breaking news
lower cenal
-
జల చౌర్యం అరికట్టే బాధ్యత ప్రత్యేక బృందాలదే
కర్నూలు సిటీ: తుంగభద్ర దిగువ కాలువ నీరు చౌర్యం కాకుండా అరికట్టే బాధ్యత ప్రత్యేక బృందాలదేనని జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ చంద్రశేఖర్ రావు చెప్పారు. శనివారం జల మండలిలోని ఎస్ఈ చాంబర్లో ఎల్ఎల్సీ అధికారులు, ప్రత్యేక బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ దిగువ కాలువ నీటిని 135 నుంచి 250 కి.మీ మధ్యలో అధికంగా చౌర్యం చేస్తున్నారని చెప్పారు. దీన్ని పూర్తి స్థాయిలో అరికడితేనే చివరి ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. ప్రత్యేక బృందాలు కాల్వపై ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డీఈఈ నెహిమియాకు ఆదేశించారు. సమావేశంలో ఈఈ భాస్కర్‌రెడ్డి, డీఈఈలు తదితరులు పాల్గొన్నారు. -
తుంగభద్ర దిగువ కాల్వకు గండి
– కాల్వకు నీటిసరఫరా నిలిపివేత – మరమ్మతులకు చర్యలు సాక్షి, బళ్లారి : తుంగభద్ర జలాశయం నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు తాగు, సాగు నీటినందించే తుంగభద్ర దిగువ కాల్వకు శనివారం గండి పడింది. బళ్లారి జిల్లా కంప్లి నియోజకవర్గ పరిధిలోని గుండ్లుకెరి సమీపంలో బుక్కసాగరకు ఆనుకుని కాలువకు గండి పడింది. నీరంతా బయటకు పారుతుండడంతో ఆ ప్రాంతవాసులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు తుంగభద్ర బోర్డు సెక్రటరీ రంగారెడ్డి, సంబంధిత అధికారులు గండి ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. కాలువకు మూడు రోజుల క్రితం నీటిని విడుదల చేశారు. ఈ నీరు ఆంధ్రా సరిహద్దు కాదు కదా కర్ణాటక పరిధిలోని బళ్లారి జిల్లాకు కూడా పూర్తిగా చేర కుండా గండిపడింది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాల్వకు నీటి సరఫరాను నిలిపివేశారు. పనులు పూర్తయిన వెంటనే తిరిగి కాలువకు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.