breaking news
Kisan Vikas documents
-
కిసాన్ వికాస్ పత్రాలు...ఇన్వెస్ట్‌మెంట్‌కు ఓకేనా?
గతంలో మదుపరుల మదిని దోచుకున్న కిసాన్ వికాస్ పత్రాలను(కేవీపీ) కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టింది. ప్రజల్లో తగ్గుతున్న పొదుపు శక్తిని పెంచడం కోసం కేవీపీని ఈ నెల 18న కేంద్రం మళ్లీ ప్రారంభించింది. ఇన్వెస్ట్ చేసిన మొత్తం 100 నెలల్లో రెట్టింపు అయ్యే విధంగా ప్రవేశపెట్టిన ఈ పథకం మదుపరులను ఆకర్షిస్తుందా లేదా అన్న అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం... ఎటువంటి రిస్క్ లేకుండా పూర్తి సురక్షితమైన పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేవారే లక్ష్యంగా కిసాన్ వికాస పత్రాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై కేంద్ర ప్రభుత్వ హామీ ఉండటంతో పాటు, 100 నెలల్లో పెట్టుబడి రెట్టింపు అవ్వడం అనేది ప్రధానమైన ఆకర్షణ. 100 నెలల్లో అంటే 8.3 ఏళ్లకు పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఇక వడ్డీ విషయానికి వస్తే సుమారుగా 8.67 శాతం వార్షిక వడ్డీరేటు లెక్కతేలుతోంది. అన్ని పోస్టాఫీసుల్లో లభించే ఈ కేవీపీల్లో గరిష్టంగా ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రూ. 1,000, రూ. 5,000, రూ.10,000, రూ.50,000 గుణిజాల్లో కేవీపీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా తీసుకోవచ్చు. అలాగే కాలపరిమితిలోగా ఎన్నిసార్లయినా ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకి మార్చుకోవచ్చు. అలాగే ఒక పోస్టాఫీసు నుంచి దేశంలో ఉన్న ఇతర పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు. సాధారణ కేవైసీ నిబంధనలు అంటే గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వ డం ద్వారా కిసాన్ వికాస పత్రాలు పొందవచ్చు. రూ. 50,000 ఇన్వెస్ట్మెంట్ వరకు పాన్ కార్డు అవసరం లేదు. కిసాన్ వికాస పత్రాలను బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు. ప్రతికూలతలు వడ్డీరేటు తక్కువగా ఉండటం, ఎటువంటి పన్ను ప్రయోజనాలు లభించకపోవడం, లాకిన్ పిరియడ్ అధికంగా ఉండటం వంటివి ప్రతికూలాంశాలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో 100 కంటే తక్కువ నెలల్లోనే రెట్టింపు అయ్యే పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఎస్బీఐ ట్యాక్స్ సేవర్నే దృష్టిలో పెట్టుకుంటే ఐదేళ్ళ కాలానికి 8.75 శాతం వడ్డీ ఇవ్వడమే కాకుండా, ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అదే మరికొద్దిగా రిస్క్‌కు సిద్ధపడితే ప్రైవేటు గృహరుణ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు 9 నుంచి 10 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కానీ కేవీపీ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఎటువంటి పన్ను ప్రయోజనాలు లభించవు. అలాగే దీనిపై వచ్చే వడ్డీని కూడా ఆదాయంగానే పరిగణిస్తారు. కేవీపీలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 30 నెలల లాకిన్ పిరియడ్ ఉంది. అంటే ఇన్వెస్ట్ చేసిన రెండున్నర ఏళ్ల వరకు ఇందులోంచి వైదొలగడానికి ఉండదు. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న ఉద్దేశంతో కేవీపీ కాలపరిమితిని 100 నెలలుగా నిర్ణయించినట్లు కనపడుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పెట్టుబడి పరంగా చూస్తే కేవీపీ కంటే అధిక రాబడినిచ్చే సురక్షిత సాధనాలు ఉండటంతో ఇప్పుడు ఇవి ఇన్వెస్టర్లను అంతగా ఆకర్షించకపోవచ్చన్నది వారి వాదన. ప్రస్తుత స్థాయి నుంచి వడ్డీరేట్లు మరో అర శాతం తగ్గితే అప్పుడు కేవీపీలకేసి చూడొచ్చంటున్నారు. వచ్చే ఎనిమిదేళ్లు ద్రవ్యోల్బణం పెరగకుండా ప్రస్తుత స్థాయి 5 శాతం వద్దే స్థిరంగా ఉందనుకున్నా నికర రాబడి ఒక శాతం మించి ఉండటంలేదంటున్నారు రైట్ హొరెజైన్స్ సీఈవో, అనిల్ రెగో. ఫార్ములా 72 ఇన్వెస్ట్ చేస్తున్న సొమ్ము ఎప్పటికి రెట్టింపు అవుతుందో తెలుసుకోవాలనుకునే కోరిక అందరికీ ఉంటుంది. ‘ఫార్ములా 72’ ఉపయోగించి ఎంతకాలానికి రెట్టింపు అవుతుందో తెలుసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తం మీద వచ్చే వడ్డీరేటు తెలిస్తే చాలు ఎన్నేళ్లకు రెట్టింపో చెప్పేయొచ్చు. 72 ను వడ్డీ రేటుతో భాగించగా వచ్చే విలువ ఎప్పటికి రెట్టింపు అవుతుందో తెలియచేస్తుంది. ఉదాహరణకు 10 శాతం వడ్డీ అనుకుంటే (72/10=7.2) మీ డబ్బు 7.2 ఏళ్లలో రెట్టింపు అవుతుందన్న మాట. దీన్ని నెలల్లో మార్చుకోవాలనుకుంటే ఈ విలువను 12తో గుణిస్తే సరిపోతుంది. అంటే.. ఇంచుమించు మీ డబ్బు 86 నెలల్లో రెట్టింపు అవుతుందన్నమాట. -
పొదుపు పెంచండి..
న్యూఢిల్లీ: దేశీయంగా అంతకంతకూ తగ్గిపోతున్న పొదుపు రేటును మళ్లీ పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్రాలను (కేవీపీ) మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ఈ ఇన్వెస్ట్మెంట్ సాధనాన్ని ఆవిష్కరించారు. పేదలు మోసపూరిత (పోంజీ) స్కీముల బారిన పడకుండా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇది తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ఎకానమీలో మందగమనం కారణంగా గడిచిన 2-3 సంవత్సరాల్లో దేశంలో పొదుపు రేటు రికార్డు స్థాయి 36.8 శాతం నుంచి 30 శాతం దిగువకు పడిపోయిందని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో మరింత పొదుపు చేయాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ దిశగా కిసాన్ వికాస్ పత్రాలతో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయని జైట్లీ తెలిపారు. పొదుపు రేటు పెంచడం ఒకటి కాగా.. అమాయక ఇన్వెస్టర్లు పోంజీ స్కీముల వైపు మళ్లకుండా విశ్వసనీయమైన ప్రభుత్వ పథకంలో తమ పొదుపు మొత్తాలను దాచుకునేందుకు ఉపయోగపడటం రెండోదని ఆయన వివరించారు. ఇన్వెస్టర్లకు వడ్డీ ఆదాయం తో పాటు దేశ నిర్మాణానికి కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ సాధనం తోడ్పడుతుందని జైట్లీ చెప్పారు. మరోవైపు, పొదుపు చేసేందుకు నమ్మకమైన సాధనం లేకపోవడంతో ప్రజలు డబ్బును తమ దగ్గరే అట్టే పెట్టుకోవడమో లేక బంగారం, వెండి మొదలైనవి కొనుక్కోవడమో చేయాల్సి వస్తోందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. దేశప్రజలకు కిసాన్ వికాస్ పత్రాలతో ఎనలేని అనుబంధం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. దాదాపు వందేళ్లుగా పోస్టల్ శాఖ వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను నిర్వహిస్తోందని, ప్రస్తుతం 30.8 లక్షల పైచిలుకు ఖాతాదారులు ఉన్నారని ఆయన తెలిపారు. కిసాన్ వికాస్ పత్రాల వివరాలివీ.. కేవీపీల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తం.. 100 నెలల్లో రెట్టింపు అవుతుంది. రూ.1,000, రూ. 5,000, రూ. 10,000, రూ. 50,000 విలువ గల పత్రాలు అందుబాటులో ఉంటాయి. పెట్టుబడికి గరిష్ట పరిమితేమీ ఉండదు. కనీసంగా రెండున్నర సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే, దీనిపై పన్నుపరమైన ప్రయోజనాలు ఉండవు. తొలుత వీటిని పోస్టాఫీసుల ద్వారా, ఆ తర్వాత క్రమంగా నిర్దిష్ట బ్యాంకుల శాఖల్లో విక్రయించడం జరుగుతుంది. 1988లో ప్రభుత్వం కేవీపీని ప్రవేశపెట్టింది. ఒక దశలో జాతీయ పొదుపు పథకాల కింద దేశవ్యాప్తంగా జమయిన పొదుపు మొత్తాల్లో కిసాన్ వికాస్ పత్రాల వాటా 29 శాతం దాకా ఉండేది. అయితే దుర్వినియోగం అవుతోందన్న ఆరోపణల నేపథ్యంలో 2011లో ప్రభుత్వం కేవీపీని నిలిపివేసింది. ఆ తర్వాత తాజాగా మళ్లీ ప్రవేశపెట్టింది.