దేశ ఆర్థిక రాజధాని ముంబయిని వరదలు ముంచెత్తాయి. గురువారం రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు మహానగరం అస్తవ్యస్తంగా తయారైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ చెప్పలేని తీరుగా స్థంబించిపోయింది. పలు నాలాలు తెరుచుకొని రోడ్లపై వర్షపు నీరు వరదలాగా నదుల్లాగా ఉప్పొంగుతున్నాయి. విద్యుత్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ఇక ప్రముఖ చత్రపతి శివాజీ టెర్మినల్ (సీఎస్టీ), కుర్లా సుబర్బ్లోని మద్య రైల్వేలో సేవలు పూర్తిగా ఆగిపోయాయి. పలు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటమేకాకుండా.. రైళ్లు కూడా రద్దయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వం కూడా వరదలు వస్తున్న కారణంగా పిల్లలను స్కూళ్లకు పంపించొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ శుక్రవారం కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. బృహన్ ముంబాయి మున్సిపల్ కార్పోరేషన్తో(బీఎంసీ)పాటు పలు ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు.