మూడో రౌండ్‌కు పావొలిని | Jasmine Paolini advances to third round of French Open Grand Slam | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్‌కు పావొలిని

May 29 2025 1:23 AM | Updated on May 29 2025 1:23 AM

Jasmine Paolini advances to third round of French Open Grand Slam

అల్‌కరాజ్‌ ముందంజ 

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల విభాగం గత ఏడాది రన్నరప్‌ జాస్మిన్‌ పావొలిని ఈ సారి కూడా చక్కటి ప్రదర్శనతో దూసుకుపోతోంది. నాలుగో సీడ్‌ పావొలిని (ఇటలీ) టోర్నమెంట్‌ మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఆమె 6–3, 6–3 స్కోరుతో అజ్లా టాంజొనొవిక్‌ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. ఒక గంటా 21 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 24 విన్నర్స్‌ కొట్టిన పావొలిని 3 ఏస్‌లు బాదింది. 

పురుషుల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్, రెండో సీడ్‌  కార్లోస్‌ అల్‌కరాజ్‌ కూడా ముందంజ వేశాడు. అయితే అతనికి రెండో రౌండ్‌లో కాస్త పోటీ ఎదురైంది. ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) 6–1, 4–6, 6–1, 6–2 స్కోరుతో ఫాబియాన్‌ మారోజాన్‌ (హంగేరీ)ని ఓడించాడు. ప్రపంచ 56వ ర్యాంకర్‌ మారోజాన్‌ అనూహ్యంగా ఒక సెట్‌ నెగ్గినా...వెంటనే కోలుకున్న అల్‌కరాజ్‌ పైచేయి సాధించాడు. 2 గంటల 9 నిమిషాల పాటు ఈ మ్యాచ్‌ సాగింది. వరల్డ్‌ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ అరైనా సబలెంకా (బెలారస్‌) కూడా మూడో రౌండ్‌కు చేరింది. 

రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సబలెంకా 6–3, 6–1తో జిల్‌ టీక్‌మన్‌ (స్విట్జర్లాండ్‌)ను ఓడించింది.పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. అన్‌సీడెడ్‌ నూనో బోర్జెస్‌ (పోర్చుగల్‌) 2–6, 6–4, 6–1, 6–0తో రూడ్‌ (నార్వే)ని ఓడించాడు. మరో రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ లొరెంజో ముసెట్టి (ఇటలీ) 6–4, 6–0, 6–4తో డేనియల్‌ గలాన్‌ (కొలంబియా)పై గెలిచి ముందంజ వేశాడు.

మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్, నాలుగు సార్లు విజేత ఇగా స్వియాటెక్‌ మరో టైటిల్‌ దిశగా ముందడుగు వేసింది. రెండో రౌండ్‌లో స్వియాటెక్‌ 6–1, 6–2తో ఎమా రాడుకాను (బ్రిటన్‌)ను చిత్తు చేసింది. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌లలో ఎనిమిదో సీడ్‌ కిన్‌వెన్‌ జెంగ్‌ (చైనా) 6–2, 6–3తో ఎమీలియా అరాంగో (కొలంబియా)పై, 13వ సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 7–6 (7/4), 7–5తో అనా బొండర్‌ (హంగేరీ)పై గెలుపొందారు.  

రిత్విక్‌ జోడి పరాజయం... 
గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్‌లో తొలి విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరికి మరోసారి నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లోనే రిత్విక్‌ (భారత్‌) – నికొలస్‌ బరింటోస్‌ (కొలంబియా) జోడి ఓటమిపాలైంది. జాకబ్‌ ఫియర్లీ (బ్రిటన్‌) – గాబ్రియెల్‌ డియాలో (కెనడా) ద్వయం 6–0, 6–2తో రిత్విక్‌–నికొలస్‌ జంటను చిత్తు చేసింది. 56 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. 

మరో వైపు ఇద్దరు భారత ఆటగాళ్లు రోహన్‌ బొపన్న, యూకీ బాంబ్రీ తమ భాగస్వాములతో కలిసి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. బోపన్న – ఆడమ్‌ పావ్‌లాసెక్‌ (చెక్‌ రిపబ్లిక్‌) జోడి 7–6 (8/6), 5–7, 6–1 స్కోరుతో రాబర్ట్‌ క్యాష్‌ (అమెరికా) – జె ట్రేసీ (అమెరికా)ను ఓడించారు. మరో మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్‌) – రాబర్ట్‌ గాలొవే (అమెరికా) జంట తొలి రౌండ్‌లో 6–3, 6–7 (8/10), 6–3 స్కోరుతో రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌) – హెన్‌డ్రిక్‌ జెబెన్స్‌ (జర్మనీ)పై గెలుపొంది ముందంజ వేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement