breaking news
middle-class families
-
మిడిల్ క్లాస్ సప్తపది
జీతం చాలా ఎక్కువ. ఖర్చులు అంతకన్నా ఎక్కువ. ఏం లాభం? అందుకే... ఎంత సంపాదించామన్నది కాదు..! ఎంత ఖర్చు పెట్టాం, ఎంత పొదుపు చేశాం? అన్నదే ముఖ్యం. అదే మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలకు ప్రధాన కారణం ఆదాయం తక్కువగా ఉండడం కాదు. కాలం చెల్లిన ‘మనీ’ సూత్రాలను పట్టుకుని వేలాడటమే. ఖర్చులు ఆదాయాన్ని మించకుండా చూసుకుంటే మధ్యతరగతి వారయినా మహారాజుల్లా బతికేయొచ్చు. అందుకోసం ఈ 7 సూత్రాలు పాటించడం మాత్రం తప్పనిసరి. కొత్త సంవత్సరంలోనైనా పాటించాల్సిన ఈ ‘సప్త పది’ గురించి వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ...అత్యవసర నిధి.. అవసరం వచ్చినప్పుడు సాయం కోసం ఒకరి దగ్గర చేయి చాచటమనేది చాలా ఇబ్బందికరం. ఒకప్పుడు మనుషుల మధ్య బంధాలను డబ్బుతో కొలవటమనేది తక్కువ. ఇపుడు ఎవరినైనా అడిగినా... వారు ఎంత దగ్గరివారైనా ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్లకూ ఏవో అవసరాలు ఉండి ఉండొచ్చు. పైపెచ్చు మన అవసరాన్ని వాళ్లు గుర్తించకపోవచ్చు. అందుకని ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం తెలివైన నిర్ణయం. అత్యవసర నిధి అన్నది ఆప్షనల్ కాదు. తప్పనిసరి. రాజీపడకూడనిది. → కరోనా సమయంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. ఆస్పత్రిలో వైద్యం కోసం చాలామంది లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఉద్యోగం, ఉపాధి కోల్పోయిన వారెందరో. కొన్ని సంస్థలు అయితే వేతనాలకు కోత పెట్టాయి. చేస్తున్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని అనిశ్చితి. → వైద్యం కూడా అంతే. ఎప్పుడు ఏ ప్రమాదం, ఏ అనారోగ్యం ముంచుకొస్తుందో ఊహించలేం. → అందుకే కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ప్రతి కుటుంబానికి ఉండాలి. కుదిరితే 9 నెలలు, 12 నెలల అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలి. → ఇలా చేయడం వల్ల దీర్ఘకాల లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులను కదపకుండా ఉండొచ్చు. అధిక రేటుపై రుణాలు తీసుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవచ్చు. ఈఎంఐలు గీత దాటొద్దు.. → అవసరం వస్తే క్రెడిట్ కార్డు చేతిలో ఉందిలే... వెంటనే రుణం దొరుకుతుందిలే. అనే రీతిలో అన్నింటికీ ‘రుణ’ మంత్రం పనికిరాదు. బ్యాంక్‌లు, ఫిన్‌టెక్‌లు పిలిచి రుణం ఇస్తున్నాయి కదా అని చెప్పి.. ఇల్లు, కారు, ఇంట్లో వస్తువులు ఇలా ప్రతిదానికీ అప్పు చేసుకుంటూ వెళితే, ఆర్థిక పరిస్థితులు క్రమంగా