అభిరథ్ రెడ్డి, హిమతేజ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌తో జింఖానా మైదానంలో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 56/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 105 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 415 పరుగులు చేసింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి (121; 16 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ కొడిమెల హిమతేజ (125 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీలు సాధించారు. అమన్ రావు (52; 8 ఫోర్లు, 1 సిక్స్)తో తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించిన అభిరథ్... మూడో వికెట్‌కు హిమతేజతో 147 పరుగులు జత చేశాడు. ప్రజ్ఞయ్ రెడ్డి (52 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్), హిమతేజ ఐదో వికెట్‌కు అజేయంగా 91 పరుగులు జోడించాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్ 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆంధ్ర 267/5 నాగాలాండ్ జట్టుతో సొవిమాలో జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో... రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (51; 7 ఫోర్లు), కరణ్ షిండే (51; 5 ఫోర్లు, 1 సిక్స్), సీఆర్ జ్ఞానేశ్వర్ (87 బ్యాటింగ్; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 366కు ఆంధ్ర మరో 99 పరుగుల దూరంలో ఉంది. జ్ఞానేశ్వర్‌తో కలిసి శశికాంత్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.