సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఎల్‌ఓసీ రద్దు చేయండి | Cancel the LoC against Sajjala Bhargav Reddy says high court | Sakshi
Sakshi News home page

సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఎల్‌ఓసీ రద్దు చేయండి

Apr 18 2026 5:22 AM | Updated on Apr 18 2026 5:22 AM

Cancel the LoC against Sajjala Bhargav Reddy says high court

ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు హైకోర్టు ఆదేశం 

విదేశాలకు ప్రయాణించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగం 

సుదీర్ఘ, అనిశ్చిత దర్యాప్తు పేరుతో హక్కులు హరించలేరు 

భార్గవ్‌రెడ్డికి సెక్షన్‌ 35 (3) నోటీసు ఇవ్వాలని 2025లోనే కోర్టు ఆదేశించింది 

ఈ రోజు వరకు పోలీసులు ఆయనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు.. నోటీసు ఇవ్వకుండా భార్గవ్‌రెడ్డి దర్యాప్తునకు 
సహకరించలేదని ఎలా అంటారు? 

పోలీసుల తీరును ఆక్షేపించిన జడ్జి జస్టిస్‌ బట్టు దేవానంద్‌

సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా పూర్వ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డిపై జారీ చేసిన లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ)ను రద్దు చేయాలని హైకోర్టు శుక్రవారం ఇమ్మిగ్రేషన్‌ అధికారులను ఆదేశించింది. అన్నమయ్య జిల్లా ఎస్‌పీ నుంచి సమాచారం అందిన వెంటనే ఎల్‌ఓసీ రద్దు చేయాలని స్పష్టం చేసింది. విదేశాలకు ప్రయాణించే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 21 కింద జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో అంతర్భాగమని స్పష్టం చేసింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న, అనిశ్చితంగా ఉన్న కేసుల దర్యాప్తు పేరుతో భార్గవ్‌రెడ్డి హక్కులను హరించడం సమంజసం కాదని స్పష్టం చేసింది.  

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు.  సీఐడీ అదనపు డీజీ, పలు జిల్లాల ఎస్‌పీల ప్రోద్బలంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు జారీ చేసిన ఎల్‌ఓసీని చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ  భార్గవ్‌రెడ్డి గత నెలలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పుఇచ్చారు. 

దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి భార్గవ్‌రెడ్డి ప్రయత్నించలేదు 
‘సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సెక్షన్‌ 35(3) నోటీసులిచ్చి, చట్ట ప్రకారం నడుచుకోవాలని 2025 మే 7న హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు ఈ రోజు వరకు భార్గవ్‌రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు. రికార్డులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే పిటిషనర్‌ భార్గవ్‌రెడ్డి దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి గానీ, కోర్టు పరిధి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేసినట్లు కనిపించడం లేదు. అందువల్ల, భార్గవ్‌రెడ్డి చట్టపరమైన ప్రక్రియల్లో పాల్గొనలేదని, దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసులు వాదించడం సమంజసం కాదు. 

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు భార్గవ్‌రెడ్డికి సెక్షన్‌ 35 (3) కింద నోటీసులు అందచేయాలి. దర్యాప్తునకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని పేర్కొంటూ భార్గవ్‌రెడ్డి డీజీపీ, అన్నమయ్య జిల్లా ఎస్‌పీ ముందు అఫిడవిట్లు దాఖలు చేయాలి. అనంతరం భార్గవ్‌రెడ్డిపై జారీ చేసిన ఎల్‌ఓసీ ఉపసంహరణకు జిల్లా ఎస్‌పీ చర్యలు తీసుకోవాలి.’ అని హైకోర్టు ఆదేశించింది.  

ఇతరుల ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు
భారత రాజ్యాంగంలోని అధికరణ  19(1) కింద ఉన్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదు. ఇది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. గౌరవం, నైతికత, పరువు నష్టం, నేర ప్రేరేపణ వంటి అంశాల ఆధారంగా పరిమితులు ఉంటాయి. సోషల్‌ మీడియాలో తప్పుడు, అసభ్య కంటెంట్‌ వ్యక్తులకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ విధమైన కంటెంట్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు లేదా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నప్పుడు, అది వారి ప్రతిష్టను దెబ్బతీస్తుంది, గోప్యతకు భంగం కలిగిస్తుంది. భావోద్వేగ పరమైన బాధను కలిగిస్తుంది. 

ఇతరుల ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా వ్యక్తి ఏ విషయంపైనైనా, ప్రభుత్వ విధానాలపైనైనా తన అభిప్రాయాన్ని, అసమ్మతిని వ్యక్తం చేయవచ్చు. అయితే, ఆ అభిప్రాయం మర్యాదపూర్వకంగా వ్యక్తం చేయాలి. దర్యాప్తు సంస్థలు చట్టపరమైన విధి విధానాలను కచ్చితంగా అనుసరిస్తూ, సమగ్రంగా, వేగంగా దర్యాప్తు జరపాలి. సేకరించిన సాక్ష్యాల ఆధారంగా నేరస్థులపై అభియోగాలు నమోదు చేసి చట్టం నిర్దేశించిన గడువులోపు చార్జ్‌షీట్‌ దాఖలు చేసి వారిని కోర్టు ముందు హాజరుపరచాలి. 

సోషల్‌ మీడియాలో తప్పుడు, అసభ్య పోస్టులు పెట్టే వారు ఎవరైనా సరే లేదా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టం అందరికంటే గొప్పది.. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న స్పష్టమైన సందేశాన్ని పంపాలి.   – సోషల్‌ మీడియాలో పోస్ట్‌లపై హైకోర్టు  

Advertisement
 
Advertisement
Advertisement