breaking news
Kailash Mansarovar
-
మానస సరోవర్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు
డెహ్రడూన్ : ఈ ఏడాది భారత్‌లోని లిపులేఖ్ పాస్ గుండా రికార్డు స్థాయిలో కైలాస్ మానస సరోవర్ యాత్రకు భక్తులు తరలి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది సిక్కింలోని నాథూలా పాస్ గుండా టిబెట్ మీదుగా భారతీయ భక్తులు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళతారు. అయితే ఈ ఏడాది డోక్లాం సమస్యతో చైనా నాథూలా పాస్ మూసివేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్నామ్నాయంగా ఉత్తారఖండ్‌లోని లిపులేఖ్ పాస్ గుండా భక్తులను యాత్రకు అనుమతించింది. యాత్ర గడుపు సమీపిస్తుండడంతో శుక్రవారం 33 మందితో మానస సరోవర్ యాత్రకు చివరి బృందం లిపులేఖ్ పాస్‌గుండా బయలుదేరి వెళ్లింది. యాత్ర ముగించుకుని ఈ బృందం సెప్టెంబర్ 11న ఢిల్లీ చేరుతుందని అధికారులు తెలిపారు. లిపులేఖ్ పాస్ గుండా ఈ ఏడాది మొత్తం 919 మంది భక్తులు సురక్షింతగా కైలాస్ మానస సరోవర్ యాత్ర చేసినట్లు ఉత్తరాఖండ్ అధికారులు చెబుతున్నారు. -
మోదీ అమెరికా టూర్: డ్రాగన్ కుతకుత!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో డ్రాగన్ మరోసారి బుసలు కొట్టింది. భారత్ చైనా పట్ల అహంకారం ప్రదర్శించేందుకు అనువైన సమయం ఇది కాదని, అమెరికా భారత్‌కు ఇస్తున్న వ్యూహాత్మక మద్దతు వట్టి కల్పితమేనని చిందులు తొక్కింది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణకు దిగే సాహసం భారత్ చేయకూడదని హెచ్చరించింది. ప్రధాని మోదీ తొలిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక భేటీ జరిపిన నేపథ్యంలో ఈమేరకు విషం చిమ్ముతూ చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ వ్యాసాన్ని ప్రచురించింది. ‘సరిహద్దుల విషయంలో చైనాతో భారత్ ఘర్షణకు దిగజాలదు. జాతీయత శక్తి విషయంలో చైనా కన్నా భారత్ ఎంతో వెనుకబడి ఉంది. అమెరికా ఇస్తుందనుకున్న వ్యూహాత్మక మద్దతు వట్టి కల్పితమే. చైనాపై అహంకారం ప్రదర్శించేందుకు భారత్‌కు ఇది అనువైన సమయం కాదు’ అని ఈ వ్యాసం పేర్కొంది. భారత్‌తో ఘర్షణకు దిగాలన్న కోరిక చైనాకు లేదని చెప్పుకొచ్చింది. ఇప్పటికే భారతీయులు పవిత్రంగా భావించే కైలాస్ మానస సరోవర్ యాత్ర మార్గాన్ని మూసివేసి చైనా తన వైఖరిని చెప్పకనే చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారత దళాలు చైనా భూభాగంలోకి వచ్చాయని నిందిస్తూ నిరసన వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో తాజా ఘర్షణాత్మక వాతావరణానికి చూపే పరిష్కారంపైనే భవిష్యత్తులో భారతీయులను మానస సరోవర్ యాత్రకు అనుమతించాలా లేదా అనేది ఆధారపడి ఉంటుందని చైనా మంగళవారం తెలిపింది. అగ్రరాజ్యం అమెరికాతో భారత్ సన్నిహిత సంబంధాలు నెరుపుతుండటాన్ని తట్టుకోలేకనే చైనా ఈ విధంగా వ్యవహరిస్తున్నదని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
పెట్రేగిన చైనా.. మానస సరోవర్ మార్గం బంద్!
భారతీయులు పవిత్రంగా భావించే కైలాస్ మానస సరోవర్ యాత్ర మార్గాన్ని మూసివేసిన విషయాన్ని చైనా బహాటంగా ఒప్పుకొంది. సిక్కింలోని సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల బాహాబాహి, భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ.. కైలాస్ మానస సరోవర్ యాత్ర మార్గమైన సిక్కింలోని నాథూలా పాస్‌ను మూసివేసినట్టు తెలిపింది. చైనాకు చెందిన పిపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు సిక్కింలోని సరిహద్దుల మీదుగా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి.. భారత సైన్యం బంకర్లను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. డ్రాగన్ సైనికుల దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొన్న భారత సైన్యం వారిని సరిహద్దులోకి రాకుండా అడ్డుకుంది. మానవహారంగా నిలబడి.. డ్రాగన్ సైనికులను వెనుకకు పంపింది. ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణాత్మక పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కైలాస్ మనససరోవర్ యాత్ర మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించినట్టు చైనా చెప్పుకొచ్చింది. సరిహద్దుల్లో ఘర్షణాత్మక పరిస్థితికి భారత సైన్యమే కారణమని డ్రాగన్ సైన్యం నిందించింది. సరిహద్దుల్లోని తమ భూభాగంలో రోడ్డు నిర్మాణం చేపడుతుంటే భారత సైన్యం అడ్డుకొని రెచ్చగొట్టిందని, అందుకే బంకర్ల ధ్వంసం ఘటన జరిగిందని పేర్కొంది. కాగా, నాథులా పాస్‌ను మూసివేసిన విషయం నిజమేనని చైనా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. కైలాస్ మానస సరోవర్ యాత్రకు నాథులా పాస్ రెండో మార్గం. దీనిని 2015లోనే తెరిచారు. ఈ మార్గం ద్వారా ఈ నెల 19-23 తేదీల మధ్య 47 మంది ప్రయాణికులు బయలుదేరారు. కాగా, మరో మార్గమైన ఉత్తరాఖండ్‌లోని లిపుల్‌కేహ్ ద్వారా 1080 మంది ప్రయాణికులు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లారు.