breaking news
Lokendra Singh Kalvi
-
హెచ్చరికల నేపథ్యంలో స్పందించిన ‘సుప్రీం’
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ చిత్రం విడుదలైతే థియేటర్లను తగలబెడతామంటూ రాజ్‌పుత్ కర్ణిసేన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందించింది. థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయించాలని అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘‘దేశంలో స్వేచ్ఛా హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. సినిమాను అడ్డుకుంటామని.. థియేటర్లు ధ్వంసం చేస్తామని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. కాబట్టి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిందే’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఒకవేళ చిత్ర యూనిట్ సభ్యులు కోరితే... వారికి కూడా వ్యక్తిగతంగా భద్రత కల్పించాలని న్యాయమూర్తి పోలీసులకు సూచించారు. కాగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చిత్రంపై నిషేధం విధించగా.. నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించటం.. చిత్ర విడుదలను అడ్డుకోవద్దంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది తెలిసిందే. బండిట్ క్వీన్ చిత్ర విషయంలోనే అభ్యంతరం వ్యక్తం కానప్పుడు.. పద్మావత్ విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయినప్పటికీ చిత్రం విడుదలైతే రాజ్‌పుత్ మహిళలంతా సాముహిక ఆత్మహత్యలకు పాల్పడతారని కర్ణిసేన హెచ్చరిస్తోంది. అనధికార నిషేధం...? కర్ణిసేన హెచ్చరికల నేపథ్యంలో... సుప్రీం కోర్టు ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అనధికారిక బ్యాన్ విధించే దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాల సంగతి పక్కన పెట్టి.. స్థానిక చట్టాల చొరవతో రాష్ట్రాలు నిషేధాన్ని కొనసాగించాల్సిందేనని కర్ణిసేన అధినేత లోకేంద్ర సింగ్ కల్వి కోరుతున్నారు. గతంలో రాజస్థాన్ లో జోధా అక్బర్ చిత్రాన్ని థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు స్వచ్ఛందంగా బహిష్కరించిన విషయాన్ని, మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫనా చిత్రాన్ని గుజరాత్లో నిషేధించిన(అనధికారికంగా) విషయాన్ని లోకేంద్ర గుర్తు చేస్తున్నారు. -
‘ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే’
-
‘ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే’
జైపూర్: ‘పద్మావతి’ సినిమా షూటింగ్ సెట్స్‌లో రాజ్‌పుత్ కర్ణి సేన కార్యకర్తల వీరంగం, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై దాడి ఘటన అటు సినీ రంగంతోపాటు ఇటు రాజకీయ రంగంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం ‘పద్మావతి’ యూనిట్‌పై జరిగిన దాడిని బాలీవుడ్ నిర్మాతల సంఘం ఖండించగా, రాజ్‌పుత్ సేన మాత్రం సంజయ్ లీలాపై ఎదురుదాడిని కొనసాగించింది. ‘ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే’అని ఆరోపించింది. రాజ్‌పుత్ కర్ణి సేన వ్యవస్థాపకుడు లోకేంద్ర సింగ్ కల్వీ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. తమ పూర్వీకుల చరిత్రను వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ‘సంజయ్‌లీలాకు ఎంత దమ్ముంటే మా సొంత గడ్డమీద, మా పూర్వీకులకు సంబంధించిన చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీస్తాడు? జర్మనీలో హిట్లర్‌కు వ్యతిరేకంగా సినిమా తీసే దమ్ముందా ఈయనకి? ‘పద్మావతి’ సినిమాలో రాజ్పుట్ల వంశానికి చెందిన రాణి పద్మినిని అగౌరవపరిచేలా చిత్రీకరిస్తున్నారు. ఒక్క పద్మావతేకాదు.. ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే. గతంలో ‘జోధా అగ్బర్’లోనూ జోధాబాయి చరిత్రను తప్పుగా చూపించారు. అందుకే ఆయనకు బుద్ధిచెప్పాలనుకున్నా. చెప్పాం..’ అని లోకేంద్ర సింగ్ కల్వీ వివరించారు. భన్సాలీకి బాలీవుడ్ బాసట: పద్మావతి షూటింగ్ సెట్లో దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని చెంపదెబ్బకొట్టి, జుట్టుపట్టి ఈడ్చిన ఘటనపై బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్ట్ అధ్యక్షుడు విక్రం భట్ స్పందించారు. ‘క్రియేటివ్ కళాకారుల జీవితాలు గాజు మేడల్లా తయారయ్యాయని ఆయన ఆదేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ మొత్తం సంజయ్‌లీలాకు బాసటగా నిలుస్తుందని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు (షూటింగ్‌లపై దాడులు) జరగకుండా ఉండటానికి ఏం చేస్తే బాగుంటుందో అర్థం కావడంలేదని భట్ అన్నారు. (షూటింగ్లో ప్రముఖ దర్శకుడిపై దాడి) హోం మంత్రి ఏమన్నారంటే: ‘పద్మావతి’ యూనిట్‌పై రాజ్‌పుత్ కర్ణి సేన దాడిపై రాజస్థాన్ హోం మంత్రి జి.సి.కటారియా స్పందించారు. మనోభావాలు దెబ్బతిన్న సందర్భంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, అయితే చట్టాన్ని ఉల్లంఘించేలా ప్రవర్తించడం గర్హనీయమని మంత్రి అన్నారు. దాడి ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలాఉంటే, నిన్నటి దాడి అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురు శనివారం ఉదయం విడుదలయ్యారు. వర్మ కామెంట్: ‘పద్మావతి’పై దాడి విషయంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ భిన్నంగా స్పందించారు. నిన్నటి ఘటనతో పద్మావతి, ఖిల్జీ, రాజ్‌పుత్ కర్ణి సేనల గురించి దేశం మొత్తానికి తెలిసిందని, ఇందుకుగానూ సంజయ్ లీలా భన్సాలీకి థ్యాక్స్ చెబుతున్నానని ట్వీట్ చేశారు.