అదుపు తప్పుతాయి. నెల సంపాదనలో 50–60 శాతం వరకు రుణ చెల్లింపులకే వెచ్చించే కుటుంబాలు మన మధ్య ఎన్నో ఉన్నాయి. → ఆదాయంలో నెలవారీ రుణ వాయిదాలను (ఈఎంఐలు) 35–40 శాతం మించకుండా చూసుకోవాలన్నది ముఖ్యమైన ఆర్థిక సూత్రం. దీనివల్ల ఇతర ముఖ్యమైన జీవన అవసరాలకు (గ్రోసరీ, యుటిలిటీ, విద్యా వ్యయాలు) ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. → ఆదాయమనేది నేటి అవసరాల కోసమే కాదు. భవిష్యత్ లక్ష్యాలు, విశ్రాంత జీవన అవసరాల కోసం కూడా. దీనికోసం ప్రతినెలా కొంత పక్కన పెట్టుకోవాలి. → పిల్లల విద్య, వివాహాలు, సొంతిల్లు, రిటైర్మెంట్ జీవితం కోసం పెట్టుబడులకు కొంత కేటాయించుకోవాలంటే, ఆదాయంలో ఈఎంఐలు లక్ష్మణ రేఖ దాటకుండా చూసుకోవడం ముఖ్యం. → ఈఎంఐలు హద్దు మీరి చెల్లింపుల్లో విఫలమైతే, అది క్రెడిట్ హిస్టరీని దెబ్బతీస్తుంది. ఆదాయం అప్పులకే పోతుంటే సంపద సృష్టి ఎప్పటికీ సాధ్యం కాదు. ఆదాయాన్ని మించి పెట్టుబడి.. → సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఇపుడు బాగా ప్రాచుర్యం పొందిన పెట్టుబడి సాధనం. ఈ విధానంలో చేస్తున్న పెట్టుబడి, మన వార్షిక ఆదాయ వృద్ధికి మించి పెరిగేలా చూసుకోవాలి. వార్షిక వేతన పెరుగుదల సాధారణంగా 8–10 శాతంగా ఉంటుంది. కానీ, సిప్ పెట్టుబడులపై 12–15 శాతం వరకు రాబడి వచ్చేలా పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. → ద్రవ్యోల్బణం కారణంగా కొంత కాలానికి మన పెట్టుబడి దాని విలువను కోల్పోతుంటుంది. మన దగ్గర వార్షిక సగటు ద్రవ్యోల్బణం 5–6 శాతం స్థాయిలో ఉంటోంది. కనుక ఈ మేరకు మన పెట్టుబడి విలువ ఏటా క్షీణిస్తుంటుంది. → ఇపుడు మన జీవన వ్యయాలు నెలవారీ రూ.10,000గా ఉన్నాయనుకుంటే.. 6 శాతం ద్రవ్యోల్బణం రేటు ప్రకారం పదేళ్ల తర్వాత అవే అవసరాల కోసం రూ.17,908 ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే 20 ఏళ్ల తర్వాత అయితే రూ.32,071 అవసరం అవుతుంది. → ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లకు మించిన కాలంలో 12–15 శాతం రాబడులు సాధ్యమేనని చరిత్ర చెబుతోంది. → ఇక నెలవారీ చేస్తున్న సిప్ పెట్టుబడిని సైతం ఏటా ఆదాయ పెరుగుదలను మించిన స్థాయిలో పెంచుకోవడం ప్రధానం. లేదంటే కనీసం ద్రవ్యోల్బణం రేటు స్థాయిలో అయినా సిప్ పెట్టుబడిని ఏటా పెంచుకుంటూ వెళ్లాలి. → ఇలా సిప్ పెట్టుబడిని పెంచుకుంటూ, ఆ పెట్టుబడి ద్రవ్యోల్బణం మించి వృద్ధి చెందేలా చూసుకుంటే, కాంపౌండింగ్ ప్రయోజనంతో పెద్ద మొత్తంలో నిధి సమకూరుతుంది. ఆరోగ్య బీమా రూ.5 లక్షలు చాలదు.. → మనలో చాలా మందికి ఆరోగ్య బీమా రక్షణ లేదు. ఉన్న వారిలోనూ చాలా మందికి రూ.5 లక్షలకు మించి కవరేజీ లేదు. కానీ, మారుతున్న పరిస్థితుల కోణంలో చూస్తే ఈ రక్షణ ఎంత మాత్రం చాలదని స్పష్టమవుతోంది. → వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 12– 14 శాతం స్థాయిలో ఉంటోంది. అంటే చికిత్సలు, ఔషధాలు, ఇతరత్రా చార్జీలు ఈ స్థాయిలో ఏటా పెరుగుతున్నట్టు లెక్క. → అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్ తరహా టెక్నాలజీలు రావడంతో క్లిష్టమైన సర్జరీలను సైతం సునాయాసయంగా, విజయవంతంగా చేస్తున్నారు. వీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది. అవయవ మార్పిడి కోసం రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చవుతోంది. → కనుక రూ.5 లక్షల కవరేజీ ఎంతమాత్రం సరిపోదు. ఒక కుటుంబానికి కనీసం రూ.10– 20 లక్షల వరకు అయినా బేసిక్ హెల్త్ ప్లాన్ ఉండాలి. రూ.10–20 లక్షల డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. వైద్య బిల్లు రూ.10– 20 లక్షల్లోపు ఉంటే బేసిక్‌ప్లాన్ నుంచి, అంతకు మించిన సందర్భాల్లో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి చెల్లింపులు జరుగుతాయి. రెండు చేతులా సంపాదించాల్సిందే.. → ఒకవైపు కరెన్సీ విలువ క్షీణిస్తుండగా... మరోవైపు జీవన వ్యయాలు భారీగా పెరుగుతున్నాయి. కాబట్టి వీటికి తగ్గట్టు ఆదాయం కూడా వృద్ధి చెందాలి. కానీ మన ఆర్థిక డేటాను పరిశీలిస్తే.. ఆదాయ వృద్ధి కంటే జీవన వ్యయ పెరుగుదలే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే రెండో ఆదాయ మార్గంపై దృష్టి పెట్టాలి. → అద్దె రూపంలో ఆదాయం లేదంటే తమ నైపుణ్యాల ఆధారంగా ఖాళీ సమయంలో ఫ్రీలాన్స్ వర్క్ లేదంటే వడ్డీ ఆదాయం లేదా డివిడెండ్ ఆదాయం ఇలా ఏదో ఒక మార్గం గుర్తించాలి. ఖర్చులపై కన్ను.. టీవీ ఛానళ్ల కోసం ఒకటి, నెట్‌ఫ్లిక్స్–అమెజాన్ ప్రైమ్, ఆహా ఇలా వేర్వేరు ఓటీటీ చందాలు, క్లౌడ్ స్టోరేజీ, లెరి్నంగ్ యాప్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే డిజిటల్ లైఫ్ కోసం ప్రతి కుటుంబంలో నెలతిరిగేసరికి చందా చెల్లింపుల జాబితా పెరిగిపోతోంది. ఒక సర్వే ప్రకారం ఒక కుటుంబం ఈ తరహా రీచార్జ్‌ల కోసం కనీసం రూ.25,000– 40,000 వరకు ఖర్చు చేస్తోంది. కనుక ఏదో ఒక వినోద ఓటీటీ, ఒక లెర్నింగ్ యాప్‌నకు పరిమితమై, అనవసర దుబారాను అదుపు చేసుకోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛకు మార్గం వేసుకోవచ్చు. బంగారం కూడా బీమా లాంటిదే..→ బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా కంటే రక్షణ కవచంగానే (హెడ్జింగ్ సాధనం) ఎక్కువ పరిగణిస్తారు. ఆర్థిక అస్థిరతలప్పుడు, కరెన్సీ విలువ క్షీణించినపుడు, ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడి విలువను కాపాడుకోవడంలో బంగారం కీలకంగా పనిచేస్తుంది. → ఈ ఏడాది బంగారం ధర దేశీ మార్కెట్లో 78 శాతం పెరిగింది. 2020లో రూ.48,000 స్థాయిలో ఉంది. ఐదేళ్లలో రెండు రెట్లు (200 శాతం వృద్ధి) పెరిగింది. గత రెండు దశాబ్దాల్లో చూస్తే బంగారంపై వార్షిక రాబడి 11–12 శాతంగా ఉంది. → భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కంపెనీల లాభదాయకత ఆశాజనకంగా లేకపోవడం, వాణిజ్య అనిశి్చతులతో గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీలు ఎలాంటి రాబడులు ఇవ్వలేదు. ఈ కాలంలో బంగారం విలువను సృష్టించి పెట్టింది. → కనుక పెట్టుబడుల్లో వైవిధ్యానికి, అనిశి్చతులు, కరెన్సీ విలువల నుంచి పెట్టుబడి విలువకు రక్షణ కోసం, అత్యవసరాల్లో రుణం పొందేందుకు సైతం బంగారం అక్కరకు వస్తుంది. → అందుకే ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడుల్లో బంగారానికి 10–15 శాతం కేటాయించుకోవాలి.2026 చెక్ లిస్ట్అత్యవసర నిధి: 6–9 నెలలు ఆదాయంలో ఈఎంఐలు: 35 శాతం మించొద్దు సిప్ పెట్టుబడి: ఏటా పెంచుకుంటూ వెళ్లాలి, ఆదాయాన్ని మించి వృద్ధి చెందాలి హెల్త్ కవరేజీ: కనీసం రూ.10–20 లక్షలకు బీమా ఉండాలి పెట్టుబడుల్లో బంగారానికి కేటాయింపులు: 10–15 శాతం రెండో ఆదాయం తప్పనిసరి డిజిటల్ లైఫ్ ఖర్చును నియంత్రించుకోవాలి -
గుండె నిండా..బడిగంటలు
వారం రోజుల్లో ప్రారంభం కానున్న పాఠశాలలు ఖర్చులపై అయోమయంలో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో ఆకాశాన్నంటుతున్న ఫీజులు ఆందోళనలో పేద, మధ్యతరగతి కుటుంబాలు మంచి యూనిఫాం, టై, షూస్, పుస్తకాల బ్యాగుతో స్కూలుకు వెళ్తున్న ముద్దొచ్చే పిల్లల్ని చూసి మురిసిపోవాలో..? అవన్నీ సమ కూర్చడానికి ఎక్కడ అప్పు చేయాలో..? తెలియక మధ్యతరగతి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. వేసవి సెలవులు ఇచ్చిన ఇన్నాళ్లూ ప్రశాంతంగా నిద్రపోయిన వారి గుండెల్లో ఇప్పుడు గణగణ మంటూ నిద్రలోనూ, మెలకువలోనూ అదే పనిగా స్కూల్ బెల్ మోగు తోంది. దీంతో తల్లిదండ్రులకు జూన్ ఫీవర్ పట్టుకుంది. విజయనగరం అర్బన్: మరో వారం రోజుల్లో విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు ప్రైవేటు పాఠశాలలు ప్రారంభంకానుండగా... 15వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. పిల్లల చదువుల కోసం పెట్టాల్సిన ఖర్చులపై ఇప్పటి నుంచే తల్లిదండ్రులు బెంగపెట్టుకుంటున్నారు. ఇప్పటికే బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె, పాల ధరలు, కరెంటు బిల్లులు, పెట్రోలు, డీజిల్, బస్సు, రైలు చార్జీలు, సినిమా హాల్ టిక్కెట్ల ధరలు కూడా పెరగడంతో మోయలేని ఆర్థిక భారం పడింది. ఖర్చు ఎక్కువ... జీతం తక్కువ..కావడంతో అప్పులతో బతుకుబండి లాగిస్తున్న మధ్యతరగతి కుటుంబీకులకు జూన్ నెల ఆర్థిక పరీక్షగానే మారుతోంది. స్కూల్ ఫీజులు, బ్యాగులు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బస్సు, ఆటో చార్జీల భారం మళ్లీ ఒక్కసారిగా ఆరంభం కావడంతో ఆర్థికంగా ఎలా అధిగమించాలా అనే అంశంపై తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. చుక్కలనంటుతున్న ఫీజులు.. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చుక్కలనంటుతున్నాయి. సౌకర్యాల మాట ఎలా ఉన్నా... ఫీజులు ఏడాదికేడాది కనీసం 10 శాతం పెరుగుతున్నాయి. ఒక్కో పాఠశాలలో సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాల భారం.. పాఠశాలలు ఆరంభం కాగానే మొదటి ప్రాధాన్యం పుస్తకాల కొనుగోలుదే. ఒకటో తరగతి నుంచి 5 వరకు ఇంగ్లిష్ మీడియం ప్రైవేటు పాఠ్యపుస్తకాలు అమలులోకి వస్తాయి. 5వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌తో కలిపి రూ.రెండు వేల నుంచి రూ. 2,500 వరకు ఖర్చవుతాయి. యూనిఫాం... ఒక్కో పాఠశాల ఒక్కో రకమైన యూనిఫాంను రూపొందించాయి. యూనిఫాంల ధరలు రూ. 450 నుంచి రూ. 1000 వరకు ప్యాంటు, షర్టుతో కలిపి ఉన్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు అక్కడే విక్రయిస్తున్నారు. రెడీమేడ్ యూనిఫాంలు కూడా మా ర్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. పెరుగుతున్న బ్యాగుల ధరలు... విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు వాటిని మోసే బ్యాగుల ధరలు కూడా ఏటా పెరుగుతూనే ఉన్నాయి. సంవత్సరంలో రెండు బ్యాగులు తప్పనిసరయ్యాయి. పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో బ్యాగులు వాటిని మోయలేక ఎప్పుడు తెగిపోతాయోమోనన్న పరిస్థితిలో ఉంటాయి. అందుకే ఏటా పాఠశాల ఆరంభంలోనే కొత్త బ్యాగులు కొనడం తప్పనిసరి. ఒక్కో బ్యాగు రూ. 350 నుంచి రూ.700 వరకు ఉంటుంది. వీటితోపాటు కంపాక్స్ బాక్స్. పెన్నులు, పెన్సిల్ తదితర ఖర్చులు ఉండనే ఉన్నాయి. బూట్లు... టై..సైకిల్.. విద్యార్థులు పెరగడం, పాత బూట్లు సరిపోకపోవడం వంటి కారణాల వల్ల తప్పనిసరిగా కొత్తవి కొనుక్కోవాలి. ఒక్కో స్కూల్ యూనిఫాం బూట్లు రూ.450 నుంచి రూ. 600 వరకు ధరపలుకుతున్నాయి. ఆయా పాఠశాలల్లో యాజమాన్యాలే టైలను విక్రయిస్తాయి. ఒక్కోటై రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటుంది. -
రాజీవ్ స్వగృహను అమ్మేశారు..!
నల్లగొండ, న్యూస్‌లైన్, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక స్థోమతకు అనుగుణంగా సకల సౌకర్యాలతో వివిధ మోడళ్లలో ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ.. 2008 ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకేంద్రం శివారు పోలీస్ బెటాలియన్ వద్ద ‘రాజీవ్ స్వగృహ’ పేరుతో స్కీంను ప్రారంభించింది. స్వగృహ ప్రారంభిం చిన నాటినుంచి అనేక సమస్యలు చుట్టుము ట్టాయి.నల్లగొండకు పది కిలోమీటర్ల దూరంలో ఉండడం, నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వంటి అనుమానాలు అప్పట్లో లబ్ధిదారుల్లో తలెత్తాయి. దీంతో లబ్ధిదారుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో పాటు ప్రభుత్వమూ ఇళ్ల నిర్మాణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపలేదు. నీరుగారిన లక్ష్యం... ఇంటి నిర్మాణం, స్థలాన్ని బట్టి ఒక్కో ఇల్లు రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ధర నిర్ణయించారు. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో 317 ఫ్లాట్స్ నిర్మాణం చేపట్టారు. స్వగృహ ప్రారంభ దశలో ఇళ్లు కొనేందుకు 1200 మంది దరఖాస్తు చేశారు. కానీ ఇంటి నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడంతో మరుసటి ఏడాదికి వచ్చేసరికి దర ఖాస్తుదారులు 458 మందికి చేరారు. వీరంతా ఇళ్లు కావాలని కోరుతూ ఒక్కొక్కరు సభ్యత్వం కింద రూ.3 వేలు చెల్లించారు. అప్పటికీ ఇంటి నిర్మాణాలు పూర్తికాకపోవడం, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 155మంది తాము చెల్లించిన సభ్యత్వాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా దరఖాస్తు చేశారు. కానీ ప్రభుత్వం నయాపైసా చెల్లించలేదు. మిగిలిన 304 మంది దరఖాస్తుదారులు ఇంటి నిర్మాణ వ్యయంలో 15నుంచి 25శాతం వరకు ముందుగానే సొమ్ము చెల్లించారు. అధికారుల లెక్కల ప్రకారం దరఖాస్తుదారులకు రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల సొమ్ము తిరిగి చెల్లిస్తామని చెప్పింది కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. పరిస్థితి ఇదీ... ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న సమయంలోనే విద్యుత్, తాగునీటి సరఫరాకు సంబంధించిన వసతులు కల్పించాల్సి ఉంది. ఆ మేరకు రాజీవ్ స్వగృహ వారు రూ.60 లక్షలు ఆయా శాఖలకు చెల్లించారు. కానీ వారు త్వరితగతిన పనులు చేపట్టలేదు. లబ్ధిదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ప్రభుత్వం సొంత నిధులతో నిర్మాణాలు చేపట్టలేకపోయింది. ఆర్థికంగా నష్టాల ఊబిలో కూరుకుపోవడంతో రాజీవ్ స్వగృహ నిర్మాణం చేపట్టిన శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి (ఎస్వీఈసీ) మూడేళ్లకు పైగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా నిలిపేసింది. దీంతో మూడేళ్లనుంచి స్వగృహ ఎస్టేట్‌లో మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. ఇలా అన్ని వైపులనుంచి సమస్యలు చుట్టుముట్టడంతో మరో గత్యం తరం లేక ప్రభుత్వం స్వగృహ ఆస్తులను అమ్మేసింది. చకాచకా నిర్ణయాలు... జిల్లాలో నల్లగొండతో పాటు, మిర్యాలగూడ, భువనగిరి, సూర్యాపేటలో కూడా రాజీవ్ స్వగృహ నిర్మాణాల కోసం భూములు సేకరించారు. అయితే సూర్యాపేటలో మినహా భువనగిరిలో 121 ఎకరాలు, మిర్యాలగూడ 60 ఎకరాల భూములు సేకరించారు. కానీ, సర్వేలు పూర్తికాలేదు. దీంతో రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికారంలోకి వచ్చే కొత్త సర్కారు స్వగృహ ఆస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటోదనన్న ఉద్దేశంతో.. సర్వే చేసిన భూములను వెంటనే రాజీవ్ స్వగృహ మీదకు మార్పిడి చేయమని ఆదేశిస్తూ రెండు రోజుల క్రితం జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. రూ. 12లక్షలు చెల్లించాం : విజయలక్ష్మి, కొనుగోలుదారు స్వగృహలో రెండు ఇళ్ల కోసమని రూ.12 లక్షలు చెల్లించి మూడేళ్లైంది. డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగితే ఇళ్లను రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ అధికారులను సంప్రదిస్తే భూములను అమ్ముతున్నామని, వాటి అమ్మకం పూర్తిగానే డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు చెల్లించలేదు. కొత్త ప్రభుత్వంలో ఇళ్లు కట్టిస్తామని మరోమారు చెప్పారు. డబ్బుల కోసం వెళ్లినప్పుడల్లా ఏదో ఒక సాకుతో చెప్పి పంపిస్తున్నారు.


