breaking news
jasmin
-
మూడో రౌండ్‌కు పావొలిని
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల విభాగం గత ఏడాది రన్నరప్ జాస్మిన్ పావొలిని ఈ సారి కూడా చక్కటి ప్రదర్శనతో దూసుకుపోతోంది. నాలుగో సీడ్ పావొలిని (ఇటలీ) టోర్నమెంట్ మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆమె 6–3, 6–3 స్కోరుతో అజ్లా టాంజొనొవిక్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. ఒక గంటా 21 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 24 విన్నర్స్ కొట్టిన పావొలిని 3 ఏస్‌లు బాదింది. పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ కూడా ముందంజ వేశాడు. అయితే అతనికి రెండో రౌండ్లో కాస్త పోటీ ఎదురైంది. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ (స్పెయిన్) 6–1, 4–6, 6–1, 6–2 స్కోరుతో ఫాబియాన్ మారోజాన్ (హంగేరీ)ని ఓడించాడు. ప్రపంచ 56వ ర్యాంకర్ మారోజాన్ అనూహ్యంగా ఒక సెట్ నెగ్గినా...వెంటనే కోలుకున్న అల్కరాజ్ పైచేయి సాధించాడు. 2 గంటల 9 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. వరల్డ్ నంబర్‌వన్, టాప్ సీడ్ అరైనా సబలెంకా (బెలారస్) కూడా మూడో రౌండ్‌కు చేరింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో సబలెంకా 6–3, 6–1తో జిల్ టీక్‌మన్ (స్విట్జర్లాండ్)ను ఓడించింది.పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ కాస్పర్ రూడ్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. అన్‌సీడెడ్ నూనో బోర్జెస్ (పోర్చుగల్) 2–6, 6–4, 6–1, 6–0తో రూడ్ (నార్వే)ని ఓడించాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) 6–4, 6–0, 6–4తో డేనియల్ గలాన్ (కొలంబియా)పై గెలిచి ముందంజ వేశాడు.మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, నాలుగు సార్లు విజేత ఇగా స్వియాటెక్ మరో టైటిల్ దిశగా ముందడుగు వేసింది. రెండో రౌండ్లో స్వియాటెక్ 6–1, 6–2తో ఎమా రాడుకాను (బ్రిటన్)ను చిత్తు చేసింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌లలో ఎనిమిదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) 6–2, 6–3తో ఎమీలియా అరాంగో (కొలంబియా)పై, 13వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 7–6 (7/4), 7–5తో అనా బొండర్ (హంగేరీ)పై గెలుపొందారు. రిత్విక్ జోడి పరాజయం... గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో తొలి విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరికి మరోసారి నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లోనే రిత్విక్ (భారత్) – నికొలస్ బరింటోస్ (కొలంబియా) జోడి ఓటమిపాలైంది. జాకబ్ ఫియర్లీ (బ్రిటన్) – గాబ్రియెల్ డియాలో (కెనడా) ద్వయం 6–0, 6–2తో రిత్విక్–నికొలస్ జంటను చిత్తు చేసింది. 56 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. మరో వైపు ఇద్దరు భారత ఆటగాళ్లు రోహన్ బొపన్న, యూకీ బాంబ్రీ తమ భాగస్వాములతో కలిసి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. బోపన్న – ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జోడి 7–6 (8/6), 5–7, 6–1 స్కోరుతో రాబర్ట్ క్యాష్ (అమెరికా) – జె ట్రేసీ (అమెరికా)ను ఓడించారు. మరో మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్) – రాబర్ట్ గాలొవే (అమెరికా) జంట తొలి రౌండ్లో 6–3, 6–7 (8/10), 6–3 స్కోరుతో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) – హెన్డ్రిక్ జెబెన్స్ (జర్మనీ)పై గెలుపొంది ముందంజ వేసింది. -
