breaking news
Mir Hamza
-
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ప్రమాదకర ఘటన
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో భయంకర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ బౌలర్ మిర్ హమ్జా సజ్జాద్ తలకు బంతి బలంగా తగలడంతో ఆసుపత్రిలో చేరాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మార్క్ చాప్మన్ బలంగా కొట్టిన ఓ షాట్ సజ్జాద్ తల వెనుక భాగానికి తగిలింది. దీంతో అతను స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సజ్జాద్ స్పృహలోకి వచ్చి స్థిరంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. గాయ తీవ్రతను అంచనా వేసేందుకు CT స్కాన్ చేయనున్నట్లు వెల్లడించారు. మిర్ హమ్జా సజ్జాద్ విషయానికొస్తే.. ఈ పాకిస్తానీ దేశవాలీ క్రికెటర్ ఇప్పటివరకు 6 టీ20 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు తీశాడు. 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. సజ్జాద్‌ను ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ సీజన్లోనే ఇస్లామాబాద్ యునైటెడ్ 70 లక్షలకు (పాక్ కరెన్సీ) కొనుగోలు చేసింది. సజ్జాద్ ఇంతవరకు పీఎస్ఎల్ అరంగేట్రం చేయలేదు. ఈ గాయం అతని అరంగేట్రాన్ని మరింత ఆలస్యం చేయవచ్చు. కాగా, ప్రస్తుత పీఎస్ఎల్ సీజన్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. ఇటీవల లాహోర్ ఖలందర్స్‌కు చెందిన ఓ బౌలర్ కూడా ఇలాగే గాయపడ్డాడు. తాజాగా సజ్జాద్ గాయం నెట్స్‌లో ప్రాక్టీస్ అంటేనే భయం పుట్టేలా చేస్తుంది. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు భయపడుతున్నారు. లీగ్ నిర్వహకులు నెట్స్‌లో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్ పీఎస్ఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. నిర్వహకులు ఏ విషయంలోనూ ప్రమాణాలు పాటించడం లేదని విదేశీ ఆటగాళ్ల నుంచి ప్రతి రోజు ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ఈ లీగ్ ఇంధన కొరత కారణంగా ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. -
పాక్ పేసర్ల దెబ్బ: కుప్పకూలిన ఆసీస్ టాపార్డర్.. మార్ష్ సెంచరీ మిస్
బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు ఆటలో పాకిస్తాన్ బౌలర్లు విజృంభించారు. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా కలిసి ఆస్ట్రేలియా టాపార్డర్‌ను కుప్పకూల్చారు. అయితే, మిడిలార్డర్లో స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్ అర్ధ శతకాలతో రాణించి ఆసీస్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. కానీ.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో ఆట ముగిసే సరికి 62.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. కాగా మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మంగళవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 318 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా.. పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకే ఆలౌట్ అయింది. 194/6 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన పాక్ మరో 70 పరుగులు మాత్రమే జతచేయగలిగింది. ఈ క్రమంలో 54 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను పాకిస్తాన్ పేసర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను డకౌట్ చేసిన షాహిన్ ఆఫ్రిది.. మార్నస్ లబుషేన్(4) రూపంలో మరో వికెట్ కూల్చాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్(6) వికెట్‌ను మీర్ హంజా తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ట్రవిస్ హెడ్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ ఓపికగా ఆడుతూ పాక్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. మిచెల్ మార్ష్‌తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే బాధ్యత తీసుకున్నాడు. వీరిద్దరు కలిసి 150 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే, హంజా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ బౌల్డ్ కావడంతో ఈ పార్ట్‌నర్‌షిప్‌నకు తెరపడింది. 130 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో అగా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో స్మిత్‌కు తోడైన అలెక్స్ క్యారీ ఆచితూచి ఆడాడు. పరుగులు రాబట్టలేకపోయినా వీరిద్దరు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, మూడో రోజు ఆటలో సరిగ్గా ఆఖరి బంతికి స్మిత్‌ను షాహిన్ ఆఫ్రిది అవుట్ చేశాడు. దీంతో స్మిత్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. దీంతో.. గురువారం 62.3 ఓవర్ వద్ద మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి.. 241 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అలెక్స్ క్యారీ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. Mitch Marsh gone for 96 - to an absolute belter at first slip from Agha Salman! #AUSvPAK pic.twitter.com/KNUP3kDr3j — cricket.com.au (@cricketcomau) December 28, 2023


