breaking news
karimnagar hospital
-
అమ్మా.. లే అమ్మ
మల్యాల: ‘మా అమ్మకు ఏమైంది.. అమ్మ.. లే అమ్మా..’ ఆ చిన్నారుల కంటతడి అక్కడున్నవారిని కంట తడి పెట్టించింది. తల్లి తన ఒడిలో ఆడిస్తూ.. అల్లరి చేస్తే అడిగింది ఇస్తూ.. ఏడిస్తే బుజ్జగించే అమ్మ లేదని, ఇక తిరిగి రాదని ఆ పిల్లలకు తెలియదు. అమ్మే లోకంగా.. నిత్యం ఆమె ఒడిలో ఆడుకునే పిల్లల అమాయక చూపులు.. అమ్మ లేదని తెలియని ఆ పిల్లలకు ఎప్పుడొస్తుందని అడిగితే ఏం చెప్పాలో తెలియని ఆ తండ్రిని చూసి గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. అనారోగ్యంతో బాధపడుతూ ఓ నిండు గర్భిణి మృతిచెందగా.. ఆమె మృతదేహం వద్ద కనిపించిన ఈ హృదయ విదారకమైన ఘటన మల్యాల మండలం నూకపల్లిలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. నూకపల్లికి చెందిన చెవులమద్ది మహేశ్‌తో పెగడపల్లి మండలం వెంగళాయిపేట గ్రామానికి చెందిన స్రవంతితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు నిహాంత్ (7), కూతురు నిక్షిత (3) ఉన్నారు. మహేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. స్రవంతి బీడీలు చేస్తూ వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. స్రవంతి మూడోసారి గర్భం దాల్చినప్పటినుంచి జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెగ్యులర్ చెకప్ చేయించుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణి. కొద్దిరోజుల క్రితం ఆస్పత్రికి పరీక్షల కోసం వెళ్లగా.. కడుపులో బిడ్డ కదలడం లేదని, కరీంనగర్‌కు రెఫర్ చేశారు. అక్కడ కూడా కడుపులో బిడ్డ కదలడం లేదని, శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ చేసి పురుడుపోసినా.. అప్పటికే శిశువు మృతిచెందింది. కాసేపటికి పరిస్థితి విషమించి స్రవంతి కూడా చనిపోయింది.నూకపల్లిలో విషాదంస్రవంతి పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లి.. కడుపులో బిడ్డ, తల్లి కూడా మృతిచెందడంతో నూకపల్లిలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా ఆమె కుమారుడు, కూతురు బిక్కుబిక్కుమంటూ చూడడం స్థానికులను కంటతడి పెట్టింది. మా అమ్మకు ఏమైంది అని అక్కడున్నవారిని అమాయకంగా అడగడంతో ఏం చెప్పాలో.. వారిని ఎలా ఓదార్చాలో తెలియని పరిస్థితి నెలకొంది. నూకపల్లిలో స్రవంతి అంత్యక్రియలు నిర్వహించారు. వందలాదిమంది అంతిమయాత్రలో పాల్గొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆమె అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబసభ్యులకు రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. -
ఆసుపత్రి ఇలాగేనా..!
హుజూరాబాద్‌రూరల్: ‘ఆసుపత్రి ఇలాగే ఉంటుందా..? ఎటు చూసినా అపరిశుభ్రం.. మురికికూపాలుగా వార్డులు.. దుర్వాసన వస్తున్న మరుగుదొడ్లు.. ఇలాగైతే ఎలా..? విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు..’ అంటూ జిల్లా వైద్యాధికారి రామ్మనోహర్ రావు హెచ్చరించారు. ‘పేరుకే పెద్దాసుపత్రి’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించారు. హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని పరిస్థితిని తెలుసుకుని నివేదిక అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి సూచించారు. ఈ మేరకు రామ్‌మనోహర్‌రావు ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని ప్రతివార్డులోని రోగుల వద్దకు వెళ్లి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పారిశుధ్యం లోపించడంతో సిబ్బందిని పిలిపించి తీవ్ర స్థాయిలో మందలించారు. మరుగుదొడ్లను సరిగ్గా శుభ్రం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో పందులు స్వైరవిహారం చేయడాన్ని గమనించి.. వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్యలోపంపై డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజమౌళిని ప్రశ్నించారు. పర్యవేక్షణ ఇదేనా..? అంటూ మండిపడ్డారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.5 లక్షలతో కాంటిజెంట్ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలన్నారు. పారిశుధ్య సమస్య పునరావృతమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓపీ (ఔట్‌పేషెంట్) రికార్డును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు వైద్యులు తప్పనిసరిగా ఓపీ చూడాలని సూచించారు. వైద్యులు ఎల్లప్పుడు రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన బుర్ర సాత్విక రెండోకాన్పు చేయించుకోగా.. ఆడబిడ్డ జన్మించిందని, ఆ బిడ్డ తల్లిదండ్రులు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయమంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. శంకరటపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన రాధారపు నిఖిత గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా పరీక్షించారు. ప్రభుత్వ హాస్టల్లో ఆర్బీఎస్కే వైద్య బృందం పరీక్షలు జరిపారా..? అని ఆరా తీశారు. లేదనడంతో వెంటనే రాష్ట్రీయ బాల్ స్వస్త ఆరోగ్య కార్యక్రమం వైద్యుడికి ఫోన్ చేసి మాట్లాడాలని డిప్యూటీ డీఎంహెచ్‌వోను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ప్రతిమ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణరావు, వైద్య సిబ్బంది ఉన్నారు. స్పందించిన సూపరింటెండెంట్ మరోవైపు సాక్షిలో వచ్చిన కథనానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణరావు స్పందించారు. సిబ్బందితో ఆసుపత్రి పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించారు. మురికి నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో మట్టి పోయించారు. -
వివాహిత గొంతు కోసి.. ఆపై ఆత్మహత్యాయత్నం
అల్గునూర్ (మానకొండూర్): ఓ యువకుడు వివాహిత గొంతు కోసి.. ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ పంచాయతీ పరిధిలోని తమిళకాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కవిత, గణేశ్ దంపతులు. వీరి ఇంటి సమీపంలో రాజేశ్ నివాసం ఉంటున్నాడు. అయితే.. రాజేశ్ పుట్టు మూగ కావడంతో కవిత కొంత చనువుగా మెలిగేది. దీనిని అవకాశంగా తీసుకున్న రాజేశ్.. ఆమెను వేధించడం ప్రారంభించాడు. దీంతో మూడు నెలల క్రితం కవిత–గణేశ్ దంపతులు కాలనీ నుంచి ఇల్లు ఖాళీ చేసి.. రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కవిత ఇంటికి వచ్చిన రాజేశ్ బ్లేడ్‌తో ఆమెపై దాడి చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో భయంతో తను కూడా గొంతు కోసుకున్నాడు. స్థానికులు ఇద్దరినీ కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. రాజేశ్ సోదరి మాత్రం తన తమ్ముడిని కవిత వేధిస్తోందని, అసభ్యకరంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. తన తమ్ముడికి వచ్చే ఆసరా పింఛన్ కూడా తనే తీసుకునేదని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే కారణమా! కవిత, రాజేశ్ మధ్య కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గతంలో రాజేశ్, కవిత ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఈ విషయం గణేశ్ ఇంట్లో తెలియడంతో ఇంటిని ఖాళీ చేశారని తెలిసింది. ఈ క్రమంలో కవితను కలవడానికి వీలుకాకపోవడంతో ఆగ్రహానికి గురైన రాజేశ్.. శుక్రవారం ఆమెను కలుసుకునేందుకు వెళ్లాడు. బాధితురాలు విషయం బయటపడుతుందని వెళ్లిపోవాలని సూచించడంతో ఆగ్రహానికిలోనైన రాజేశ్ బ్లేడ్ తీసుకుని కవితపై దాడి చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని ఎల్ఎండీ ఎస్ఐ నరేశ్‌రెడ్డి తెలిపారు. -
ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ మృతి
కరీంనగర్: ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ మృతి చెందారు. దీంతో బాధితులు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తల్లి, బిడ్డ మృతి చెందారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సర్కారు దవాఖానాల్లో నరకయాతన
-
సర్కారు దవాఖానాల్లో నరకయాతన
* ఎక్కడ చూసినా దారుణ పరిస్థితులే.. * సిబ్బంది ఉండరు.. పరికరాలుండవు.. అన్నీ ఉంటే రోగులకు బెడ్లు ఉండవు * రోగులంటే సిబ్బందికీ లోకువే.. నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని తీరు * రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘సాక్షి’ పరిశీలన కల్పనకు నెలలు నిండాయి. ఆదివారం సాయంత్రం ఆమె భర్త రాజు హన్మకొండలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చాడు. సిబ్బంది పరీక్షించారు. అడ్మిట్ చేయాలని చెప్పారు కానీ.. బెడ్ ఇవ్వలేదు. చేసేదేమీ లేక నొప్పులు పడుతూనే ఆసుపత్రిలో రాత్రంతా ఓ మూలన పడుకుంది. సోమవారం ఉదయం మళ్లీ బెడ్ అడిగినా ఇచ్చేవారు లేరు. మధ్యాహ్నం రక్తస్రావం మొదలైంది. డ్యూటీ డాక్టర్ దగ్గరకు వెళితే... బయట కూర్చోమంటూ ఈసడింపు. అక్కడ నిల్చునే ఓపిక లేక.. వరండాలో మరో రోగి బెడ్‌పై కూర్చుండిపోయింది. చివరికి అక్కడకు వచ్చిన ‘సాక్షి’ విలేకరి ఆ ఫొటోలన్నీ తీస్తుండటంతో సిబ్బంది గమనించి.. కల్పనను బెడ్ మీదికి చేర్చారు. ఇదీ... హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సోమవారం నాటి పరిస్థితి! (సాక్షి ప్రత్యేక బృందాలు) ఒళ్లంతా కాలినా... సూది మందు, సెలైన్ బాటిల్ తప్ప గతిలేదు కొన్ని ఆసుపత్రుల్లో. ఎక్స్‌రే యంత్రాలున్నా కమీషన్ల కోసం పక్కనున్న ప్రైవేటు డయాగ్నస్టిక్స్‌కు పంపిస్తున్నారు మరికొన్ని ఆసుపత్రుల్లో. అంబులెన్సు ఉంటే డ్రైవరుండడు... స్కానింగ్ మెషిన్లున్నా టెక్నీషియన్లుండరు.. ఏడుగురు వైద్యులుంటే ఐదుగురు లీవులోనే ఉంటారు... అన్నీ ఉన్నచోట బెడ్లు ఫుల్!. ఇలా చెప్పుకుంటూ పోతే సర్కారీ ఆసుపత్రుల్లో సమస్యలకు అంతుండదు. సోమవారం ఒక్కరోజు... ‘వైద్య విధ్వంసాన్ని’ ప్రత్యక్షంగా చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లిన ‘సాక్షి’ విలేకరులకు కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దారుణాలన్నీ కనిపించాయి. దీన్నిబట్టి ఆసుపత్రుల్లో ప్రతిరోజూ ఎంతమంది నిస్సహాయంగా వెనుదిరుగుతున్నారో తెలుసుకోవచ్చు. రోగులను సాటి మనుషుల్లా చూసి.. వారి బాధను గమనించి... తక్షణ చికిత్స అందించిన ఆసుపత్రి ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదెందుకు? ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు లేకపోవటమన్నది కొత్త విషయం కాదు. కానీ ఉన్న సౌకర్యాలను పూర్తిస్థాయిలో వాడకపోవటం... కనీసం రోగుల్ని సాటి మనుషుల్లా చూసి వారికి సాధ్యమైన రీతిలో తక్షణ చికిత్స అందించకపోవటం... అసలు స్పందన అనేది లేకపోవటం... వీటిని పీడిస్తున్న జబ్బులు. అసలు ‘ప్రభుత్వమనేది ఉందా?’ అని డౌటొచ్చే స్థాయిలో ఆసుపత్రుల్ని పీడిస్తున్న ఈ జబ్బులకు... చికిత్స కావాలి. ఇదిగో... వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో సోమవారం ఒక్కరోజే కనిపించిన సంఘటనల సమాహారం... ఎంజీఎం ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగంలో ఎంత పెద్ద రోగానికైనా మందు బిళ్లలే దిక్కవుతున్నాయి. సోమవారం ఆస్పత్రిలో ఓపీ ఆవరణలో చాలప కాంతమ్మ అనే వృద్ధురాలు వచ్చిపోతున్న వారిని ఆపుతూ.. ‘‘ఓ బిడ్డా.. ఇవి గుండెనొప్పి గోళీలేనా? గుండెల్లో నొప్పి ఉందని ఈడికి వచ్చిన. మందు బిళ్లలే ఇచ్చిళ్లు. దీనితోని తక్కువైత లేదు. మూడు సార్లు వచ్చినా ఈ గోళీలే (డైక్లోఫినాక్) ఇస్తున్నరు’’ అని దీనంగా అడ గడం కనిపించింది. ‘‘ఆర్నెళ్ల కిందట యాక్సిడెంట్ అయ్యింది. వెన్నుపూసల చీలిక వచ్చిందని చెప్పిళ్లు. నెల సంది ఈడ తిరుగుతున్నం. మందు బిళ్లలే ఇస్తుళ్లు.. నొప్పితో కూసోనికే వస్తలేదు. రోజుకు యాభై కిలోమీటర్లు పోయి వచ్చుడు కష్టమైతంది’’ అని కరీంనగర్ జిల్లా కమలాపురం మండలం పెద్ద పాపాయ్యపల్లికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎక్కడ చూసినా అరకొర వసతులు.. బెడ్ల కోసం తిప్పలు ఎంజీఎంలో మందుబిళ్లలే దిక్కు.. వరంగల్ జిల్లా ప్రజలకు ఎంజీఎం, హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రులే పెద్దదిక్కు. ఇతర జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. రోగుల పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్దయగా వ్యవహరిస్తున్నారు. అడుగడుగునా సెక్యూరిటీ సిబ్బందికి లంచాలు సమర్పించాల్సి వస్తోంది. ఇంత కష్టపడి లోపలికి వెళ్లిన రోగులకు సరిపడా బెడ్లు అందుబాటులో లేవు. వేయి పడకల సామర్థ్యం ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో మహిళల వార్డులో రోగులకు సరిపడా బెడ్లులేక నేలపైనే పడుకోబెడుతున్నారు. అత్యవసర వైద్య సేవల విభాగంలో సరిపడా స్ట్రెచర్లు, వీల్చైర్లు లేవు. నడవలేని స్థితిలో ఉన్న రోగులను వారి బంధువులే మోసుకెళ్తూ తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మంచిర్యాలకు చెందిన ఆరేళ్ల నరేశ్‌ను బైక్ ఢీకొంది. కాలు విరిగింది. ఎముక వేలాడుతోంది. దగ్గర్లోని పసరు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. బద్దలు పెట్టి కట్టు కట్టి... పెద్దాసుపత్రికి తీసుకుపొమ్మన్నాడు. అప్పటికప్పుడు అప్పులు చేసి కరీంనగర్ పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చూసే వారే లేరు. అదేంటి! ఎమర్జెన్సీకి ఎవరూ ఉండరా? అని నరేశ్ తండ్రి చంద్రయ్య అమాయకంగా అడగ్గా.. 9 గంటలకు వస్తారన్నారు. కానీ 10 గంటల తరవాతే చీటీ రాశారు. ఎవ్వరూ సాయం చేయకపోతే తన బిడ్డను తానే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి డాక్టర్ దగ్గరికి.. అక్కడ్నుంచి ఎక్స్‌రే రూమ్‌కి... అక్కడి నుంచి పట్టీ వేసే దగ్గరికి తీసుకెళ్లాడు. చివరకు బ్లడ్ టెస్టులూ అవీ చేసి... అన్నీ బాగుంటే రేపు ఆపరేషన్ చేస్తామన్నారు. లేకుంటే టైమ్ పడుతుందట!! వైద్యం కోసం ‘ప్రసవ’ వేదన.. ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి మండలాల్లోని దళిత, గిరిజన గర్భిణులు పురుడు పోసుకోవాలంటే చేతి నిండా డబ్బులు పట్టుకొని పట్టణాలకు పరుగులు తీయాల్సిందే! ఏజెన్సీలోని సామాజిక ఆస్పత్రిలో వైద్యాధికారుల కొరత తీవ్రంగా ఉంది. రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అదే పరిస్థితి. సామాజిక ఆస్పత్రిలో ప్రసూతి ఆపరేషన్ గది ఉన్నా.. ఆపరేషన్ చేయడానికి వైద్యుడు, మత్తు మందు ఇచ్చే డాక్టర్ లేడు. చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం ‘‘స్త్రీలకు వచ్చే రోగాలను చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. మహిళా డాక్టర్ ఉంటే మా బాధను చెప్పుకొని చికిత్స పొందే వాళ్లం. ఇక్కడ వారు లేక వరంగల్‌కు లేక ప్రైవేటు ఆస్పత్రికి పోవాల్సిన పరిస్థితి ఉంది’’ - కర్నె దివ్య, చెల్పాక, గర్భిణి. ఏటూరునాగారం రాజధానిలో ఇదీ పరిస్థితీ.. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి వెళితే ఎటువంటి జబ్బు అయినా నయం అవుతుందని, సకల సదుపాయాలు ఉంటాయనే ఆశతో ఎక్కడెక్కడి నుంచో రోగులు వస్తుంటారు. అయితే వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. డాక్టర్ల రాక కోసం రోగులు పడిగాపులు కాయాల్సిందే. వైద్య పరీక్షల కోసం చాలా దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. స్ట్రెచర్లు కూడా దొరకని పరిస్థితి అక్కడిది. డబ్బులుంటేనే పడకలు.. ఆరోగ్య శ్రీ పేషంట్లకు నెల రోజులు ఎదురు చూసినా దొరకవు. దీంతో చేసేదేం లేక ఆస్పత్రి ప్రాంగణంలోనే పడుకుంటున్నారు. నాలుగు రోజులుగా పడిగాపులు.. భార్యకు సపర్యలు చేస్తున్న ఈ వృద్ధుడి పేరు తిగుళ్ల బాలకిష్టారెడ్డి. మెదక్ జిల్లా తోగుట మండలం క్రిష్టాపురం గ్రామానికి చెందిన ఆయన.. తీవ్ర నడుంనొప్పితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న తన భార్య రామవ్వ (65)ను నాలుగు రోజుల కింద ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆస్పత్రిలో చేర్పించుకోవాలని డాక్టర్ల కాళ్లా వేళ్లా పడ్డాడు. అయితే ఓపీ చిట్టీ లేదని వైద్యులు అడ్మిట్ చేసుకోలేదు. ఓపీ చిట్టీ కోసం వెళితే రోగి లేనిదే ఇచ్చేది లేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఏమీ చేయలేక నాలుగు రోజులుగా అక్కడే పడిగాపులు పడుతున్నారు. బయట దాతలు పెడుతున్న ఆహారం తిని అక్కడే ఎదురు చూపులు చూస్తున్నారు. వీరిని చూసి అక్కడి వారు చలించిపోతున్నారు. పేట్లబురుజులో ప్రసవ వేదన! రాజధానిలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నిండు గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. ఔట్ పేషంట్(ఓపీ) టోకెన్ల కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్లి క్యూలో నిలబడితే కానీ టోకెన్ దొరకని దుస్థితి. అసలే పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు చాంతాండంత క్యూలైన్లు నరకం చూపుతున్నాయి. 