breaking news
kowthalam
-
చూసిన కనులదే భాగ్యం
కౌతాళం రూరల్: మండల పరిధిలోని బదినేహల్ గ్రామంలో శ్రీమల్లికార్జున స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన రథోత్సవం సోమవారం కనుల పండువగా సాగింది. కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా నిరాడంబరంగా సాగిన ఈ వేడుక ఈసారి ఘనంగా జరిగింది. రథోత్సవానన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచచ్చారు. ముందుగా మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేసి మహామంగళహారతులు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం గ్రామానికి చెందిన హరిచంద్రరెడ్డి వంశీయుల కుటుంబం నుంచి మొదటి కుంభం దేవాలయానికి చేరి రథానికి పూజలు చేసిన అనంతరం గ్రామసస్తులు రథాన్ని ముందుకు లాగారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగపు నాయకుడు ప్రదీప్‌రెడ్డి, మండల కన్వీనర్ నాగరాజుగౌడ్, బదినేహల్ సింగల్‌విండో అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అత్రితనయగౌడ్, నాయకులు నాకేష్రెడ్డి, రవిరెడ్డి, ఏకాంబరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పెద్దతుంబళం ఎస్ఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చేపట్టారు. హెచ్.మురవణిలో మార్మోగిన శ్రీరామ నామస్మరణ పెద్దకడబూరు: మండల పరిధిలోని హెచ్.మురవణి గ్రామంలో శ్రీ సీతారామాంజినేయస్వామి వారి రథోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఉదయం ఆలయ అర్చకులు సత్యనారాయణస్వామి, మూర్తిస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం ముందుగా కిందిగేరి వేమారెడ్డి ఇంటినుంచి కలశం, పైగేరి ఓంకారప్ప ఇంటినుంచి కుంభాన్ని రథం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి అశేష భక్త జనుల మధ్య ఊరేగించారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. బుడుములదొడ్డిలో.. కౌతాళం రూరల్: సుళేకేరి గ్రామంలో బుడుములదొడ్డి అంజనేయ స్వామి రథోత్సవం రమణీయంగా సాగింది. ఉత్సవంలో భాగంగా మొదట అంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవం జరిపించారు. ఆ తర్వాత సాయంత్రం ఉత్సవ మూర్తుల విగ్రహాలను రథంలో ఉంచి ఊరేగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు ప్రదీప్‌రెడ్డి, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పెద్దతుంబళం ఎస్ఐ రమేష్‌బాబు గట్టి బందోబస్తు చేపట్టారు. -
రికార్డులలో పేర్లున్నాయ్ కానీ.. ఊళ్లు లేవ్
చరిత్ర పుటల్లో చెదరని చరితం ఆ గ్రామాల సొంతం. భౌతికంగా అక్కడ ఊళ్లు లేకపోయినా రికార్డుల్లో చిరునామాలు మాత్రం ఉన్నాయి. గతంలో అక్కడ ప్రజలు నివసించే వారని చెప్పేందుకు ఆనవాలుగా శిథిల గోడలు, బావులు, గ్రామ చావిడిలు దర్శనమిస్తున్నాయి. ఇదీ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలోని ఈచనహాల్, గుర్రాలదొడ్డి, కాటదొడ్డి, కోసిగి మండలంలోని బాత్ర బొమ్మలాపురం, కలవలగుండు, పుట్టకుంట, పెండేకల్లు, ఎండపల్లి గ్రామాల పరిస్థితి. దొంగల బెడదతో.. కౌతాళం–ఉరకుంద గ్రామ రోడ్డులో ఈచనహాల్ గ్రామం ఉండేది. ఒకప్పుడు దాదాపు 40 కుటుంబాలు ఆ ఊళ్లో నివాసం ఉండేవి. గ్రామం వంకను ఆనుకుని ఉండటం.. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో రాత్రిళ్లు దొంగలు ఇళ్లలో ప్రవేశించి విలువైన వస్తువులు అపహరిస్తుండేవారట. దొంగల బెడద భరించలేక అక్కడ ఉన్న కుటుంబాలు ఓబుళాపురం, కామవరం, కౌతాళం గ్రామాలకు వలస వెళ్లి పోయారు. బంగారమ్మవ్వ, ఆంజనేయస్వామి ఆలయాలు, శిథిలమైన గ్రామచావిడి, రాతి బావి ఇప్పటికీ గ్రామానికి సాక్షీభూతంగా నిలిచాయి. రెవెన్యూ రికార్డులలో 816 ఎకరాల సాగుభూమి ఈచనహాల్ గ్రామ పంచాయతీ పేరుపైనే ఉండటం విశేషం. ఈచనహాల్ గ్రామానికి చెందిన గ్రామ చావిడి (శిథిలస్థితిలో) పట్నం బాటలో పెండేకల్లు కోసిగి మండల కేంద్రానికి ఈశాన్య దిశగా పెండేకల్లు ఉండేది. చాలా కాలం క్రితం దాదాపు 35 కుటుంబాలు అక్కడ నివాసం ఉండేవి. ఏళ్ల క్రితం నుంచి ఒక్కొక్కరు మండల కేంద్రానికి వలసబాట పట్టారు. కోసిగిలో వారిని పెండేకల్లు ఇంటిపేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. దాదాపు 150 కుటుంబాలు కోసిగిలో ఉన్నాయి. గ్రామ గుర్తుగా పెండేకల్లు ఆంజనేయస్వామి ఆలయం ఉంది. గ్రామానికి సంబంధించి రెవెన్యూ రికార్డులో 1423.16 ఎకరాల సాగుభూమి ఉంది. వరద పోటుతో.. కౌతాళం మండలంలో తుంగభద్ర నది ఒడ్డున ఒకప్పుడు కాటదొడ్డి, గుర్రాలదొడ్డి ఉండేవి. ఏళ్ల క్రితం గుర్రాలదొడ్డి పూర్తిగా కనుమరుగైంది. ఆ పక్కనే ఉన్న కాటదొడ్డిలో 20 కుటుంబాలకుపైగా ఉండేవి. వరద పోటుకు కుటుంబాలన్నీ గుడికంబాలి, కుంభళనూరు గ్రామాలకు వలస వెళ్లాయి. రెవెన్యూ రికార్డుల్లో 418 ఎకరాలు సాగుభూమి కాటదొడ్డి గ్రామం పేరుపైనే ఉంది. గుర్రాలదొడ్డి గ్రామం పేరుపై ఎలాంటి ఆస్తులు లేవు. కోసిగి మండలంలోని బాత్ర బొమ్మలాపురం ప్రస్తుత ఆర్డీఎస్ ఆనకట్టను ఆనుకుని ఉండేది. వరదల కారణంగా ఊరంతా కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. కొందరు అగసనూరు, సాతనూరు, కందకూరు గ్రామాల్లో స్థిరపడ్డారు. బాత్ర బొమ్మలాపురం పేరుపై 600 ఎకరాల భూములు రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ఉన్నాయి. గ్రామం గుర్తుగా మారెమ్మ ఆలయం మాత్రం దర్శనమిస్తుంది. ప్లేగు వ్యాధి కారణంగా.. ప్లేగు వ్యాధి కారణంగా ఎన్నో పల్లెలు కనుమరుగైనట్లు చరిత్ర చెబుతోంది. ఈ కోవలోనే కోసిగి మండలం కలవలగుండు, పుట్టకుంట, ఎండపల్లి గ్రామాలు కనుమరుగైనట్లు పెద్దలు పేర్కొంటున్నారు. కలవలగుండు గ్రామంలో 574.95 ఎకరాల సాగు భూమి ఉంది. ప్రస్తుతం పొలాలు పల్లెపాడు, చింతకుంట, పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నారు. కలవలగుండు ప్రాంతంలో సుంకులమ్మ ఆలయం, కొండపై, కింద భాగాల్లో రాతి రోళ్లు ఉన్నాయి. కోసిగి మండలం అర్లబండ, కడదొడ్డి గ్రామాల మధ్యలో పుట్టకుంట అనే గ్రామం ఉండేది. అంతుచిక్కని వ్యాధి కారణంగా కుటుంబాలు అర్లబండ బాట పట్టాయి. కోసిగి మండలం దుద్ది గ్రామం దక్షిణ దిశగా ఎండపల్లి గ్రామం ఉండేదట. శతాబ్దాల