kamalamma
-
కడ చూపునకు రాని కొడుకు.. చందాలతో..
చిత్తూరు, పలమనేరు: ‘నవమాసాలు మోశావు పిల్లలను.. బతుకంతా మోశావు బాధలను.. ఇన్ని మోసినా నిన్ను మోసేవాళ్లు లేక వెళుతున్నావు. కడుపు చించుకు పుట్టిందొకరు.. కాటికి నిన్ను చేర్చదొకరు... ఎవరికి ఎవరు సొంతము.. ఎంతవరకీ బంధమూ.’’ అంటూ సినీ రచయిత రాసిన గీతం పచ్చినిజం. ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చి.. పెంచి పెద్దచేసి..పెళ్లిళ్లు చేసిన తల్లి అనాథలా కన్నుమూసింది. చివరకు స్థానికులు చందాలేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయవిచారకర సంఘటన మంగళవారం పలమనేరులో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ నాగరాజు, స్థానికులు కథనం మేరకు.. పలమనేరు సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన లేట్ రామచంద్రప్ప భార్య కమలమ్మ(80)కి ముగ్గురు కుమారులు. పట్టణంలో మురుకులు అమ్ముకుంటూ కష్టపడి వారిని పెంచి, పెద్ద చేసి, పెళ్లి చేసింది. వారిలో ఇద్దరు కుమారులు మృతి చెందారు. పెద్దకుమారుడి భార్య (కోడలు) వద్ద మొన్నటిదాకా ఉండింది. ఆపై ఏమి జరిగిందో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనారోగ్యం పాలై స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద రాగి చెట్టు కిందకు పదిరోజుల క్రితం చేరింది. అక్కడున్న సిబ్బంది ఆమెను అనాథగా భావించి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. మృతదేహాన్ని ఎవరికి అప్పగించాలో తెలియక ఆస్పత్రి సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు విచారించి పెద్దకోడలికి చెప్పారు. తల్లి చనిపోయిందని తిరుపతిలో ఉంటున్న చిన్న కుమారుడికి స్థానికులు ఫోన్ చేసినా వారు పట్టించుకోలేదు. ఓవైపు సమయం మించిపోతుండడంతో సొంత మనుషులు తీసుకెళ్లకుంటే మున్సిపల్ వారిచే అంతిమసంస్కారాలు చేయిస్తామంటూ పోలీసులు సిద్ధమయ్యారు. ఆపై స్పందించిన ఆమె మనవడు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. స్పందించిన స్థానికులు ఇన్నాళ్లు తమ మధ్యన ఉన్న ముసలావిడ చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు సొంత మనుషులు వెనుకాడడం చూసిన స్థానికులు స్పందించారు. రూ.4 వేల దాకా చందాలేసుకుని కమలమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. శవం దుర్వాసన రావడంతో ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానానికి తీసుకెళ్లి అక్కడే మనవడు తలకొరికి పెట్టగా అంతిమ సంస్కారాలను కానిచ్చారు. -
అమ్మకు అండగా నిలవండి..
- కేటీఆర్‌ను కదిలించిన కమలమ్మ దీనగాథ - మంత్రి ట్విట్టర్లో ‘సాక్షి’ కథనం సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన సామల కమలమ్మ(85) దీన గాథపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కమలమ్మకు ఐదుగురు కుమారులు.. ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. నిలువ నీడలేక.. కుమారుల నిర్లక్ష్యానికి గురైంది. ఈ సంఘటనపై ‘అమ్మను గెంటేశారు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి కె. తారక రామారావు స్పందించారు. ‘సాక్షి’ కథనాన్ని తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆమెకు అండగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఫోన్ చేసి ఆదేశించారు. డీఆర్వో జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ వెంటనే కమలమ్మతో మాట్లాడి ఆమెతో ఫిర్యాదు స్వీకరించారు. అమ్మను గెంటేశారు.. ఆమె కుమారులు ఐదుగురికీ సోమవారం నోటీసులు జారీ చేశారు. కమలమ్మతో జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యూవో) సరస్వతి మాట్లాడారు. మూడో కుమారుడు శ్రీనివాస్ వద్ద కమలమ్మ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్ఐ రాజేంద్రప్రసాద్ కమలమ్మ ఇంటికి వెళ్లి పండ్లు అందించారు. భీవండిలో ఉండే కుమారుడు రమేశ్‌తో రెవెన్యూ అధికారులు ఫోన్లో మాట్లాడా రు. బుధవారం సిరిసిల్లకు వచ్చేందుకు రమేశ్ అంగీకరించాడు. జిల్లా అధికారుల సమక్షంలో కమలమ్మ కొడుకులకు కౌన్సెలింగ్ నిర్వహించి.. ఆమెకు నీడ కల్పించేలా చర్యలు తీసుకుంటామని డీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్ తెలిపారు. కన్నతల్లిని పోషించకుంటే కొడుకులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా, ఐదుగురు కొడుకులతోపాటు తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని, ఎవరూ సాదకున్నా సచ్చేంత వరకు తానే వండుకుని తింటానని కమలమ్మ తెలిపింది. -
'10 రోజుల్లో భూముల రికార్డులు అందజేయాలి'
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో దళితుల పట్ల వివక్షతపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ విచారణ చేపట్టారు. ల్యాండ్ పూలింగ్, లంక అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులను 10 రోజుల్లోగా అందజేయాలని సీఆర్డీఏ కమిషన్ శ్రీధర్, గుంటూర్ జేసీ శుక్లాలను కమలమ్మ ఆదేశించారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, గుంటూర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శుక్లా హాజరుకాగా, హాజరుకాని రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్ అదికారులపై కమలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతులపై ఎందుకు వివక్షత చూపుతున్నారంటూ అధికారులను ఆమె ప్రశ్నించారు. కమిషన్ సభ్యురాలు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేదని సమాచారం. ప్రజల కోసం రాజధాని నిర్మించాలని, అప్పుడే అది ప్రజా రాజధాని అవుతుందని అధికారులకు కమలమ్మ సూచించారు. -
'10 రోజుల్లో భూముల రికార్డులు అందజేయాలి'
-
బుద్వేల్‌లో మహిళ హత్య
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ గ్రామంలోని కల్లు కాంపౌండ్ వద్ద మంగళవారం వేకువజామున కమలమ్మ అనే మహిళను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. బీరు సీసాతో పొడిచి ఆపై బండరాయితో తలపై మోది హతమార్చారు. కల్లు కాంపౌండ్ వద్ద కమలమ్మ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కమలమ్మ భర్త బుచ్చిరాములుపై అనుమానంతో అతనిని అదుపులోనికి తీసుకున్నారు. కమలమ్మ తన ఇద్దరు పిల్లలతో గత కొంతకాలంగా భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. భర్తే హతమార్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కలెక్టరమ్మా... న్యాయం చేయండి
హన్మకొండ అర్బన్ : పాలకుర్తిలో ఇరవై ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూమికి సంబంధించి పట్టాపాస్ బుక్కులు రద్దు చేయడంతో పాటు తమపై ఎర్రవెల్లి రంగారావు, వీరమనేని లక్ష్మణ్రావులే దాడిచేసి కొట్టారని కమలమ్మ వాపోయారు. ఈ సందర్భంగా ఆమె గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ కరుణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కమలమ్మ మాట్లాడుతూ రంగారావు, లక్ష్మణ్‌రావు దాడితో తన భర్త ముస్కు అంజయ్య క్రిమి సంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఇకనైనా తమ భూమికి సంబంధించి పాస్ బుక్కులు ఇప్పించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కమలమ్మ కోరారు. -
ఎస్సీ హక్కుల పరిరక్షణే ధ్యేయం
– సమర్థవంతమైన పాలనతోనే ప్రజల్లో నమ్మకం – జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు పీఎం కమలమ్మ కర్నూలు(అర్బన్): షెడ్యూల్డు కులాల ప్రజల హక్కుల పరిరక్షణే కమిషన్ ధ్యేయమని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు పీఎం కమలమ్మ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఎస్సీ సంఘాల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అనంతరం మధ్నాహం జిల్లా అధికారులతో అట్రాసిటీ కేసులు, భూసమస్యలు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వ్యయం తదితర అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ సీ హరికిరణ్, ఎస్పీ ఆకె రవికష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలమ్మ మాట్లాడుతూ వర్తమాన, భవిష్యత్ కాలాలకు అనుగుణంగా డా.బీఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని, అందులోనే ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ కమిషన్‌ను ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జీఓలు, చట్టాలను జిల్లా అధికారులు సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడుతుందన్నారు. జిల్లా యూనిట్‌గా జిల్లా అధికారులు మాత్రం పనిచేస్తే సరిపోదని, క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు కూడా విధులు సక్రమంగా నిర్వహిస్తే ప్రజల ఇబ్బందులను తొలగించిన వారవుతారన్నారు. ఉద్యోగానికి కొంత మానవత్వాన్ని కూడా జోడిస్తే పాలన సజావుగా సాగుతుందన్నారు. వినతులపై పూర్తి స్థాయి పరిశీలన ... వివిధ సమస్యలపై తమకు 200కు పైగా వినతి పత్రాలు అందాయని, వాటన్నింటిని పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. ఇక్కడే పరిష్కారమయ్యే వాటిని మినహాయించి మిగిలినవాటిపై పరిశీలన జరిపి 15రోజుల్లో న్యాయం చేస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో 2010 నుంచి 2016 వరకు నమోదైన అట్రాసిటీ కేసులు, వాటిలో చార్జిషీట్ ఓపెన్ చేసినవి, రిజక్ట్ అయినవి తదితర వివరాలను ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు మురళీధర్, వినోదర్‌కుమార్ ద్వారా తెలుసుకున్నారు. ఇటీవల జంట హత్యలు జరిగిన ఉప్పలూరు ఘటనపై ఆరా తీశారు. బాధితులకు పరిహారం, చేపట్టిన చర్యలపై ప్రశ్నించారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు పరిహారం మంజూరు చేశామని జేసీ హరికిరణ్ సమాధానమిచ్చారు. సబ్‌ప్లాన్ నిధుల దుర్వినియోగం ... దేవనకొండ మండలంలో సబ్‌ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీల్లో అభివద్ధి పనులు చేపట్టకుండా ఇతర కాలనీల్లో పనులు చేపడుతున్నారని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సమావేశం దష్టికి తీసుకువచ్చారు. విషయంపై కమిషన్ సభ్యురాలు కమలమ్మ అసహనం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాన్ బ్యాకింగ్ పథకం కింద 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సహాయాన్ని వెంటనే లబిధదారులకు అందించాలని ఈడీ వీర ఓబులును ఆదేశించారు. -
వీల్‌చైర్‌లో.. పొట్టచుట్టూ బంగారంతో బామ్మ!
దుబాయ్ నుంచి రూ.1.27 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళను బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ)లో అధికారులు అరెస్టుచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... కడపకు చెందిన 52 ఏళ్ల కమలమ్మ దుబాయ్ నుంచి తెల్లవారుజామున కేఐఏ చేరుకుంది. వీల్ చైర్లో కూర్చొని అనుమానాస్పదంగా తిరుగుతుండగా గమనించిన తనిఖీ అధికారులు ఆమె శరీరాన్ని స్కానింగ్ చేశారు. పొట్ట చుట్టూ కాటన్లో చుట్టిన 38 బంగారు బిస్కెట్ల ఉన్నట్లు గమనించారు. మొత్తం బిస్కెట్ల బరువు 4.4 కిలోలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ బంగారం విలువ మార్కెట్లో రూ.1.27 కోట్లుగా ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. అయితే ఈ బంగారానికి సంబంధించి సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో కమలమ్మను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెను ఈనెల 29 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కమలమ్మ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరి అక్కడ ఓ వ్యక్తికి సదరు బంగారు బిస్కెట్లు అందజేయాల్సి ఉంది. చివరి క్షణంలో ప్రణాళికలో మార్పు రావడంతో నిందితురాలు బెంగళూరుకు చేరుకుని ఆ వ్యక్తి కోసం ఎదురుచూస్తూ అధికారులకు దొరికిపోయింది. ఆరునెలల క్రితం తాను ఉపాధి వెదుక్కొంటూ దుబాయ్ వెళ్లానని కమలమ్మ విచారణలో అధికారులకు తెలిపింది. సదరు బిస్కెట్లను ప్రణాళిక ప్రకారం ఆ వ్యక్తికి అందజేస్తే రూ.4.5 లక్షలు అందజేసేవారని కమలమ్మ విచారణలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. -
క్రేన్ ఢీకొని వృద్ధురాలు మృతి
హైదరాబాద్: కుషాయిగూడలో మంగళవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. క్రేన్ ఢీకొనడంతో వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందింది. సాయినగర్‌కు చెందిన కమలమ్మ(65) రోడ్డు దాటుతుండగా క్రేన్ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్క పెట్టిన ఆవకాయ ఇష్టం
పెరుగన్నంలోకి ఆవకాయలేందే ముద్ద తిగదు. అంతేకాదు అటుకులు, మరమరాల్లో కూడా మామిడి చట్నీ కలుపుకొని తినడం ఇష్టం. యేడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి కన్నా లేత మామిడికాయను చిన్న ముక్కముక్కలుగా తరిగి పెట్టే పచ్చడంటే ప్రాణం. మామిడికాయ చట్నీ పెట్టడంలో మా అక్కయ్య భాగ్యమ్మ తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది. మొన్నే పెట్టేసిందట.. వచ్చి తీసుకెళ్లు అంది. టైమ్‌లేక వెళ్లలేదు. అమ్మ (కమలమ్మ) అయితే పెట్టి పంపించేసింది. అక్క పెట్టిన పచ్చడీ తెచ్చుకోవాలి. కొత్త పచ్చడి వచ్చిందంటే ఓ వారం దాకా దాంతోనే భోజనం. ఎన్ని అద్భుతమైన కూరలున్నా మామిడికాయ పచ్చడి ముందు దిగదిడుపే! - సంపూర్ణేశ్ బాబు -
కమలమ్మకు శ్రద్ధాంజలి
సంస్థాన్ నారాయణపురం : మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తల్లి కమలమ్మ దశదినకర్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. దశదినకర్మ సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెంలో ఆదివారం జరిగిం ది. కమలమ్మ ఈ నెల 5వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కేసీఆర్.. మంత్రులు ఈటెల రాజేందర్, గుంటకండ్ల జగదీష్‌రెడ్డిలతో కలిసి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన లింగవారిగూడానికి వచ్చారు. కమలమ్మ సమాధి వద్ద చిత్రపటానికి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతకుముందు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిశోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కలెక్టర్ టి.చిరంజీవులు, ఐజీలు శశిధర్‌రెడ్డి, గంగాధర్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు, జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా,ఆర్డీఓ వెంకటాచారి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మేరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి గంగిడి మనోహర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, దుబ్బాక నర్సింహారెడ్డి, మన్నె గోవర్దన్‌రెడ్డి, మాలె శరణ్యారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు హాజరై నివాళులర్పించారు. 35నిమిషాల పాటు ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన 1.40గంటలకు లింగవారిగూడానికి వచ్చారు. దాదాపు 35నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. మధ్యాహ్న భోజనం అక్కడే చేశారు. మధ్యాహ్నం 2.15గంటలకు హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు. గుడిమల్కాపురం గ్రామంలో స్థానికులను చూసి ఆగారు. దాదాపు 20నిమిషాల పాటు గ్రామస్తులతో మాట్లాడి వెళ్లారు. -
అన్యాయాలను సహించం
ఇందూరు :అగ్రవర్ణాలు వివక్షతో దళితులపై దాడులు చేస్తే, హింసలకు గురిచేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు పీఎం కమలమ్మ స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిం చి వారికి మరోధైర్యాన్ని ఇస్తామన్నారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆమె ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఎస్సీ సబ్‌ప్లాన్, దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూముల ఆక్రమణ, ఇతర అంశాలపై జిల్లా అధికారులు, దళిత, గిరిజన సంఘాల నాయకులతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష జరిపారు. తొలి సమావేశం ఇక్కడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా ఇక్కడే సమావేశం నిర్వహిస్తున్నామని కమలమ్మ తెలి పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు గడుస్తు న్నా దళితులు ఇంకా అన్యాయానికి గురవుతూనే ఉ న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షను చూపినవారిని శిక్షించి, బాధితులకు న్యాయం చేయడానికి ఏర్పడిన జాతీయ ఎస్సీ కమిషన్ మరింత చురుకుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పోలీ స్, రెవెన్యూ శాఖల నుంచి దళితులు ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. దళితుల కోసం యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసిందని, చ ట్టం చేసినప్పటికీ దానిని అమలు చేయడంలో లోపాలున్నాయన్నారు. వాటిని సవరించుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులు నిజాయితీగా పని చేస్తే ఫలితం ఉంటుందన్నారు. దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు. సొంత భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం దళితుల వివరాలను తనకు అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశిం చారు. దళితులపై గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలను అరికట్టే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి దళితులకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు అందిన వెంటనే నిందితులను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసు అధికారులను కమలమ్మ ఆదేశిం చారు. జిల్లాలో 94 అట్రాసిటీ కేసులు నమోదు కాగా, నిజామాబాద్ డివిజన్లో 11, ఆర్మూర్‌లో 9, బోధన్ 6, కామారెడ్డిలో 7, మొత్తం 33 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని త్వరగా పరిష్కరించాలని అ ధికారులను ఆదేశించారు. డీఎఫ్ఓ గంగయ్య హత్య కే సులో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాలను వారి కుటుంబ సభ్యులకు అంద జేయాలని సూచించారు. వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గంగామణి అనే మహిళ సమావేశంలో కంట తడిపెట్టింది. తన వ్యవసాయ భూమిలోంచి అక్రమంగా దా రి నిర్మించిన వ్యక్తిని ఎదురించినందుకు తనను దూ షించి అసభ్యకరంగా వ్యవహరించినా తనకు న్యా యం జరగలేదని వాపోయింది. ఇందుకు స్పందించి న కమిషన్ సభ్యురాలు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. 14 రో జులలో దీనిపై పూర్తి నివేదికను అందించాలన్నారు. సెప్టెంబర్ రెండున హియరింగ్ నిర్వహిస్తామన్నారు. దళిత సంఘాల నాయకులు ఇచ్చిన పలు ఫిర్యాదు లు, వినతులు స్వీకరించిన ఆమె వాటిని పరిష్కరిస్తామని హామినిచ్చారు. సమావేశంలో కలెక్టర్ రొనాల్డ్ రాస్, అదనపు ఎస్పీ పాండునాయక్, రాష్ట్ర స్థాయి అ ధికారులు హన్మంత్‌రావు, అజయ్‌కుమార్, అధికారు లు, దళిత, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కమలమ్మా.. ఇదేందమ్మా..
సాక్షి, గుంటూరు: మంగళగిరి పట్టణానికి చెందిన కాండ్రు కమల.. ప్రజాప్రతినిధిగా సుమారు పదేళ్ల అనుభవం మూటగట్టుకున్నారు. మున్సిపల్ చైర్మన్‌గా ఐదేళ్లు.. ఎమ్మెల్యేగా ఐదేళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నా, మంగళగిరి వాసులకు ఒరగబెట్టిందేమీ లేదనే విమర్శలు వినవస్తున్నాయి. విజయవాడ, గుంటూరు నగరాలకు మధ్య ప్రాధాన్యతను సంతరించుకున్న మంగళగిరి పట్టణాభివృద్ధికి వివిధ అవకాశాలు ఉన్నా.. ప్రజాప్రతినిధిగా ఏమాత్రం వినియోగించుకోలేకపోయారనే విమర్శలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. సొంత పనులకు ప్రాధాన్యమిచ్చారే తప్ప ప్రజాసమస్యలను పట్టించుకోలేదన్న అపవాదును మూటకట్టుకున్నారు. కనీసం తన సామాజికవర్గం చేనేతల బతుకుదెరువుపై కూడా భరోసా కల్పించలేకపోయారనే విమర్శలు లేకపోలేదు. మంగళగిరి మున్సిపల్ తొలి మహిళా చైర్‌పర్సన్‌గా కమల గుర్తింపుపొందినా.. తన హయాం(2000-05)లో చెప్పుకోతగ్గ ప్రగతి సాధించలేకపోయారని చెప్పవచ్చు. చైర్‌పర్సన్‌గా పదవీ కాలం ముగిశాక.. ఇంటికే పరిమితమైనా.