breaking news
Justice KC Bhanu
-
శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
తిరుమల శ్రీవారిని ఆదివారం ఇద్దరు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేసీ భాను ఉదయం నైవేద్య విరామ సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లారు. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తరువాత వకుళమాతదేవిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. న్యాయమూర్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూప్రసాదాలు అందజేశారు. - తిరుమల -
సత్వర న్యాయం అందించడమే లక్ష్యం
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేసీ భాను గుంటూరు లీగల్: కక్షిదారులకు సత్వర న్యాయం అందించే విధంగా న్యాయమూర్తుల పనితీరు ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్ పోలియో జడ్జి జస్టిస్ కెసీ భాను సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలులో ఆదివారం జిల్లా న్యాయమూర్తుల సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎం రఫీ జిల్లాలోని న్యాయపాలనా తీరును నివేదిక రూపంలో వివరించారు. జిల్లాలో 48,733 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. గతేడాది డిసెంబర్ నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 15,120 కేసులు నమోదు కాగా 11,272 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సివిల్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. జస్టిస్ భాను మాట్లాడుతూ న్యాయమూర్తులందరూ హైకోర్టు నిర్దేశించిన సమయపాలనను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కక్షిదారులకు మరింత మెరుగైన న్యాయసేవలు అందించేందుకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం జస్టిస్ భాను జిల్లాలోని కోర్టుల పనితీరును సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లాలోని న్యాయమూర్తులు పాల్గొన్నారు.