600 పడకల సామర్థ్యం ఉన్న పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి నగరం నలుమూలల నుంచే కాకుండా రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహ బూబ్‌నగర్ జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. రక్త, మూత్ర పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. వెళ్లిపొమ్మంటుండ్రు... ‘‘నా పెనిమిటి లేడు. కొడుకులు లేరు. అన్నింటికి కూతురే దిక్కు. కూలీనాలీ చేసుకుంటూ పొట్టనింపుకునేటోళ్లం. వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న. ఐదు రోజుల కిందట మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి వచ్చిన ఇక్కడికి అచ్చిన తర్వాత డాక్టర్లు సరిగా చూస్తలేరు. కూర్చుందామన్నా.. కూర్చోవస్తలేదు. నిన్నట్నుంచి నన్ను ఆస్పత్రి నుంచి వెళ్లిపోమంటుండ్రు. ప్రైవేటు దవాఖానాలో చూపించుకునేంత డబ్బుల్లేవ్’’ - కంపెల దుర్గక్క. రోగి. పడకలు ఖాళీ లేవట.. గుంటూరు జిల్లాకు చెందిన నాగమణి గత రెండు నెలలుగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతోంది. పది రోజుల కింద వైద్యం కోసం నిమ్స్‌కు వచ్చింది. ఆరోగ్య శ్రీ కార్డులో ఉన్న పలు వైద్య పరీక్షలు చేశారు. కాలేయానికి క్యాన్సర్ వచ్చిందని, శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు నిర్ధరించినా ఇప్పటివరకు ఆస్పత్రిలో చేర్పించుకోలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే పడకలు ఖాళీ లేవని సమాధానమిస్తున్నారు. చేసేదేం లేక రోగుల విశ్రాంతి శాలలో పదిరోజుల నుంచి ఉంటున్నారు. నో అడ్మిషన్ డెంగీ, విష జ్వరాలతో బాధపడుతున్న రోగులతో కరీంనగర్‌లోని ప్రభుత్వాసుపత్రి కిక్కిరిసిపోయింది. తగినన్ని బెడ్స్ లేకపోవడంతో రోగులకు ప్లాస్టిక్ మంచాలే దిక్కయ్యాయి. సెలైన్ ఎక్కించడానికి స్టాండ్లు కూడా లేవు. కిటికీ చువ్వలకే సెలైన్ బాటిళ్లు కట్టారు. ఒక కుటుంబంలో ఇద్దరు వస్తే వారికి ఒకే మంచం మీద చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నా మందులు రాసి పంపుతున్నారే తప్ప.. అడ్మిట్ చేసుకోవడం లేదు. అడిగితే.. ‘బెడ్ ఖాళీ లేదు. ఏం చేయాలే..’ అని చెబుతున్నారు. పరీక్షలు లేవు.. పారాసిటమాలే దిక్కు.. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో మందులకు తీవ్ర కొరత ఉంది. కొత్తగూడెంలోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. రోగులకు సరైన సేవలు అందడం లేదు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ జ్వరాలతో రోగులు బాధపడుతున్నా పారాసిటమాల్ మందుబిళ్లలిచ్చి పంపిస్తున్నారు. దీంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. - సాక్షి, నెట్వర్క్ రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులు ఇవీ.. ఆసుపత్రులు సంఖ్య బోధనాసుపత్రులు 18 ప్రసూతి ఆసుపత్రులు 05 జిల్లా ఆసుపత్రులు 10 ప్రాంతీయ ఆసుపత్రులు 42 సామాజిక ఆరోగ్య కేంద్రాలు 115 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 740 ఆరోగ్య ఉప కేంద్రాలు 4,905 ప్రత్యేక నవజాత సంరక్షణ కేంద్రాలు 18 నవజాత స్థిరీకరణ కేంద్రాలు 61 నవజాత సంరక్షణ కేంద్రాలు 587 పోషకాహార పునరావాస కేంద్రాలు 13 అన్ని ఆసుపత్రుల్లో పడకల సంఖ్య 17,239 కదులుదాం.. కదిలిద్దాం.. సర్కారీ, కార్పొరేట్ వైద్యంలో మీకెదురైన చేదు అనుభవాలను.. మీరు చూసిన మంచి డాక్టర్ల గురించి ‘సాక్షి’తో పంచుకోండి. వైద్య దుస్థితిని మార్చడానికి సూచనలు కూడా తెలియజేయండి. వీటిని ప్రచురించటం ద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశమిద్దాం. మీ అనుభవాలు, ఆలోచనలను ఈమెయిల్స్, లేఖల ద్వారా ‘సాక్షి’కి పంపేటపుడు... మీ పేరు, మీకు చికిత్స చేసిన ఆసుపత్రి లేదా డాక్టరు పూర్తి పేరును, మొబైల్ నంబర్లను తప్పనిసరిగా తెలియజేయండి. మీ పేరు రహస్యంగా ఉంచాలని భావిస్తే అది కూడా రాయండి. లేఖలు, మెయిల్ పంపాల్సిన చిరునామా: ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 sakshihealth15@gmail.com -
కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి వద్ద పేలుడు
వృద్ధుడికి తీవ్రగాయాలు కరీంనగర్ క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద గురువారం మధ్యాహ్నం పేలుడు జరిగింది. ప్రభుత్వాసుపత్రిని ఆనుకుని కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనం ముందు డ్రైనేజీ వద్ద తిమ్మాపూర్ మండలం మొగిలి పాలెం గ్రామానికి చెందిన దుద్దెన దుర్గయ్య(70) పాత వస్తువులు ఏరుకుంటున్నాడు. మెడికల్ కాలేజీ మెయిన్ గేట్ వద్ద ఒక ప్లాస్టిక్ క్యాన్ కనిపించగా దానిని తీయడంతో అది ఒక్కసారిగా భారీశబ్దంతో పేలింది. ప్రమాదంలో దుర్గయ్యకు ముఖం, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ఈ సమాచారంతో ఓఎస్డీ సుబ్బారాయుడు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పేలుడుకు అనుమానాస్పద పదార్థం ఉంచిన ప్లాస్టిక్ క్యాన్ చిన్న, చిన్న ముక్కలై సుమారు 300 మీటర్ల వరకు ఎగిరిపడ్డాయి. దుర్గయ్య మురుగు కాల్వపై ఉండడంతో పేలుడు తీవ్రత కాల్వపై ఉన్న సిమెంట్ బిళ్లపై పడింది. విగ్రహాల తయారీలో వాడే రసాయనం వల్లే పేలుడు సంభవించిందని కరీంనగర్ డీఎస్పీ రామారావు పేర్కొన్నారు. అయితే ఆ ప్రాంతంలో విగ్రహాల తయారీ పరిశ్రమలేవీ లేవు. పేలుడు జరిగిన ప్రదేశంలో చెత్తాచెదా రం కూడా లేదు. మరి ఎందుకు క్యాన్ అక్కడ పడవేశారనేది తేలాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ పరిశీలించారు. ప్రజలు భయూం దోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్పీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. -
'ఆ పేలుడుకు కారణం రసాయనాలే'
కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఒక చెత్తకుండీ వద్ద పేలుడుకు గల కారణాన్ని పోలీసులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికతో ఈ విషయం నిర్ధారణ అయింది. విగ్రహాల తయారీకి ఉపయోగపడే ప్లాస్టో పారిస్ రసాయనాల కలయికే కారణమని ఎస్పీ జోయల్ డేవిస్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ పేలుడుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు ఎస్పీ జోయల్ తెలిపారు. కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఒక చెత్తకుండీ వద్ద పేలుడు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పేలుడు ధాటికి ఒక ప్లాస్టిక్ టిన్ను తునాతునకలైపోయింది. దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో అక్కడ చెత్త ఏరుకునే దుర్గయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలకు, చేతులకు గాయాలయ్యాయి. పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. -
ప్రభుత్వాస్పత్రి వద్ద పేలుడు కలకలం
-
ఆయువు తీసిన అన్నంముద్ద
ధర్మపురి, న్యూస్‌లైన్: ప్రేమతో తినిపించిన గోరుముద్దలు బాలుడి నిండుప్రాణం తీశాయి. అప్పటివరకు తల్లిదండ్రుల ఒడిలో అల్లారుముద్దుగా ఆటలాడుకొన్న ఆ చిన్నారికి క్షణాల్లో నూరేళ్లు నిండాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని తోట్లవాడకు చెందిన రాచకొండ శ్రీనివాస్-మనీష దంపతులకు కుమారులు మణిశేఖర్(5), శ్రీహర్షత్(8నెలలు) సంతానం. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం శ్రీహర్షత్‌కు గోరుముద్దలు తినిపిస్తుండగా, గొంతులో ముద్ద అడ్డుపడి బాలుడికి ఊపిరాడలేదు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి ఊపిరితిత్తుల్లోకి ముద్ద వెళ్లి ఊపిరాడక మృతిచెంది ఉంటాడని వైద్యులు తెలిపారు.