పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ప్రమాదకర ఘటన | Scary Scenes In PSL, Islamabad United Pacer Hospitalised After Fatal Blow | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ప్రమాదకర ఘటన

Apr 8 2026 2:48 PM | Updated on Apr 8 2026 2:54 PM

Scary Scenes In PSL, Islamabad United Pacer Hospitalised After Fatal Blow

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026లో భయంకర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ బౌలర్‌ మిర్‌ హమ్జా సజ్జాద్‌ తలకు బంతి బలంగా తగలడంతో ఆసుపత్రిలో చేరాడు. నెట్‌ ప్రాక్టీస్‌ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మార్క్‌ చాప్‌మన్‌ బలంగా కొట్టిన ఓ షాట్‌ సజ్జాద్‌ తల వెనుక భాగానికి తగిలింది. దీంతో అతను స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. 

హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సజ్జాద్‌ స్పృహలోకి వచ్చి స్థిరంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. గాయ తీవ్రతను అంచనా వేసేందుకు CT స్కాన్‌ చేయనున్నట్లు వెల్లడించారు.  

మిర్‌ హమ్జా సజ్జాద్‌ విషయానికొస్తే.. ఈ పాకిస్తానీ దేశవాలీ క్రికెటర్‌ ఇప్పటివరకు 6 టీ20 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు తీశాడు. 8 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. సజ్జాద్‌ను ఈ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ సీజన్‌లోనే ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ 70 లక్షలకు (పాక్‌ కరెన్సీ) కొనుగోలు చేసింది. సజ్జాద్‌ ఇంతవరకు పీఎస్‌ఎల్‌ అరంగేట్రం చేయలేదు. ఈ గాయం అతని అరంగేట్రాన్ని మరింత ఆలస్యం చేయవచ్చు.  

కాగా, ప్రస్తుత పీఎస్‌ఎల్‌ సీజన్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. ఇటీవల లాహోర్‌ ఖలందర్స్‌కు చెందిన ఓ బౌలర్‌ కూడా ఇలాగే గాయపడ్డాడు. తాజాగా సజ్జాద్‌ గాయం నెట్స్‌లో ప్రాక్టీస్‌ అంటేనే భయం పుట్టేలా చేస్తుంది. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసేందుకు భయపడుతున్నారు. లీగ్‌ నిర్వహకులు నెట్స్‌లో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. 

ఈ సీజన్‌ పీఎస్‌ఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. నిర్వహకులు ఏ విషయంలోనూ ప్రమాణాలు పాటించడం లేదని విదేశీ ఆటగాళ్ల నుంచి ప్రతి రోజు ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ఈ లీగ్‌ ఇంధన కొరత కారణంగా ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement