
ఒక వస్తువు యొక్క విలువ అనేది.. దాని తయారీ, ఉత్పత్తికి కాగల ఖర్చు మీదనే ఆధారపడి ఉంటుందని అనుకుంటాం. కానీ.. చాలా సందర్భాల్లో ఇంకా అనేకానేక కారణాల వల్ల.. విలువ ఏర్పడడం జరుగుతుంది. పైగా విలువ అనేది సాపేక్షికం కూడా.
ఫరెగ్జాంపుల్.. ఒక క్షణం యొక్క విలువ ఎంత అని అడిగితే.. పొద్దస్తమానం టీవీ చూసుకుంటూ, మొబైల్ లో రీల్స్ చూసుకుంటూ గడిపే వాడు.. మిమ్మల్ని చూసి జాలిగా నవ్వుతాడు. ఒక క్షణానికి కూడా విలువ ఉంటుందా? అంటాడు! నా దగ్గర బోలెడు గంటలు ఖాళీగా ఉన్నాయి.. ఏదైనా విలువ కట్టి యివ్వు.. అని కూడా రెట్టిస్తాడు. కానీ.. ఒక ఘోరమైన యాక్సిడెంట్ లో రెప్పపాటులో ప్రాణం పోకుండా తప్పించుకున్న వాడిని అడిగిచూడండి.. ఒక క్షణం యొక్క విలువ ఎంతో చాలా చక్కగా చెప్తాడు.
‘రోమ్ లో బతుకుతున్నప్పుడు.. రోమన్ లాగానే బతుకు’ అని ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. చాలా మందికి ఈ సామెతలోని ఆంతర్యం అర్థం కాదు. మనం ఏ ప్రాంతంలో ఉండదలచుకుంటే, ఏ ప్రాంతానికి వెళ్లదలచుకుంటే.. ఆ ప్రాంత ధర్మాన్ని పాటించడం నేర్చుకోవాలి. ముందుగా.. ఆ ప్రాంతానికి ఉండే ‘ధర్మం’ ఏమిటో తెలుసుకోవాలి! వ్యక్తులకు కొన్ని గుణగణాలు, వ్యక్తిత్వ విశేషాలు ఉన్నట్లుగానే.. ప్రాంతాలకు కూడా కొన్ని గుణగణాలు, నియమనిబంధనలు ఉంటాయి. వాటిని ముందు మనం పాటించాలి. పాటించాలంటే.. ముందుగా అవేమిటో మనం తెలుసుకోవాలి. అలా కాకుండా.. నేను మోనార్క్ ని. నేను ఎవ్వడి మాటా వినను. నాకు తలచిందే చేస్తా.. అని విర్రవీగే పనైతే, అలాంటి వారు తమ ఇల్లుదాటకుండా బతికేయాలి. మరొకరి ఎరీనాలోకి ఎంటర్ కాకూడదు!
మానవ సంబంధాలను కొనసాగించే విషయంలో అతిగొప్ప వ్యక్తిత్వ వికాస లక్షణం ఇది. ఎదుటి వారి అభిప్రాయాల్ని, ఎదుటి వారి అలవాట్లను గౌరవించగలిగితేనే నీకు వారితో మానవసంబంధాలు పదిలంగా ఉంటాయి. మన అలవాట్ల ప్రకారం, మన ఇష్టాయిష్టాల ప్రకారం ఎదుటి వాళ్లు నడుచుకోవాలని కోరుకోవడం వర్కవుట్ కాదు.
అదే మాదిరిగా ఒక పని యొక్క, ఒక వస్తువు యొక్క విలువ కూడా స్థల కాల నియమాలను బట్టి, ప్రాంత ధర్మాన్ని బట్టి మారిపోతుంటుంది. ఒక వాటర్ బాటిల్ ఖరీదు మామూలుగా ఇరవై రూపాయలు కావొచ్చు. కానీ ఎడారిలో దారితప్పిన, కొన్ని రోజులుగా అలమటిస్తున్న ఓ కుబేరుడికి అమ్మితే అతను లక్షల్లో దానికి విలువ కట్టవచ్చు. అంటే ఒకే వస్తువు విలువ మారిపోయినట్టే కదా! ఇలాంటి అనుభవమే..
కేరళకు చెందిన సినీనటి నవ్య నాయర్‌కు ఎక్కువైంది. ఆమె ఇటీవల మెల్ బోర్న్ ప్రయాణం పెట్టుకుంది. బయల్దేరేప్పుడు.. తండ్రి ఓ మూరెడు మల్లెపూలు తెచ్చి ఇచ్చారు. బహుశా ఏ యాభై రూపాయలో పెట్టి తెచ్చి ఉండొచ్చు. అక్కడకు వెళ్లి విమానం దిగిన తరువాత.. వాటిని సిగలో తురుముకోవచ్చునని అనుకున్నదో ఏమో.. మొత్తానికి హ్యాండ్ బ్యాగులో పెట్టుకుంది. తీరా మెల్ బోర్న్ లో దిగిన తర్వాత.. అధికారుల తనిఖీల తర్వాత ఆమెకు అర్థమైన సంగతి ఏంటంటే.. కఠినమైన బయో సెక్యూరిటీ చట్టాలు అమలయ్యే ఆస్ట్రేలియాకు ఇతర దేశాల నుంచి మల్లెపూలు తేవడం నిషేధం. ఆ సంగతి ఆమెకు అర్థమయ్యేలోగా.. ఆమెకు లక్షరూపాయల జరిమానా పడింది. తప్పేదేముంది. అప్పటికి చెల్లించింది గానీ.. ఆ తర్వాత కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన కోసం కొన్న మల్లెపూల ఖరీదు.. మూర లక్షరూపాయలు అంటూ.. తన మీద తనే సెటైరు వేసుకుని అందరినీ నవ్వించింది. నిజమే కదా.. ఆమె మల్లెపూల విలువ లెక్కకడితే లక్షరూపాయలే!
రోమ్ నగరం సామెతను పైన చెప్పుకున్నది అందుకే! మనం ఒక ప్రాంతానికి వెళుతున్నామంటే.. అక్కడి ధర్మాన్ని ముందుగా అర్థం చేసుకుని వెళ్లాలి. లేకపోతే మనం అనుకునే విలువలకు, అక్కడ దక్కే, భారంగా మారే విలువలకు మధ్య వ్యత్యాసం భారీగా ఉండొచ్చు. వ్యక్తి యూనిట్ గా చూసినప్పుడు.. ఎదుటి వారిని గౌరవించడం, ఎదుటి వారి గురించి ముందే తెలుసుకోవడం.. జీవితంలో బంధాలు నిలబడడానికి, విలువలు మారిపోయి నష్టాలు వాటిల్లకుండా ఉండడానికి చాల ముఖ్యం అని అర్థమవుతుంది.
:::ఎం. రాజేశ్వరి