breaking news
Musical Album
-
డల్లాస్‌లో ఘనంగా ఎస్ జానకి సంగీత నివాళి కార్యక్రమం
టెక్సస్: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అపూర్వమైన గానమాధుర్యంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గానకోకిల ఎస్ జానకి (జానకమ్మ) గారికి సంగీత నివాళిగా శనివారం డల్లాస్‌లోని తెలుగు కళాభిమానులు ఒక అద్భుతమైన సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు.DGIT (Dallas Got India Talent) వ్యవస్థాపకుడు రామన్ వీరంరాజు నాయకత్వంలో, కళావాహిని వ్యవస్థాపకుడు అనంత్ మల్లవరపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం శుభమ్ ఈవెంట్ సెంటర్ – A2B, ఫ్రిస్కోలో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాఖ్యాత పరిమళ మార్పాక జానకి గారి సంగీత ప్రస్థానానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు, ప్రతి గీతానికి ఇచ్చిన చక్కని పరిచయాలు కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చాయి.డల్లాస్ మెట్రోప్లెక్స్‌లోని పలువురు ప్రతిభావంతులైన గాయనీ, గాయకులు జానకి గారు ఆలపించిన అజరామరమైన గీతాలతో ఆమెకు సంగీతాంజలి ఘటించారు. ప్రేమ, భక్తి, శృంగారం, జానపదం, భావోద్వేగం వంటి విభిన్న భావాలను ప్రతిబింబించే ఆమె చిరస్మరణీయ గీతాలను ఆలపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ప్రతి గీతం ముగిసినప్పుడల్లా సభాభవనం కరతాళ ధ్వనులతో మార్మోగింది.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ గాయనిగా శిష్ట్లా జానకి గారి విశిష్ట లక్షణాలను ఒకసారి పరిశీలిస్తే – భావ వ్యక్తీకరణ - పాటలోని ఆనందం, బాధ, ప్రేమ, భక్తి, కోపం, అమాయకత్వం ఇలా ఏ భావాన్నైనా ఆమె గాత్రంలో సహజంగా పలికించగల్గడం; గాత్ర వైవిధ్యం - హాస్యపాత్రల స్వరం, రెండేళ్ళ పసిపాప నుంచి, తొంబై ఏళ్ల వృద్ధురాలి వరకూ ఏ స్వరాన్నైనా అద్భుతంగా పలికించగల అరుదైన సామర్థ్యం; భాషలపై పట్టు - ఏ భాషలో పాట పాడినా, ఆ భాషకు చెందిన వ్యక్తే పాడుతున్నారేమో అనిపించేంత స్పష్టమైన ఉచ్చారణతో పాడడానికి నిరంతర సాధన; సంగీతదర్శకుల అభిరుచికి అనుగుణంగా - శాస్త్రీయ గీతాలు, జానపద గీతాలు, ప్రేమగీతాలు, భక్తిగీతాలు, వేగవంతమైన నృత్యగీతాలు ఇలా ఎలాంటి పాటనైనా సమాన ప్రతిభతో పాడే నైపుణ్యం; వినయం - ఎన్నో వేల పాటలు పాడి, అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నప్పటికీ, తాను నిత్య విద్యార్ధినేనంటూ ఎంతో నిరాడంబరంగా జీవించిన పుణ్యజీవి అన్నారు. 6 దశాబ్దాలపాటు 15 రకాల వివిధ భాషల్లో 50,000 కు పైగా పాటలగా సాగిన గాయనీమణి జానకి గారి గాత్ర జైత్రయాత్ర అజరామరం అంటూ ఘన నివాళులర్పించారు.” డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ- ఎస్. జానకి గారి గానం భారతీయ సంగీతానికి ఒక అపూర్వమైన వరమని, ఆమె పాటలు యుగయుగాల పాటు సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంటాయని కొనియాడారు.ఈ సందర్భంగా నిర్వాహకులు రామన్ వీరంరాజు మరియు అనంత్ మల్లవరపు మాట్లాడుతూ - విదేశాల్లో పెరుగుతున్న తెలుగు తరాలకు మన సంగీత, సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా భారతీయ కళలను ప్రోత్సహించే మరిన్ని నాణ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.అందమైన వేదిక అలంకరణ, అద్భుతమైన సంగీత బృందం, స్థానిక గాయనీ, గాయకుల ప్రతిభ, పరిమళ మార్పాక చక్కని వ్యాఖ్యానం, ప్రేరణాత్మక సందేశాలు, అలాగే బాల గణపవరపు అందించిన నాణ్యమైన ఆడియో సపోర్ట్ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశాయి. కార్యక్రమం ముగింపులో ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లతో గానకోకిల ఎస్. జానకి గారికి తమ సంగీత ప్రణామాలర్పించారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ విశాలమైన వేదికను అందించడమే కాకుండా, విచ్చేసిన అతిథులు మరియు ప్రేక్షకులకు ఆతిథ్యపూర్వకంగా రుచికరమైన అల్పాహారం అందించి కార్యక్రమ విజయానికి విశేషంగా సహకరించినందుకు A2B (Adyar Anand Bhavan) యాజమాన్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.DGIT (Dallas Got India Talent) మరియు కళావాహిని సంయుక్తంగా నిర్వహించిన ఈ సంగీత నివాళి కార్యక్రమం డల్లాస్ తెలుగు సాంస్కృతిక వేదికపై చిరస్మరణీయమైన సంగీత సంధ్యగా నిలిచి, జానకమ్మ ఆలపించిన అజరామరమైన గీతాల ద్వారా ఆమెకు ఘనమైన సంగీతాంజలి అర్పించిన ఒక విశిష్ట సాంస్కృతిక వేడుకగా చరిత్రలో నిలిచిపోనుంది. -
వీక్లీ పోల్‌లో బీటీఎస్ ప్రభంజనం..
అంతర్జాతీయ పాప్ సంగీత ప్రపంచంలో కొరియన్ బ్యాండ్ ‘బీటీఎస్’ మరోసారి తన సత్తా చాటుకుంది. బిల్బోర్డ్ నిర్వహించిన అత్యంత ప్రజాదరణ పొందిన కొత్త సంగీతం పోల్‌లో బీటీఎస్ సరికొత్త డిజిటల్ సింగిల్ ‘కమ్ ఓవర్’ భారీ మెజారిటీతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.జూన్ 12 న పారంభమైన ఈ పోలింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీటీఎస్ అభిమానులు భారీగా ఓట్లు వేయడంతో, ఏకంగా 86 శాతానికి పైగా ఓట్లతో ఈ పాట క్లీన్ స్వీప్ చేసింది. ఈ రేసులో హాలీవుడ్ పాప్ స్టార్ ఒలివియా రోడ్రిగో, జాక్ వైట్, బెబే రెక్సా, కాట్సే వంటి దిగ్గజ కళాకారుల కొత్త ఆల్బమ్‌లు పోటీలో ఉన్నప్పటికీ, బీటీఎస్ క్రేజ్ ముందు అవేవీ నిలవలేకపోయాయి. ఫలితంగా ‘కమ్ ఓవర్’ ఒకేపక్షంగా ల్యాండ్‌స్లైడ్ విజయాన్ని నమోదు చేసింది. రెండవ స్థానంలో ప్రముఖ పాప్ సింగర్ ఒలివియా రోడ్రిగో విడుదల చేసిన ‘యూ సీమ్ ప్రెట్టీ శాడ్ ఫర్ ఎ గర్ల్ సో ఇన్ లవ్’ ఆల్బమ్ నిలిచింది.‘కమ్ ఓవర్’ అనేది బీటీఎస్ గతంలో విడుదల చేసిన ‘అరిరంగ్’ ఆల్బమ్‌కు సంబంధించిన బోనస్ ట్రాక్. ఇప్పటివరకు కేవలం ఫిజికల్ డీలక్స్ వినైల్ ఎడిషన్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సాంగ్‌ను, బీటీఎస్ వార్షిక వేడుక ‘ఫెస్టా’ సందర్భంగా అధికారికంగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోకి విడుదల చేశారు. కొరియన్, ఇంగ్లీష్ భాషల కలయికతో సాగే ఈ సాంగ్.. దూరమైన ్రపాణస్నేహితుడిని లేదా ప్రియమైన వారిని తిరిగి కలుసుకోవాలనే ఆరాటాన్ని, పశ్చాత్తాపాన్ని ఎంతో భావోద్వేగంగా ఆవిష్కరిస్తుంది. బీటీఎస్ సభ్యులైన ఆర్ఎమ్, సుగా, జె–హోప్ స్వయంగా ఈ పాట నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం గ్లోబల్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌పై ‘కమ్ ఓవర్’ స్ట్రీమింగ్ రికార్డులను తిరగరాస్తోంది. -
భక్తి పాట రాసిన హీరో శివకార్తికేయన్
తమిళ స్టార్ శివకార్తికేయన్‌కు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అవుతోందని చెప్పవచ్చు. ఈయన కథానాయకుడిగా నటిస్తూనే నిర్మాతగా ఎస్కే ప్రొడక్షన్స్ పతాకంపై పలు వైవిధ్యమైన కథా చిత్రాలను నిర్మిస్తూ, ఇతరులు నిర్మించిన మంచి కంటెంట్‌తో కూడిన చిత్రాలను విడుదల చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. అలా ఈయన ఇటీవల నిర్మించిన తాయ్‌కిళవి చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోగా, నిర్మాతగా విజయాలను అందుకుంటున్న ఈయనలో మంచి గాయకుడు, గీత రచయిత కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడీయన ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ రంగంలోకి అడుగు పెట్టారు. వేలుమ్ మయిలుమ్ అంటూ సాగే భక్తిరస పాటకు లిరిక్స్ అందించారు. ఈ ప్రైవేట్ మ్యూజికల్‌కు నివాస్ కే. ప్రసన్న సంగీతాన్ని అందించి, పాడారు. దీన్ని తాయ్ కిళవి ఫేమ్ శివకుమార్ మురుగేశన్ డైరెక్ట్ చేశాడు. ఇలాంటి ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్‌లు ఈ సంస్థ నుంచి మరిన్ని వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇకపోతే శివకార్తికేయన్.. మురుగేశన్ దర్శకత్వంలో 'సెయోన్' చిత్రంలో నటిస్తున్నారు. -
నేడు రోంకిణి గుప్తా సంగీత ప్రదర్శన
మ్యాస్ట్రో ఎ.ఆర్.రెహ్మాన్ అభిమాన గాయకురాలిగా గుర్తింపు పొందిన ప్రముఖ నేపథ్య గాయని రోంకిణి గుప్తా నగరంలో తన సంగీత ప్రదర్శన శనివారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ టూరిజంతో కలిసి సాయంత్రం 6.30 గంటలకు మాసబ్ ట్యాంక్ సమీపంలోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (జెఎన్ఎఎఫ్ఎయు) ఆడిటోరియంలో రోంకిణి గుప్తా హిందుస్థానీ క్లాసికల్ సంగీతాన్ని సుర్మండల్ పేరిట అందించనున్నారు. మూడు సార్లు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా నామినేట్ అయిన రోంకిణి గుప్తా ఇటీవల స్వర కోకిల లతా మంగేష్కర్ అవార్డును సైతం అందుకున్నారు. -
Lok Sabha Election 2024: ఓట్ల ‘బ్యాండ్’ బాజా!