టైటిల్ పోరుకు స్వియాటెక్, జాస్మిన్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో టైటిల్ గెలిచేందుకు పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ విజయం దూరంలో నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన స్వియాటెక్ గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 6–2, 6–4తో మూడో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా)పై గెలిచింది. రెండో సెమీఫైనల్లో 12వ సీడ్ జాస్మిన్ పావ్లిని (ఇటలీ) 6–3, 6–1తో రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆండ్రీవాపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 5–7, 6–2, 2–6తో బొలెలీ–వావసోరి (ఇటలీ) జోడీ చేతిలో ఓడింది. -
రేపల్లె, అడవులదీవిలో 144వ సెక్షన్ విధింపు
జాస్మిన్, శ్రీసాయి మృతి ఘటనలతో రేపల్లెలో వేడెక్కిన వాతావరణం ప్రభుత్వాస్పత్రి వద్ద శ్రీసాయి బంధువుల బైఠాయింపు, ఆందోళన జాస్మిన్ సోదరుడు, బంధువును అదుపులోకి తీసుకున్న పోలీసులు రేపల్లె : యువతి జాస్మిన్, యువకుడు వేముల శ్రీసాయి మృతి ఘటనలు రేపల్లె పట్టణంలో ఉద్రిక్త వాతావరణానికి దారితీశాయి. నియోజకవర్గ పరిధిలోని నిజాంపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహ్మదీయపాలేనికి చెందిన షేక్ జాస్మిన్ ఆదివారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, ఆమె మృతికి గరువు గ్రామానికి చెందిన వేముల శ్రీసాయి, జొన్న పవన్‌కుమార్ కారణమని బంధువులు, గ్రామస్తులు చితకబాదడం, ఈ ఘటనలో వేముల శ్రీసాయి అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనలు తీవ్ర సంచలనం కలిగించాయి. వేముల శ్రీసాయిని అన్యాయంగా చంపేశారంటూ అతని కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బైఠాయించి ఆదివారం రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మరోపక్క జాస్మిన్ మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదాలు చెలరేగుతాయన్న ఉద్దేశంతో జాస్మిన్ కుటుంబ సభ్యులను, బంధువులను ప్రభుత్వ వైద్యశాల ఆవరణలోకి పోలీసులు అనుమతించలేదు. ఈ సందర్భంగా పోలీసులకు, వారికి కొద్దిసేపు వాదన జరిగింది. చివరికి జాస్మిన్ కుటుంబ సభ్యులు సర్కిల్ కార్యాలయానికి చేరుకున్నారు. రెండు ఘటనల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో, అడవులదీవి గ్రామంలో 144వ సెక్షన్ విధించారు. ఆదివారం రాత్రి ప్రత్యేక బలగాలను మోహరింపజేశారు. అడుగడుగునా పహారా కాస్తూ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శ్రీసాయి మృతి కేసులో ఇద్దరు అదుపులోకి... జాస్మిన్ను హత్య చేశారనే అనుమానంతో వేముల శ్రీసాయి, జొన్న పవన్‌కుమార్‌లను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనకు సంబంధించి జాస్మిన్ సోదరుడు షాదుల్లా, ఆమె బంధువు గౌస్‌లను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ కేసులో గ్రామంలో మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. హత్య కేసులుగా నమోదు – బాపట్ల డీఎస్పీ మహేష్ జాస్మిన్, శ్రీసాయిల మృతి ఘటనలపై రెండు వేర్వేరు హత్య కేసులు నమోదు చేసి విచారణను వేగవంతం చేసిన ట్లు బాపట్ల డీఎస్పీ మహేష్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాస్మిన్ మృతిపై పలు కోణాల్లో విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. జాస్మిన్ తాను చనిపోతున్నానని వేముల శ్రీసాయికి ఫోన్ చేసిన అంశం నుంచి, వారిద్దరికీ ఉన్న పరిచయం, జాస్మిన్‌కు వివాహం చేసేందుకు పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు అన్నిటిపై విచారిస్తున్నామన్నారు. జాస్మిన్ను శ్రీసాయి, అతని స్నేహితుడు చంపేశారా, వారు