breaking news
look out circular
-
సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఎల్ఓసీ రద్దు చేయండి
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డిపై జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ)ను రద్దు చేయాలని హైకోర్టు శుక్రవారం ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ నుంచి సమాచారం అందిన వెంటనే ఎల్ఓసీ రద్దు చేయాలని స్పష్టం చేసింది. విదేశాలకు ప్రయాణించే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 21 కింద జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో అంతర్భాగమని స్పష్టం చేసింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న, అనిశ్చితంగా ఉన్న కేసుల దర్యాప్తు పేరుతో భార్గవ్‌రెడ్డి హక్కులను హరించడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం తీర్పు వెలువరించారు. సీఐడీ అదనపు డీజీ, పలు జిల్లాల ఎస్పీల ప్రోద్బలంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు జారీ చేసిన ఎల్ఓసీని చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ భార్గవ్‌రెడ్డి గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పుఇచ్చారు. దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి భార్గవ్‌రెడ్డి ప్రయత్నించలేదు ‘సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ సెక్షన్ 35(3) నోటీసులిచ్చి, చట్ట ప్రకారం నడుచుకోవాలని 2025 మే 7న హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు ఈ రోజు వరకు భార్గవ్‌రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు. రికార్డులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే పిటిషనర్ భార్గవ్‌రెడ్డి దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి గానీ, కోర్టు పరిధి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేసినట్లు కనిపించడం లేదు. అందువల్ల, భార్గవ్‌రెడ్డి చట్టపరమైన ప్రక్రియల్లో పాల్గొనలేదని, దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసులు వాదించడం సమంజసం కాదు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు భార్గవ్‌రెడ్డికి సెక్షన్ 35 (3) కింద నోటీసులు అందచేయాలి. దర్యాప్తునకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని పేర్కొంటూ భార్గవ్‌రెడ్డి డీజీపీ, అన్నమయ్య జిల్లా ఎస్పీ ముందు అఫిడవిట్లు దాఖలు చేయాలి. అనంతరం భార్గవ్‌రెడ్డిపై జారీ చేసిన ఎల్ఓసీ ఉపసంహరణకు జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలి.’ అని హైకోర్టు ఆదేశించింది. ఇతరుల ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదుభారత రాజ్యాంగంలోని అధికరణ 19(1) కింద ఉన్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదు. ఇది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. గౌరవం, నైతికత, పరువు నష్టం, నేర ప్రేరేపణ వంటి అంశాల ఆధారంగా పరిమితులు ఉంటాయి. సోషల్ మీడియాలో తప్పుడు, అసభ్య కంటెంట్ వ్యక్తులకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ విధమైన కంటెంట్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు లేదా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నప్పుడు, అది వారి ప్రతిష్టను దెబ్బతీస్తుంది, గోప్యతకు భంగం కలిగిస్తుంది. భావోద్వేగ పరమైన బాధను కలిగిస్తుంది. ఇతరుల ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా వ్యక్తి ఏ విషయంపైనైనా, ప్రభుత్వ విధానాలపైనైనా తన అభిప్రాయాన్ని, అసమ్మతిని వ్యక్తం చేయవచ్చు. అయితే, ఆ అభిప్రాయం మర్యాదపూర్వకంగా వ్యక్తం చేయాలి. దర్యాప్తు సంస్థలు చట్టపరమైన విధి విధానాలను కచ్చితంగా అనుసరిస్తూ, సమగ్రంగా, వేగంగా దర్యాప్తు జరపాలి. సేకరించిన సాక్ష్యాల ఆధారంగా నేరస్థులపై అభియోగాలు నమోదు చేసి చట్టం నిర్దేశించిన గడువులోపు చార్జ్‌షీట్ దాఖలు చేసి వారిని కోర్టు ముందు హాజరుపరచాలి. సోషల్ మీడియాలో తప్పుడు, అసభ్య పోస్టులు పెట్టే వారు ఎవరైనా సరే లేదా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టం అందరికంటే గొప్పది.. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న స్పష్టమైన సందేశాన్ని పంపాలి. – సోషల్ మీడియాలో పోస్ట్‌లపై హైకోర్టు -
‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ప్రధానిపై మనీశ్ సిసోడియా విమర్శలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై దర్యాప్తు జరుగుతున్న వేళ విదేశీ ప్రయాణాలు చేపట్టకుండా లుక్ఔట్ నోటీసులు జారీ చేయటాన్ని తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ‘ మీరు చేయించిన దాడులు పూర్తిగా విఫలమయ్యాయి. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇప్పుడు నాకు మీరు లుక్ఔట్ నోటీసులు ఇచ్చారు. ఈ జిమ్మిక్కులు ఏమిటి మోదీ జీ? నేను ఢిల్లీలోనే ఉన్నాను. నేను ఎక్కడికి రావాలో దయచేసి చెప్పండి.’ అని పేర్కొన్నారు సిసోడియా. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీలు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు సిసోడియా. విద్యా, ఆరోగ్య రంగంలో మంచి పనితీరు కనబరుస్తూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న ఆమ్ ఆద్మీ పార్టీపై ఏజెన్సీలను ఉపయోగించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేశారన్నారు. రానున్న 2024 సాదారణ ఎన్నికల్లో భాజపాకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థిగా మారుతున్నారనే కారణంగా ఆయనని అడ్డుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. విదేశాలకు వెళ్లకుండా మనీశ్ సిసోడియాకు లుక్ఔట్ సర్క్యూలర్ జారీ చేసినట్లు వస్తున్న వార్తలను సీబీఐ వర్గాలు ఖండించాయి. ఇదీ చదవండి: లిక్కర్ కుంభకోణంలో అసలు సూత్రధారి కేజ్రీవాల్: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ధ్వజం -
‘రేపిస్టు’ మంత్రిపై నాన్‌బెయిలబుల్ వారెంట్
లక్నో: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ వివాదాస్పద మంత్రి గాయత్రి ప్రజాపతి, మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు జారీచేసింది. ఆయన పాస్ పోర్టును నాలుగు వారాలపాటు ఆయన పాస్‌పోర్టుపై నాలుగువారాలపాటు నిషేధం విధించింది. మరోపక్క, అజ్ఞాతంలో వెళ్లిన ఆయనకోసం లుక్ ఔట్ నోటీసులు వేయాలని కూడా సర్క్యులర్ విడుదల చేశారు. తనపై, తన మైనర్ కూతురుపై ప్రజాపతి ఆయన సమూహం లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కూతురు ఆస్పత్రిలో కోలుకుంటోంది. తొలుత ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసులు పెట్టేందుకు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ కేసులో కదలిక ఏర్పడింది. సుప్రీం చెప్పిన అనంతరం కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమేథిలోని మంత్రి ఇంట్లో సోదాలు చేశారు. ఆయన అంతకుముందే లక్నో వెళ్లినట్టు తెలుసుకున్న పోలీసులు లక్నోలోని మంత్రి బంగ్లాకు వెళ్లగా అక్కడ కూడా ఆయన లేరు. మంత్రి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు లక్నో ఎస్పీ చెప్పారు. ఆయనను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఇప్పటికీ ఆయన జాడ తెలియకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రజాపతిని మంత్రివర్గం నుంచి తొలగించారు. ములాయం విధేయుడైన ప్రజాపతిని ఆయన సూచన మేరకు అఖిలేష్ మళ్లీ కేబినెట్లో చేర్చుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపతి ఎస్పీ తరఫున అమేథి నుంచి పోటీ చేస్తున్నారు. అఖిలేష్ ఇటీవల అమేథికి ప్రచారానికి వెళ్లినపుడు ప్రజాపతిని వేదికపైకి అనుమతించలేదు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాపతిని అఖిలేష్ మంత్రివర్గంలో కొనసాగించడంపై ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.


