breaking news
Longest journey
-
ప్రభుత్వాధినేతగా 8,931 రోజులు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆదివారం మరో అరుదైన మైలురాయికి చేరుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడిగా రికార్డుకెక్కారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా నిరాటంకంగా 8,931 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఈ విషయంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ తిరగరాశారు. చామ్లింగ్ సీఎంగా 8,930 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఆదివారంతో మోదీ 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. కేంద్ర మంత్రుల అభినందనలు ప్రభుత్వాధినేతగా 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న కేంద్ర మంత్రులు తదితరులు అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రధాని గత 24 ఏళ్లకుపైగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం, ప్రజల కోసం పని చేస్తున్నారు. ఇది ఆయన అంకితభావానికి నిదర్శనం. ‘మోదీ యుగం’ దేశ రూపురేఖలనే మార్చివేసింది. ఈ 8,931 రోజుల ప్రస్థానం దేశం పట్ల ఆయన నిబద్ధత, ప్రతి పౌరుడి పట్ల ఆయన చూపే అసమాన సేవానిరతికి ప్రతీక’’ అని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, కిరణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు కూడా మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశంపట్ల, ప్రజల పట్ల ఉన్న అచంచలమైన అంకితభావం కలిగిన గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. ‘‘మోదీ జీవితమంతా నిరంతర సేవా ప్రయాణం. ప్రధానిగా ఆయన సేవా దృక్పథం దేశాన్ని మరింత బలోపేతం చేస్తూనే ఉంది. మోదీ నాయకత్వంలో పేదలు, యువత, రైతులు, అన్నదాతల సాధికారతకు పెద్దపీట వేస్తూ దేశం ‘వికసిత్ భారత్’ దిశగా సాగుతోంది’’ అన్నారు.ఎన్నెన్ని రికార్డులో! → మోదీ తొలిసారి 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ప్రధానిగా ఎన్నికయ్యే దాకా సీఎంగా కొనసాగారు. గుజరాత్‌కు ఎక్కువ కాలం సీఎంగా చేసిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. 2001 అక్టోబర్ 7 నుంచి 2014 మే 21 దాకా 13 ఏళ్లకు పైగా సీఎంగా సేవలందించారు. 2001, 2002, 2007, 2012ల్లో నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసి, ప్రధానమంత్రిగా ఎన్ని కైన అరుదైన నాయకుడు కూడా మోదీయే. → స్వతంత్ర భారతదేశంలో జని్మంచిన తొలి ప్రధానిగా మోదీ మరో రికార్డు నెలకొల్పారు. మోదీకి ముందు ప్రధానులుగా చేసిన వారంతా స్వాతంత్య్రానికి ముందు పుట్టిన వారే. → ప్రధానిగా రెండు పర్యాయాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏకైక కాంగ్రెసేతర నేత మోదీ. ప్రస్తుతం వరుసగా మూడో టర్మ్‌లో పదవిలో కొనసాగుతున్నారు. → వరుసగా 3 సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా మోదీ మరో ఘనత సాధించారు. ఆయన సారథ్యంలో 2014, 2019, 2024ల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. → వరుసగా ఎక్కువకాలం పదవిలో రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డును మోదీ గతేడాది బద్ధలు కొట్టారు. ఇందిర 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 దాకా 4,077 రోజులపాటు వరుసగా పదవిలో ఉన్నారు. మోదీ 2025 జూలై 25న ఆ రికార్డును దాటేశారు. → అత్యధిక కాలం ప్రధానిగా చేసిన రికార్డు నెహ్రూదే. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27న మరణించేదాకా 16 ఏళ్ల 286 రోజులపాటు పదవిలో ఉన్నారు. మోదీ నాలుగోసారి ప్రధానిగా ఎన్నికైతే ఆ రికార్డును తిరగరాసే అవకాశముంది. → నెహ్రూ మూడు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించారు. ఈ రికార్డును మోదీ ఇప్పటికే సమం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపిస్తే ఆ రికార్డునూ అధిగమిస్తారు. → ఆరు వరుస ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నాయకుడు కూడా మోదీయే. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ పక్షనేతగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 2014, 2019, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి బీజేపీపక్ష నేతగా, ప్రధానిగా ఎన్నికయ్యారు. -
తెలుగు కుర్రాడి ఘనత
సాక్షి, న్యూఢిల్లీ: పాతికేళ్లు కూడా నిండని ఓ కుర్రాడు మోటారు సైకిల్‌పై మొత్తం భారతదేశాన్ని చుట్టి వచ్చాడు. ఏడు నెలల పాటు నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉత్తరాన లడఖ్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు పశ్చిమాన రన్ ఆఫ్ కచ్ నుంచి ఈశాన్యాన చిరపుంజి వరకు ప్రయాణించాడు. ఈ ఘనత సాధించిన ఢిల్లీ కుర్రాడు తెలుగువాడు కావడం మరో విశేషం. క్రిషాను తండ్రి కోన మధుసూధనరావు లోక్‌సభ సెక్రటేరియట్లో జాయింట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎన్నో అడ్డంకులెదురైనప్పటికీ 50,338 కిమీలు ఒంటరిగా మోటారు సైకిలుపై దిగ్విజయంగా యాత్ర ముగించిన క్రిషాను శనివారం విలేకరులతో తన ప్రయాణానుభవాలను పంచుకున్నాడు. గతేడాది ఆగస్టు 30న ఢిల్లీ నుంచి బయలుదేరిన క్రిషాను ఈ నెల 9న ఢిల్లీలోని తన ఇంటికి తిరిగివచ్చాడు. యాత్ర పొడవునా తనకు దేశ ప్రజల నుంచి అద్భుతమైన ఆతిథ్యం లభించిందని, భారతదేశ వైవిధ్యం తానూహించని రీతిలో అబ్బురపరిచిందని క్రిషాను చెప్పాడు. లో-బడ్జెట్ హోటళ్లలో, హాస్టళ్లలో తలదాచుకుంటూ, రోడ్డు పక్కన దాబాల్లో తింటూ ప్రయాణించినట్లు తెలిపాడు. వీలున్నచోట్ల బంధుమిత్రుల ఇళ్లలో ఆతిథ్యం స్వీకరించినప్పటికీ కొన్ని రాత్రులు గురుద్వారాలలో, కొన్ని సార్లు పూర్తిగా అపరిచితుల ఇళ్లలో గడిపానని అతను చెప్పాడు. తండ్రితో కలసి ఏపీ, తెలంగాణ కొడుకుతో కలిసి మధుసూదనరావు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోటారుసైకిల్‌పై ప్రయాణించాడు. తన కొడుకు ఏడు నెలల కిందట ఇంటి నుంచి వెళ్లినప్పటితో పోలిస్తే క్రిషాను మానసికంగా చాలా ఎదిగాడని మధుసూదనరావు తెలిపారు.