వచ్చేసరికే జాస్మిన్ చనిపోయి ఉందా అన్న అంశంపై పూర్తి విచారణ కొనసాగుతున్నట్టు తెలిపారు. ఆమె ఇంట్లో పడి ఉన్న బ్యాట్, బెల్టు ఎవరివన్నదానిపై కూపీ లాగుతున్నామన్నారు. జాస్మిన్ ఇంట్లో పడి ఉన్న రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. జాస్మిన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు అందించే నివేదిక కేసు విచారణకు మరికొంత ఉపకరిస్తుందన్నారు. పోస్టుమార్టం పూర్తి మృతిచెందిన జాస్మిన్, శ్రీసాయిల మృతదేహాలకు రేపల్లె ప్రభుత్వాస్పత్రిలో సోమవారం పోస్టుమార్టం పూర్తిచేశారు. ఇద్దరి మృతదేహాలూ ప్రభుత్వాస్పత్రిలో ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. తొలుత జాస్మిన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, పోలీసుల బందోబస్తుతో మృతదేహాన్ని అడవులదీవి గ్రామానికి తరలించారు. అనంతరం గంటన్నర తరువాత శ్రీసాయి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి పోలీసు బందోబస్తుతో మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. శ్రీసాయి మృతదేహాన్ని గ్రామంలోకి వద్దని శ్రీసాయిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న మహ్మదీయపాలేనికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగే వరకు అక్కడే ఉంచుతామని శ్రీసాయి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు శ్రీసాయి కుటుంబ సభ్యులు, బంధువులకు నచ్చచెప్పి శ్రీసాయి మృతదేహాన్ని గరువు గ్రామంలోని మృతుని స్వగృహానికి తరలించారు. ఈ క్రమంలో సోమవారం చీకటి పడిపోవటంతో శ్రీసాయి అంత్యక్రియలను మంగళవారం నిర్వహించే విధంగా బంధువులు నిర్ణయించుకున్నారు. -
వేటకు రెడీ అయిన శ్రీకాంత్, తరుణ్
శ్రీకాంత్, తరుణ్, మధురిమ, జాస్మిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వేట’. అశోక్ పల్లె దర్శకుడు. పి.శ్వేతాలానా, సి.వరుణ్‌కుమార్ నిర్మాతలు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సంద ర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ‘‘ప్రేమ, భావోద్వేగాల సమ్మేళనంగా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచాడు. శ్రీకాంత్, తరుణ్ కాంబినేషన్లో వచ్చే మాస్ సన్నివేశాలు అలరిస్తాయి. చక్రి సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ’’ అని సమర్పకుడు సి.కల్యాణ్ చెప్పారు. నిజజీవితంలో స్నేహానికి విలువిచ్చే తాను ఇప్పటివరకూ స్నేహంపై ఒక్క పాటను కూడా స్వరపరచలేదని, ఆ అవకాశం ఈ సినిమా ద్వారా లభించిందని చక్రి ఆనందం వెలిబుచ్చారు. వాణిజ్యవిలువల సమ్మిళితం ఈ సినిమా అని, సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందని తరుణ్ చెప్పారు. -
అమ్మను వెదికేందుకని...
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : ఈ చిన్నారుల పేర్లు జాస్మిన్(8), మోనిష(6). గజపతినగరంలో తప్పిపోయి తిరుగుతున్న వీరిని పోలీసుల సమాచారంతో చైల్డ్‌లైన్ సభ్యులు తమ కార్యాలయానికి తీసుకొచ్చారు. తమ అమ్మ కనిపించడం లేదని, ఆమె కోసం వెదుకుతూ వెళ్లామని ఈ చిన్నారులు చెబుతున్నారు. తమది పట్టణంలోని ఖాదర్నగర్ అని తెలిపారు. అంతకుమించి వివరాలు చెప్పలేకపోతున్నారు. గజపతినగరం వైపు వెళ్లి.. అక్కడ నుంచి ఎటువెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న వారి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులకు సమాచారమిచ్చారు. చైల్డ్‌లైన్ సభ్యులు గజపతినగరం చేరుకుని బాలికలిద్దరినీ విజయనగరంలోని కార్యాలయానికి తీసుకొచ్చి, భోజనం పెట్టారు. ఈ చిన్నారుల తరఫు వారు ఎవరైనా వస్తే అప్పగిస్తామని సంస్థ సభ్యులు తెలిపారు.