క్రితమే గ్రామం కనుమరుగై పోయింది. దుద్ది, కోసిగి గ్రామాల్లో ఎండపల్లి వాసులు నివాసం ఉంటున్నారు. కొందరు ఎండపల్లి ఇంటి పేరుగా కొనసాగుతున్నారు. ప్లేగు వచ్చి ఊరు వదిలారు నా పేరు శివారి గజ్జయ్య. మాది కోసిగి మండలం పల్లెపాడు గ్రామం. మా గ్రామానికి దక్షిణ దిక్కున నాలుగు తరాల క్రితం కలవలగుండు అనే ఊరు ఉండేదని మా పెద్దలు చెప్పేవారు. ఇప్పటికీ ఆ గ్రామం ఆనవాలుగా బండరాళ్లపై రోళ్లు, పాడుబడిన గోడలు ఉన్నాయి. అక్కడే సుంకులమ్మ ఆలయం, కొంత దూరంలో ఆంజనేయస్వామి విగ్రహాలున్నాయి. అప్పట్లో ప్లేగు వచ్చి ఊరు ఖాళీ అయ్యిందట. మా ముత్తాతల నాడే వలస నా పేరు గోపాలు. మా ముత్తాతలు ఈచనహాల్ నుంచి కౌతాళం మండల కేంద్రానికి వచ్చారట. అందుకే మా ఇంటి పేరు ఈచనహాల్గా మారిందట. దోపిడీ దొంగల బెడద కారణంగా మా ముత్తాతలు ఊరిని వదిలేసి వచ్చారని చెబుతారు. ఇప్పటికీ మాకు ఆ గ్రామ పొలిమేరలోనే రెండు ఎకరాల భూమి ఉంది. వరదలకు ఊరు ఖాళీ నా పేరు ఈరన్న. మాది కాటదొడ్డి గ్రామం. గ్రామంలో గతంలో 20 కుటుంబాలకుపైగా ఉండేవారు. గతంలో వరదలకు ఊరు ముంపునకు గురి కావడంతో కుటుంబాలన్నీ కుంబళనూరుకు మారాయి. ఆంజనేయస్వామి గుడి ఉండటంతో పూజారులుగా మా మూడు కుటుంబాలు ఇక్కడే ఉండిపోయాం. -
చాపమ్మవ్వ కిడ్నాప్
కౌతాళం: ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులోని బాపురం గ్రామ పొలిమేరలో కొలువుదీరిన చాపమ్మవ్వను మంగళవారం ఆమె కుమారులు కిడ్నాప్ చేశారు. దాదాపు 10 సంవత్సరాలుగా చాపమ్మవ్వ ఆంధ్ర, కర్ణాటక భక్తులకు ఆరాధ్య దైవంగా నిత్యం పూజలందుకుంటుంది. ఇటీవల చాపమ్మవ్వ దగ్గర ఉండే బాపురం గ్రామస్తులకు, ఆమె కుమారులకు మనస్పర్థలు రావడంతో తమ తల్లిని ఎలాగైనా తమ సొంత గ్రామం కర్ణాటకలోని గంగావతి నియోజకవర్గం కాటిగె గ్రామానికి తీసుకెళ్లాలని పథకం వేశారు. ఈ మేరకు మంగళవారం చాపమ్మవ్వను బహిర్భూమికి తీసుకెళ్తానని చెప్పి అప్పటికే అర కిలోమీటరు దూరంలో ఉంచిన జీపు వద్దకు తీసుకెళ్లి అక్కడి నుంచి కిడ్నాప్ చేశారు. కర్ణాటకలోని హచ్చోళ్లి పోలీసు స్టేష్న్లో బాపురం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. చాపమ్మవ్వను ఎలాగైనా గ్రామానికి తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ నాయకుడి దారుణ హత్య
కౌతాళం: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా కౌతాళం మండలం నదిచాగిలో వైఎస్సార్ సీపీ నాయకుడు ఈరన్న గౌడ్ ను దుండగులు దారుణంగా హత్యచేశారు. ఆయనపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన గురువారం మృతి చెందారు. బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లిన ఈరన్న రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలింపు చేపట్టినప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. రాజకీయపరమైన కక్షతోనే టీడీపీ వర్గీయులు ఈ కిరాతకానికి పాల్పడ్డారని ఈరన్న గౌడ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హంతకులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.