breaking news
Mega SBI
-
‘మెగా ఎస్బీఐ’కి లైన్ క్లియర్..!
-
‘మెగా ఎస్బీఐ’కి లైన్ క్లియర్..!
• ఐదు అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర కేబినెట్ ఓకే • భారతీయ మహిళా బ్యాంకుపై వెలువడని నిర్ణయం న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగంలో స్థిరీకరణ దిశగా మరో కీలక అడుగు పడింది. ఐదు అనుబంధ బ్యాంకులను తనలో విలీనం చేసుకునేందుకు ఎస్బీఐకి కేంద్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకు ఎస్బీఐలో విలీనానికి కేంద్ర ప్రభుత్వం గతంలో సూత్రప్రాయ ఆమోదం మాత్రమే తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ తుది అనుమతి మంజూరు చేసింది. అయితే, భారతీయ మహిళా బ్యాంకు విలీనం విషయంలో ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు. ‘‘విలీన ప్రణాళికకు గతంలో కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం మాత్రమే తెలిపింది. ఆ తర్వాత ఎస్బీఐలో విలీనానికి అనుబంధ బ్యాంకుల బోర్డులు ఆమోదముద్ర వేశాయి. బోర్డుల సిఫారసులను పరిశీలించిన అనంతరం విలీన ప్రతిపాదనకు ఆమోదం తెలియజేశాం’’ అని కేబినెట్ భేటీ అనంతరం మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. విలీనం అనంతరం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా అతిపెద్ద బ్యాంకు అవతరిస్తుందన్నారు. విలీనం వల్ల సమర్థత గణనీయంగా పెరుగుతుందని, ఈ బ్యాంకుల మధ్య నిర్వహణ పరమైన వ్యయాలు తగ్గుతాయని జైట్లీ చెప్పారు. విలీనంతో ఏ ఉద్యోగికీ ముప్పు ఏర్పడదని స్పష్టం చేశారు. భారతీయ మహిళా బ్యాంకు విలీనంపై సమావేశంలో నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా, ఎస్బీఐకి లోగడ అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌లను సైతం విలీనం చేసుకున్న అనుభవం ఉంది. రూ.1,000 కోట్లు ఆదా కాగా, విలీనం వల్ల తొలి ఏడాదిలోనే రూ.1,000 కోట్ల మేర ఆదా ఆవుతాయని అధికారిక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. అనుబంధ బ్యాంకుల విలీనానికి అనుమతి ఇచ్చినందున ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల చట్టం–1959, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ చట్టం–1956లను రద్దు చేసేందుకు వీలుగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విలీనం ప్రభుత్వరంగ బ్యాంకుల స్థిరీకరణ ద్వారా బ్యాంకింగ్ రంగం బలోపేతానికి కీలక అడుగుగా పేర్కొంది. విలీనం అయ్యే బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎస్బీఐలో విలీనం అవుతాయి. విలీనం అనంతరం 22,500 శాఖలు, 58,000 ఏటీఎంలు, రూ.37 లక్షల కోట్ల విలువైన ఆస్తులతో ఎస్బీఐ భారీ స్థాయి బ్యాంకుగా మారుతుంది. ఎస్బీఐ బోర్డు గతంలో ఆమోదించిన విలీన ప్రణాళిక ప్రకారం... స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ వాటాదారులు తమ వద్దనున్న ప్రతీ 10 షేర్ల (రూ.10 ముఖ విలువ)కు 28 ఎస్బీఐ షేర్లు (రూ.1 ముఖ విలువ) పొందుతారు. అలాగే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ వాటాదారులు తమ వద్దనున్న ప్రతీ 10 షేర్లకు గాను 22 ఎస్బీఐ షేర్లు పొందుతారు. ఇక, ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రెండింటిలోనూ నూరు శాతం వాటా ఎస్బీఐ చేతుల్లోనే ఉంది. -
'మెగా ఎస్బీఐ' తర్వాతే బ్యాంక్‌ల ఏకీకరణ
* ఆర్థికంగా మెరుగుపడితేనే విలీనాలు * వచ్చే మార్చికల్లా ఎస్బీఐ విలీన ప్రక్రియ పూర్తి న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో అనుబంధ, భారతీయ మహిళ బ్యాంక్‌ల విలీనం పూర్తయిన తర్వాతనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏకీకరణ జరిగే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. బ్యాంక్‌ల ఆర్థిక స్థితిగతులు చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడితేనే విలీనాలు, కొనుగోళ్ల దిశగా యోచించనున్నట్లు ఆయన చెప్పారు. ఎస్బీఐలో అనుబంధ బ్యాంక్ విలీనం పూర్తయిన తర్వాతే తర్వాతి రౌండ్ బ్యాంక్‌ల విలీనం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మొండి బకాయిల భారంతో కుదేలై ఉన్న బ్యాంక్‌లు ఆర్థికంగా పటిష్టమైతేనే ఇతర బ్యాంక్‌లను విలీనం చేసుకోగలవని వివరించారు. వచ్చే ఏడాది మార్చికల్లా బ్యాంక్‌ల బ్యాలెన్స్ షీట్ ప్రక్షాళన పూర్తవుతుందన్న అంచనాలున్నాయని, ఆ తర్వాతనే బ్యాంక్‌ల పనితీరు మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఎస్బీఐలో బ్యాంక్‌ల విలీనం పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఐదు అనుబంధ బ్యాంక్‌లతోపాటు భారతీయ మహిళ బ్యాంక్, ఎస్బీఐలో విలీనం కావడానికి గత వారమే కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది.