
పొదుపు పెంచండి..
దేశీయంగా అంతకంతకూ తగ్గిపోతున్న పొదుపు రేటును మళ్లీ పెంచే....
న్యూఢిల్లీ: దేశీయంగా అంతకంతకూ తగ్గిపోతున్న పొదుపు రేటును మళ్లీ పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్రాలను (కేవీపీ) మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ఈ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాన్ని ఆవిష్కరించారు. పేదలు మోసపూరిత (పోంజీ) స్కీముల బారిన పడకుండా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇది తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ఎకానమీలో మందగమనం కారణంగా గడిచిన 2-3 సంవత్సరాల్లో దేశంలో పొదుపు రేటు రికార్డు స్థాయి 36.8 శాతం నుంచి 30 శాతం దిగువకు పడిపోయిందని మంత్రి వివరించారు.
ఈ నేపథ్యంలో మరింత పొదుపు చేయాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ దిశగా కిసాన్ వికాస్ పత్రాలతో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయని జైట్లీ తెలిపారు. పొదుపు రేటు పెంచడం ఒకటి కాగా.. అమాయక ఇన్వెస్టర్లు పోంజీ స్కీముల వైపు మళ్లకుండా విశ్వసనీయమైన ప్రభుత్వ పథకంలో తమ పొదుపు మొత్తాలను దాచుకునేందుకు ఉపయోగపడటం రెండోదని ఆయన వివరించారు. ఇన్వెస్టర్లకు వడ్డీ ఆదాయం తో పాటు దేశ నిర్మాణానికి కూడా ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనం తోడ్పడుతుందని జైట్లీ చెప్పారు.
మరోవైపు, పొదుపు చేసేందుకు నమ్మకమైన సాధనం లేకపోవడంతో ప్రజలు డబ్బును తమ దగ్గరే అట్టే పెట్టుకోవడమో లేక బంగారం, వెండి మొదలైనవి కొనుక్కోవడమో చేయాల్సి వస్తోందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. దేశప్రజలకు కిసాన్ వికాస్ పత్రాలతో ఎనలేని అనుబంధం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. దాదాపు వందేళ్లుగా పోస్టల్ శాఖ వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను నిర్వహిస్తోందని, ప్రస్తుతం 30.8 లక్షల పైచిలుకు ఖాతాదారులు ఉన్నారని ఆయన తెలిపారు.
కిసాన్ వికాస్ పత్రాల వివరాలివీ..
కేవీపీల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తం.. 100 నెలల్లో రెట్టింపు అవుతుంది. రూ.1,000, రూ. 5,000, రూ. 10,000, రూ. 50,000 విలువ గల పత్రాలు అందుబాటులో ఉంటాయి. పెట్టుబడికి గరిష్ట పరిమితేమీ ఉండదు. కనీసంగా రెండున్నర సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది.
అయితే, దీనిపై పన్నుపరమైన ప్రయోజనాలు ఉండవు. తొలుత వీటిని పోస్టాఫీసుల ద్వారా, ఆ తర్వాత క్రమంగా నిర్దిష్ట బ్యాంకుల శాఖల్లో విక్రయించడం జరుగుతుంది.
1988లో ప్రభుత్వం కేవీపీని ప్రవేశపెట్టింది. ఒక దశలో జాతీయ పొదుపు పథకాల కింద దేశవ్యాప్తంగా జమయిన పొదుపు మొత్తాల్లో కిసాన్ వికాస్ పత్రాల వాటా 29 శాతం దాకా ఉండేది. అయితే దుర్వినియోగం అవుతోందన్న ఆరోపణల నేపథ్యంలో 2011లో ప్రభుత్వం కేవీపీని నిలిపివేసింది. ఆ తర్వాత తాజాగా మళ్లీ ప్రవేశపెట్టింది.