్యంగా పచ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాలతో విధానపరమైన సమన్వయం అవసరమని తెలిపారు. దీనిపై చర్చించేందుకు త్వరలోనే ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని వివరించారు.


