ముంబై జలమయం!
భారీ వర్షాలకు కుదేలైన నగరం
* 24 గంటల్లో 283 మి.మీ. వర్షపాతం నమోదు
* భారీ వర్షంతో తీవ్రంగా ఇబ్బంది పడిన ముంబైకర్లు
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. గురువారం అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం కారణంగా జవజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్‌లపై వర్షపు నీరు చేరడంతో శుక్రవారం ఉదయం 5.30 నుంచే లోకల్ రైళ్లను అధికారులు నిలిపేశారు.
రోడ్లపై నీరు నిలిచిపోవడం, చెట్లు కూలడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బస్సులు, కార్లు రోడ్లపై నిలిచిపోవడం.. లోకల్ రైళ్లు రద్దవ్వడంతో ముంబైకర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుర్లా, ఛంబుర్, తిలక్‌నగర్, అంథేరి, పారెల్, థానే, నవీముంబై, దోంబివిలీ మొదలైన ప్రాంతాలన్నీ నీటమునిగాయి. మురికివాడల్లోని ఇళ్లలోకి, దుకాణాల్లోకి నీరు చేరడంతో నిత్యావసరాలు తడిసి పనికిరాకుండా పోయాయి. షార్ట్ సర్క్యూట్ కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆరు విద్యుత్ సబ్ స్టేషన్లను బీఎంసీ నిలిపేసింది. దూరప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను ముంబై నగరానికి వెలుపలే నిలిపివేశారు. పలు విమాన సర్వీసులను దారిమళ్లించారు.
మూతపడ్డ స్కూళ్లు, ఆఫీసులు..
భారీ వర్షం కారణంగా శివసేన తన వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. బాంబే హైకోర్టుతో పాటు ముంబైలోని అన్ని న్యాయస్థానాలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని కొన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. ముంబై యూనివర్సిటీ ద్వారా శుక్రవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.
అలాగే కార్యాలయాలకు లంచ్ బాక్స్‌లు చేరవేసే డబ్బావాలాలు కూడా సేవలు నిలిపివేసినట్లు శుక్రవారం ఉదయమే ప్రకటించారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ బీఎంసీ కంట్రోల్ రూమ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సీఎం ప్రజలకు సూచించారు. మరోవైపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు మరణించగా.. గోడ, చెట్లు కూలిన ఘటనల్లో పలువురు గాయపడ్డారు. వదాలాలో ఓ ఐదేళ్ల బాలుడు, 60 ఏళ్ల మహిళా విద్యుత్ షాక్‌తో మరణించినట్టు అధికారులు తెలిపారు.
24 గంటల్లో 283 మి.మీ. వర్షపాతం
గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ ముంబైలో 283 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా పది రోజుల్లో కూరిసే ఈ వర్షపాతం 24 గంటల్లోనే కురిసినట్టు తెలిపింది.