ఎన్నికల ప్రచారంలో ఎవరి గోల వారిదే! అభ్యర్థులు ఎడాపెడా హామీలతో ఓటర్లకు గాలం వేస్తుంటే, ఎన్నికల అధికారులేమో పోలింగ్ శాతం పెంచేందుకు ‘బ్యాండ్’ బాజా మోగిస్తున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు, ముఖ్యంగా యువ ఓటర్లను బూత్‌లకు రప్పించేందుకు హర్యానా ఎన్నికల అధికారులు వినూత్నంగా మ్యూజికల్ బ్యాండ్లను రంగంలోకి దించుతున్నారు. ఎన్నికల థీమ్ సాంగ్స్‌తో మాంచి సంగీత విభావరుల ద్వారా వారిలో చైతన్యం పెంచే పనిలో పడ్డారు. ఈ బ్యాండ్లు ఓటర్లను, ముఖ్యంగా యువత ఓటేసేలా జోష్ నింపడంతో పాటు ఎన్నికలకు సంబంధించి ఓటర్లలో అవగాహన కూడా పెంచుతాయని హర్యానా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనురాగ్ అగర్వాల్ చెబుతున్నారు. పంచ్కులలో తొలి ఎలక్షన్ థీమ్ మ్యూజిక్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. తర్వాత యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రతి జిల్లాలో ఇలాంటి మ్యూజిక్ బ్యాండ్స్ అలరిస్తాయని పేర్కొన్నారు. హర్యానాలో మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కనున్నారు. ఇక్కడ 18–19 ఏళ్ల ఓటర్లు 3.65 లక్షల మంది ఉండగా 20–29 వయస్సున్న ఓటర్ల సంఖ్య 39 లక్షలు. మ్యూజిక్ అంటే ఫిదా అయిపోయే యువతను లక్ష్యంగా చేసుకునే ఈసీ బ్యాండ్ మోగిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం ’చునావ్ కా పర్వ్ – దేశ్ కా గర్వ్‘ (ఓట్ల సంబరం – దేశానికి గర్వకారణం) నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని అగర్వాల్ చెప్పారు. ప్రజాస్వామ్యానికున్న పవర్‌ను, ఓటు ప్రాధాన్యాన్ని తెలుసుకోవడానికి యువత, ముఖ్యంగా తొలిసారి ఓటేసే యువతరం పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో హర్యానాలో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కనీసం 75 శాతాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇద్దరు శ్రుతీహాసన్లు కావాలి!
మీకు పాటలు పాడటం ఇష్టమా? నటనంటే ఇష్టమా? అని శ్రుతీహాసన్‌ని అడిగితే.. ‘‘రెండు కళ్లల్లో ఏది ముఖ్యమో చెప్పమంటే ఏం చెబుతాను’’ అంటారు. సంగీతం అంటే ఈ బ్యూటీకి చిన్నప్పట్నుంచీ ప్రాణం. కానీ, ఇప్పుడు కథానాయికగా బిజీ కావడం వల్ల సంగీతానికి ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నారామె. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మొత్తం ఏడు చిత్రాల్లో నటిస్తున్నాను. దాంతో ఏదైనా మ్యూజికల్ ఆల్బమ్ తయారు చేయాలని ఉన్నా తీరిక చిక్కడం లేదు. సంగీతం మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టే, అప్పుడప్పుడూ కొన్ని సినిమాలకు పాడుతున్నాను. ఒకవేళ పూర్తి స్థాయి గాయనిగా, నటిగా కొనసాగాలని ఆశపడితే అప్పుడు ఒకరు కాదు... ఇద్దరు శ్రుతీహాసన్లు కావాలి’’ అన్నారు సరదాగా. -
సంగీతం తప్ప నాకు వేరే ప్రపంచం తెలీదు : రాహుల్ నంబియార్
రాహుల్ నంబియార్ గానంలో గమ్మత్తు ఉంటుంది. దక్షిణాది శ్రోతలకు ఆయన్ను దగ్గర చేసింది అదే. ‘దూకుడు’లో ‘గురువారం మార్చి ఒకటి’, ‘సీతమ్మవాకిట్లో...’ లో ‘ఓఓఓ అమ్మాయీ’... ఇలా చెప్పుకుంటూ పోతే... రాహుల్ నంబియార్ హిట్ సాంగ్స్ ఎన్నో. గాయకునిగా బిజీగా ఉన్న రాహుల్... సామాజిక స్పృహతో తానే సొంతంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఓ మ్యూజికల్ ఆల్బమ్ రూపొందించారు. దాని తెలుగు వెర్షన్ పేరు ‘చెత్త’. మంగళవారం హైదరాబాద్‌లో సంగీత దర్శకుడు తమన్ చేతుల మీదుగా ఈ ఆల్బమ్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ నంబియార్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ. ‘చెత్త’ అనగానే ఎవరికైనా నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది. ఆ టైటిల్ ఎందుకు పెట్టారు. నరేంద్రమోదీ ‘స్వచ్ఛ భారత్’ స్లోగన్ దీనికి ప్రేరణా? లేదు..