‘సరిహద్దు’లో అక్రమ నిర్మాణాలను కూల్చేయండి: అమిత్‌ షా | Demolition of Illegal Structures Near India-Pak Border, Says Amit Shah | Sakshi
Sakshi News home page

‘సరిహద్దు’లో అక్రమ నిర్మాణాలను కూల్చేయండి: అమిత్‌ షా

May 28 2026 12:51 AM | Updated on May 28 2026 12:51 AM

Demolition of Illegal Structures Near India-Pak Border, Says Amit Shah

న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల సమీపంలో అక్రమ నిర్మాణాలపై ‘జీరో టాలరెన్స్‌’ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధికారులను ఆదేశించారు. సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో వెలసిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని సూచించారు. భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దు వెంబడి ఉన్న రాజస్థాన్‌ సరిహద్దు జిల్లాలకు సంబంధించిన భద్రతా సమస్యలను ఆయన సమీక్షించారు. 

సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని సంస్థలు బ్యాంకుల బ్యాంకింగ్‌ లావాదేవీల్లో చట్టబద్ధ, ఆర్థిక నిబంధనలను పాటించేలా చూడాలన్నారు. పెద్ద వ్యాపార సంస్థలను ధృవీకరించడం, వాటి నిధుల మూలాలను పరిశీలించడం, మ్యూల్‌ ఖాతాలు, నకిలీ కంపెనీలను గుర్తించడం, నకిలీ ఆధార్‌ కార్డులను గుర్తించడం, సరిహద్దు స్మగ్లింగ్‌ను నియంత్రించడం వంటి బాధ్యతలను జిల్లా మేజి స్ట్రేట్లకు అప్పగించారు.

 నేరాలు, మాదకద్రవ్యాల బెడద వెనుక ఉన్న మూలాలు, తీరు, నెట్‌వర్క్‌లపై లోతైన అధ్యయనం చేయాలని, భవిష్యత్తులో ఈ సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు రూపొందించాలని సరిహద్దు జిల్లాలను ఆదేశించారు. ప్రతి సరిహద్దు జిల్లాకు పౌరులు, ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా సంస్థలతో కూడిన భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

 చొరబాటు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ఆక్రమణలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఇతర సరిహద్దు నేరాల వంటి సమస్యలను పరిష్కరించడానికి, సరిహద్దు నిర్వహణ కోసం బీఎస్‌ఎఫ్, సీబీడీటీ, ఎన్‌సీబీ, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమన్వయ విధానం రూపొందించాలన్నారు. సరిహద్దు గ్రామాల్లో అన్ని ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అమలు అయ్యేలా చూడాలని షా ఆదేశించారు. అలాగే సైబర్‌ నేరాలను ఎదుర్కోవడానికి ‘1930’ కాల్‌ సెంటర్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement