దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. గురువారం అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం కారణంగా జవజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్‌లపై వర్షపు నీరు చేరడంతో శుక్రవారం ఉదయం 5.30 నుంచే లోకల్ రైళ్లను అధికారులు నిలిపేశారు. రోడ్లపై నీరు నిలిచిపోవడం, చెట్లు కూలడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బస్సులు, కార్లు రోడ్లపై నిలిచిపోవడం.. లోకల్ రైళ్లు రద్దవ్వడంతో ముంబైకర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుర్లా, ఛంబుర్, తిలక్‌నగర్, అంథేరి, పారెల్, థానే, నవీముంబై, దోంబివిలీ మొదలైన ప్రాంతాలన్నీ నీటమునిగాయి. మురికివాడల్లోని ఇళ్లలోకి, దుకాణాల్లోకి నీరు చేరడంతో నిత్యావసరాలు తడిసి పనికిరాకుండా పోయాయి. షార్ట్ సర్క్యూట్ కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆరు విద్యుత్ సబ్ స్టేషన్లను బీఎంసీ నిలిపేసింది. దూరప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను ముంబై నగరానికి వెలుపలే నిలిపివేశారు. పలు విమాన సర్వీసులను దారిమళ్లించారు.