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి మంత్రి మురుగుడు హనుమంతరావును కాదని.. అనూహ్యంగా కమలకు అసెంబ్లీ టెకెట్ కేటాయించి, ఆమె గెలుపునకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిచేశారు. తదనంతర పరిణామాల్లో ప్రజాప్రతినిధిగా కమల తీరు నానాటికి తీసికట్టు అన్న చందంగా మారింది. మంగళగిరి అంటే చేనేత.. చేనేత అంటే మంగళగిరి.. మంగళగిరి పేరు చెబితే నేతన్న గుర్తుకు వస్తాడు. అలాంటి మంగళగిరిలో నేడు చేనేత కార్మికులు దుర్భర జీవనమే గడుపుతున్నారు. మంగళగిరిలో 30 ఏళ్ల కిందట 12 వేల చేనేత మగ్గాలు ఉంటే.. ప్రస్తుతం రెండు వేల మగ్గాలు కనాకష్టంగా నడుస్తున్నాయి. నేతన్న పనిలో అనుభవంలోకొచ్చాక మొదటిసారి మేలుపొందింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభుత్వంలోనేనని ఇక్కడ చేనేత కార్మికులు సగర్వంగా చెబుతున్నారు. 50 ఏళ్లు నిండిన నేత కార్మికులకు నెలకు రూ.200 పింఛన్ ఇచ్చి మూడు పూటలా అన్నం పెట్టి మహానుభావుడయ్యాడని చెమర్చిన కళ్లతో గుర్తుకు తెచ్చుకుంటున్నారు. క్రెడిట్ లోన్లు బ్యాంకుల ద్వారా ఇవ్వడం.. చేనేత రుణాల మాఫీని వై.ఎస్.ప్రకటించి, అమలుచేసినా.. ఆయన చనిపోయిన తర్వాత పాలకులు పట్టించుకోకపోగా, స్థానిక నాయకులు మొహంచాటేశారు. మంగళగిరిలోనే 500మంది పద్మశాలి కుటుంబాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ గృహకల్ప ఇళ్లు కట్టించారు. అప్పట్లో నేతమగ్గాలకు స్థలం అడిగితే.. షెడ్లు కట్టిస్తామని స్థలం కేటాయించారు. అయితే ఎమ్మెల్యే కమల ఈ షెడ్ల నిర్మాణాన్ని పట్టించుకున్న పాపానపోలేదు. మున్సిపల్ చైర్‌పర్మన్‌గా ఉన్నప్పుడు ఆటోనగర్ వెనుక వైపు చేనేత పార్కు నిర్మిస్తామని అప్పటి ప్రభుత్వం శిలాఫలకం ఏర్పాటు చేయగా.. దీని సాధన లోనూ కమల కృషి శూన్యం. హామీలపైనా దృష్టి సారించని వైనం గుంటూరు, కృష్ణా జిల్లాలకు అనువుగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుంటూరు పర్యటనలో ప్రకటించారు. ఈ హామీపై ఎమ్మెల్యే కమల కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం పరిశీలనాంశం. పట్టణంలో ప్రధాన సమస్యగా పరిణమించిన డ్రైనేజీ సమస్యను అసలు పట్టించుకోలేదు. పట్టణంలో మురుగు సమస్యను పరిష్కరించేందుకు రూ.30 కోట్ల జెఎన్ఎన్యూఆర్ఎం నిధులతో ప్రారంభించిన మురుగు కాలువల నిర్మాణం అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఆక్రమణదారులకు ఎమ్మెల్యే కమల కొమ్ముకాశారనే ఆరోపణలు లేకపోలేదు. కేంద్రప్రభుత్వ నిధులు జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారు. బలహీనవర్గాల ప్రజలకు ఆర్టీసీ డిపో రోడ్డులో నిర్మించిన రాజీవ్ గృహకల్ప పథకంలో కేవలం 504 మందికే నివాసాలు కేటాయించారు. మిగిలిన 510 మందికి రెండో దశలో ఇళ్లు నిర్మిస్తామని చెప్పినా నేటివరకు ఆచరణకు నోచుకోలేదు. ఇక రాజీవ్ స్వగృహ పథకంలో దరఖాస్తు చేసుకున్న ఆరు వేల మందికి ఇప్పటి వరకు నగదు చెల్లించలేదు. ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. గృహ నిర్మాణానికి స్థల సమస్య పేరుతో కాలయాపన జరుగుతూనే వుంది. నీరో తరహా పాలనతో పట్టణవాసులు విసిగిపోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎమ్మెల్యే కమలమ్మ-శివరామకృష్ణ వర్గీయుల మధ్య దాడి
వైఎస్సార్ జిల్లా:ఓ స్థల వివాదానాకి సంబంధించి ఎమ్మెల్యే కమలమ్మ, శివరామకృష్ణ అనుచరులు పరస్పరం దాడికి దిగిన ఘటన పోరుమామిళ్లలో మంగళవారం చోటు చేసుకుంది. ఓ స్థల వివాదం ఎంతకీ పరిష్కారానికి రాకపోవడంతో శివరామకృష్ణ వర్గీయులు ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో వారు కడప నుంచి రెండు లారీలలో పోరుమామిళ్లకు బయలుదేరారు. అనంతరం వివాదం పరిష్కారంలో తొలుత వాగ్వియుద్ధం చోటు చేసుకుంది. అక్కడ ఎమ్మెల్యే కమలమ్మ అనుచరులు కూడా వారితో వాగ్విదానికి దిగడంతో ఘర్షణ మరింత రాజుకుంది. దీంతో ఇరువర్గాల అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈఘటనలో కడప నుంచి వెళ్లిన నలుగురికి తీవ్ర గాయాలైయ్యాయి.