breaking news
kuppam people
-
అన్నొచ్చిన వేళ.. కుప్పంలో పండుగ వాతావరణం
సాక్షి, చిత్తూరు: అక్కడేం ఎన్నికలు జరగడం లేదు. విజయోత్సవాల నిర్వహణ అంతకన్నా కాదు. అయినా పండుగకు ఏమాత్రం తీసిపోని వాతావరణం వెల్లివిరిసింది. రాజన్న బిడ్డ తమ గడ్డకు సీఎం హోదాలో వచ్చిన వేళ.. మురిసిపోయిన కుప్పం జనసంద్ర సంబురమే అదంతా!. అడుగడుగునా స్వాగత తోరణం.. వయసుతో సంబంధం లేకుండా ‘వైఎస్ జగన్’ నినాదాలు. తమ సంక్షేమం కోసం ఆలోచిస్తున్న నేతను చూడాలనే ఉత్సాహం, అంతకు మించి అభిమానం.. మూడు కిలోమీటర్ల మేర వాళ్లను ఎండనుసైతం లెక్కచేయకుండా నిలబెట్టింది. సంక్షేమ పథక అమలుతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తమ చెంతకు వచ్చిన రాజన్న బిడ్డకు జనం పట్టిన నీరాజనం ఇది. కుప్పం పాత పేట వద్ద హెలిప్యాడ్ చెంత నుంచి సభా ప్రాంగణ వేదిక దాకా.. దారి వెంబడి వైఎస్ కుటుంబ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు బారులు తీరారు. జగనన్న అంటూ యువత నినాదాల నడుమ.. ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది కుప్పం. తమ బాగోగులు చూస్తున్న మనవడి కోసం అవ్వాఅయ్యాలు.. పెద్దకొడుకులా కుటుంబానికి అండగా నిలుస్తున్నందుకు అమ్మలు, తోబుట్టువుల్లాగా తమను ఆదరిస్తున్నందుకు అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు.. విద్యను అందిస్తూ మేనమామ కోసం విద్యార్థులు కుప్పంలోనూ తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చంద్రబాబు ఇలాకాగా, టీడీపీ కంచుకోటగా జబ్బలు చరుచుకునే పచ్చ నేతలకు.. జన నేతకు లభిస్తున్న సాదర ఘనస్వాగతం ఏమాత్రం మింగుడుపడని విషయమే!. ముప్ఫైమూడు ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని కుప్పంలో.. ఈ మూడేళ్లలో సీఎం జగన్ ఎంతో చేసి చూపించారని, జనసంక్షేమ పథకాలను తాము అర్థం చేసుకున్నామని అంటున్నారు అక్కడి జనం. ఇక ఈ జోష్తో.. వచ్చే ఎన్నికల్లో కుప్పం గడ్డ జగన్ అడ్డాగా మారబోతోందని, అక్కడ కూడా వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. -
బాబు ఇలాకాలో జగన్కు జేజేలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కంచుకోటైన కుప్పంలో జగన్మోహన్రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. జగన్ వస్తే బయటకు రాకుండా తలుపులు మూసుకొని ఇళ్లలోనే ఉండిపోవాలన్న చంద్రబాబు సూచనకు భిన్నంగా కుప్పం ప్రజలు గోడలు, మేడలు, చెట్లు, గుట్టలు ఎక్కి జగన్కు స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి శనివారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా పైపాళ్యం చేరుకున్నప్పట్నుంచీ రాత్రి కంచిబందారపల్లెలో యాత్ర ముగించే వరకూ జనం అడుగడుగునా ఆయనకు నీరాజనాలు పట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన కుప్పం సభ సాయంత్రం ఐదున్నరకు ఆరంభమైనా జనం కదలకుండా జగన్ ప్రసంగం కోసం వేచిచూశారు. సభకు విద్యార్థులు, ఉద్యోగులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని జగన్ చెప్పినప్పుడు చప్పట్లతో తమ మద్దతు తెలిపారు. రాష్ర్ట విభజన పాపం చంద్రబాబుదే అని అన్నప్పుడు కూడా జనం నుంచి పెద్దఎత్తున స్పందన వ్యక్తమైంది. సీఎంగా 9 ఏళ్లు, ప్రతిపక్షనేతగా పదేళ్లు పనిచేసిన చంద్రబాబు ఇంతవరకూ కుప్పంలో నిర్వహించని విధంగా బస్టాండ్ సెంటర్లో జగన్మోహన్రెడ్డి సభ భారీగా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. జగన్ చేపట్టిన సమైక్య శంఖారావం కుప్పం నుంచి ప్రారంభమవుతుందన్న సంగతి తెలిసి, పది రోజుల క్రితం హడావుడిగా రెండ్రోజులపాటు కుప్పంలో పర్యటించిన చంద్రబాబుకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పలుచోట్ల వందమంది కూడా జనం లేక చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తున్న బాబును పట్టించుకోని కుప్పం జనం... సమైక్య శంఖారావం యాత్రను ప్రారంభించిన జగన్కు బ్రహ్మరథం పట్టారు. కుప్పం వెళ్లేందుకు శనివారం ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. నగరంలోని కోగిలి క్రాస్, మారతహళ్లి, బొమ్మనహళ్లి, హుస్కూర్ గేట్, హెబ్బగుడి, చందాపురం, అత్తిబెలె గేట్ వద్దకు పెద్దఎత్తున తరలివచ్చి పూలమాలలు ఇవ్వడానికి పోటీ పడ్డారు. శనివారం రాత్రి 9 గంటలకు కంచిబందార్లపల్లెలో లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ కుప్పంలో బస చేశారు.