లేదు.. నేను ఈ ఆల్బమ్ ప్రారంభించి రెండేళ్లయ్యింది. మోదీ వీధుల్లో చెత్తను శుభ్రం చేసి దేశాన్ని శుభ్రంగా ఉంచమని చెబుతున్నారు. జనహృదయాల్లో ఉన్న చెత్తను తొలగించుకోమని నేను నా వీడియో ద్వారా చెబుతున్నాను. కేవలం ఇంట్రస్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ‘చెత్త’ అని పేరు పెట్టాను. ఇక్కడ చెత్త అంటే మానవ సంబంధాల్లోని సమస్యలు. చిన్న చిన్న సమస్యలను ప్రతి ఒక్కరు హృదయాల్లో దాచుకుంటారు. వాటిని నిర్భయంగా బయట పెట్టేస్తే, జీవితం నిశ్చింతగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా ‘చెత్త’ ఆల్బమ్ లక్ష్యం అదే. తెలుగు వెర్షన్‌కి అనంత శ్రీరాం సాహిత్యాన్ని అందించారు. ఓసారి మీ ఫ్లాష్బ్యాక్లోకెళ్దాం... సంగీతం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి? బాల్యం నుంచే సంగీతమంటే నాకు ప్రాణం. ఎంకామ్, ఎంబీఏ చదువుకున్నాను. పాటల కోసం బ్యాంక్ ఉద్యోగాన్నీ వదిలేశాను. మణి శర్మగారు గాయకునిగా నాకు తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, తమన్ వెన్నుతట్టారు. సంగీతం త ప్ప నాకు వేరే ప్రపంచం తెలీదు. క్లాసికల్ నేర్చుకున్నారా? ఏడాది పాటు నేర్చుకున్నాను. నాకు గురువు అంటూ ప్రత్యేకించి చెప్పడానికి ఎవరూ లేరు. ఎక్కువగా వినడం ద్వారానే సంగీతం నాకు అబ్బింది. కిశోర్ కుమార్, ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఏసుదాస్ పాటలంటే ప్రాణం. వాళ్లే నాకు ప్రేరణ. ఇప్పటివరకూ ఎన్ని పాటలు పాడి ఉంటారు? తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం కలిపి దాదాపు 500 పాటలు పాడి ఉంటాను. అయితే... ఎక్కువ పాటలు మాత్రం తెలుగులోనే పాడాను. ‘గురువారం మార్చి ఒకటి’(దూకుడు).. ‘తూ ఆజా సరోజా’(ఆగడు).. ‘ఇలా ఎంతసేపు’ (శశిరేఖాపరిణయం) ఇలా నాకు పేరు తెచ్చిన పాటలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం వస్తున్న పాటలు సంతృప్తినిస్తున్నాయా? ట్రెండ్ డిఫరెంట్‌గా ఉందండీ. మనం కూడా దాన్నే ఫాలో అవ్వాలి. మనకు నచ్చని పాట హిట్ కావచ్చు. దాంట్లో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుని.. ఫాలో కావాల్సిన అవసరం ఉంది. పాతపాటలు గొప్పవనీ, కొత్తపాటలకు లాంగ్విటీ ఉండదనీ వినిపిస్తున్న విమర్శలను ఏకీభవిస్తారా? కచ్చితంగా పాత పాటలు గొప్పవే. వాటిల్లో గొప్ప మెలోడి ఉంటుంది. సౌండ్, మెలోడి సమ్మిళితం కొత్త పాటలు. పాటలు వినడానికి కొత్తగా సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆన్లైన్ ద్వారా శ్రోతలకు పాట సులభంగా చేరుతోంది. అప్పట్లో ఈ సౌలభ్యం లేదు. అయినా సరే.. ఇప్పటికీ ఆ పాత మధురాలనే శ్రోతలు ఎంజాయ్ చేస్తున్నారంటే.. కచ్చితంగా అవి గొప్పవే. మ్యూజిక్ డెరైక్షన్ చేసే అవకాశం ఉందా?. మ్యూజిక్ డెరైక్షన్ కష్టమైన పని. మణిశర్మ సార్, తమన్ కష్టపడే తీరు చూస్తున్నాను. అది వేరే ప్రపంచం. ఫలానా వారి మ్యూజిక్ డెరైక్షన్‌లో పాడాలనే కోరిక ఏమైనా మిగిలి ఉందా? ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాడాలనుంది. ఇప్పటి వరకు ఆయనతో పనిచేయలేదు.


