breaking news
Lip plates
-
అందం సరే.. ముద్దులు ఎలా?
ముద్దు లేదా చుంబనం, ఆంగ్లంలో కిస్.. ప్రేమను వ్యక్తం చేసే ఒకానొక పద్ధతి. ఈ ప్రక్రియలో ప్రధాన పాత్రను పోషించేవి పెదవులు లేదా అధరములు. ప్రేమను వ్యక్తంచేసే ఓ తల్లి తన బిడ్డ నుదుటిపై ఆప్యాయంగా ముద్దుపెడుతుంది. కొన్ని దేశాల్లో స్వాగతం, వీడ్కోలు పలికేటప్పుడు ముద్దులు పెట్టుకోవడం సంస్కృతిలో భాగం. హ్యూమన్ ఎమోషన్స్ లో ఇంత ప్రాముఖ్యమున్న ముద్దుల ప్రక్రియకు దూరంగా ఉంటూకూడా ఆప్యాయతను పంచడం ఎలాగో ఈ ఇథియోపియన్ గిరిజన మహిళలను చూసి నేర్చుకోవాల్సిందే. అరుదైన ముర్సి తెగకు చెందిన కొన్ని కుటుంబాలు ప్రఖ్యాత మాంగో నేషనల్ పార్క్ లో జీవనం సాగిస్తున్నాయి. (వాళ్లు పార్క్ లో ఉండటంకాదు, వాళ్లు ఉంటోన్న ప్రదేశాన్నే పార్క్ గా మార్చారు). ఆ తెగ మహిళలు తమ పెదవులు ఎంత పొడవుగా సాగితే అంత అందంగా ఉంటామని నమ్ముతారు. అందుకే యుక్త వయసు రాగానే కింది పెదవిని సాగదీస్తూ లోహపు ప్లేట్లు ధరిస్తారు. పెదవిలో అమర్చిన ప్లేట్ ఎంత పెద్దగా ఉంటే అంత అందగత్తెలని వాళ్ల నమ్మకం. పోలండ్ కు చెందిన ప్రచారకర్త సెజారేఫిలే (54) ఇటీవలే ఇథియోపియాలో పర్యటించిన సందర్భంలో తనకు కనిపించిన ముర్సీ మహిళలను చూసి ఆశ్చర్యపోయారట. వారి అనుమతితో అక్కడి అందగత్తెల ఫొటోలు తీశారు. వాటిలో కొన్ని ఇవి.. -
అధరమెంతో.. అందమంత..
ఈమె ఇథియోపియాలోని సూరి తెగకు చెందిన మహిళ. నోట్లో ఈ ప్లేట్ చూశారా.. వీటిని లిప్ ప్లేట్స్ అంటారు. ఈ తెగలో ఓ సంప్రదాయముంది. అమ్మాయికి యుక్తవయసు రాగానే.. నోట్లోని పై రెండు పళ్లను తొలగిస్తారు. ఇలా మట్టితో చేసిన ప్లేట్లాంటిదాన్ని నోట్లో బిగిస్తారు. పెదాలు సాగేకొద్దీ.. ఆ సైజు పెరిగిపోతుంటుంది. ఎందుకిదంతా అంటే.. ఇదే వారి అందానికి చిహ్నమట. పెళ్లి సమయంలో వారి లిప్ ప్లేట్ ఆధారంగా పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు నుంచి కన్యాశుల్కం(ఆవులు) డిమాండ్ చేస్తాడట. చిన్నసైజు లిప్ ప్లేట్ ఉంటే.. 40 ఆవులు.. పెద్దదైతే.. 60 ఆవులు డిమాండ్ చేస్తారట. కొందరు అమ్మాయిలైతే.. చెవులకూ ప్లేట్లు తగిలించుకుంటారు. అయితే, ఈ మధ్య కొత్తతరం అమ్మాయిలు ఇలా ప్లేట్లు బిగించుకోవడానికి నిరాకరిస్తున్నారట.