తెలుగు కుర్రాడి ఘనత | Krishanu Kona to break Guinness “Longest journey by motorcycle in a single country” | Sakshi
Sakshi News home page

తెలుగు కుర్రాడి ఘనత

Apr 24 2016 1:38 PM | Updated on Sep 3 2017 10:39 PM

తెలుగు కుర్రాడి ఘనత

తెలుగు కుర్రాడి ఘనత

పాతికేళ్లు కూడా నిండని ఓ కుర్రాడు మోటారు సైకిల్‌పై మొత్తం భారతదేశాన్ని చుట్టి వచ్చాడు.

సాక్షి, న్యూఢిల్లీ: పాతికేళ్లు కూడా నిండని ఓ కుర్రాడు మోటారు సైకిల్‌పై మొత్తం భారతదేశాన్ని చుట్టి వచ్చాడు. ఏడు నెలల పాటు నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉత్తరాన లడఖ్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు పశ్చిమాన రన్ ఆఫ్ కచ్ నుంచి ఈశాన్యాన చిరపుంజి వరకు ప్రయాణించాడు. ఈ ఘనత సాధించిన ఢిల్లీ కుర్రాడు తెలుగువాడు కావడం మరో విశేషం.

క్రిషాను తండ్రి కోన మధుసూధనరావు లోక్‌సభ సెక్రటేరియట్‌లో జాయింట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎన్నో అడ్డంకులెదురైనప్పటికీ 50,338 కిమీలు ఒంటరిగా మోటారు సైకిలుపై దిగ్విజయంగా యాత్ర ముగించిన క్రిషాను శనివారం విలేకరులతో తన ప్రయాణానుభవాలను పంచుకున్నాడు. గతేడాది ఆగస్టు 30న ఢిల్లీ నుంచి బయలుదేరిన క్రిషాను ఈ నెల 9న ఢిల్లీలోని తన ఇంటికి తిరిగివచ్చాడు.

యాత్ర పొడవునా తనకు దేశ ప్రజల నుంచి అద్భుతమైన ఆతిథ్యం లభించిందని, భారతదేశ వైవిధ్యం తానూహించని రీతిలో అబ్బురపరిచిందని క్రిషాను చెప్పాడు. లో-బడ్జెట్ హోటళ్లలో, హాస్టళ్లలో తలదాచుకుంటూ, రోడ్డు పక్కన దాబాల్లో తింటూ ప్రయాణించినట్లు తెలిపాడు. వీలున్నచోట్ల బంధుమిత్రుల ఇళ్లలో ఆతిథ్యం స్వీకరించినప్పటికీ కొన్ని రాత్రులు గురుద్వారాలలో, కొన్ని సార్లు పూర్తిగా అపరిచితుల ఇళ్లలో గడిపానని అతను చెప్పాడు.
 
తండ్రితో కలసి ఏపీ, తెలంగాణ
కొడుకుతో కలిసి మధుసూదనరావు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోటారుసైకిల్‌పై ప్రయాణించాడు. తన కొడుకు ఏడు నెలల కిందట ఇంటి నుంచి వెళ్లినప్పటితో పోలిస్తే క్రిషాను మానసికంగా చాలా ఎదిగాడని మధుసూదనరావు తెలిపారు.

Advertisement
Advertisement