ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ శుభారంభం చేశాడు. మట్టికోర్టులో జరిగే ఈ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది. పురుషుల సింగిల్స్ విభాగం తొలి రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ జ్వెరెవ్ 6–3, 6–4, 6–2తో బెంజమిన్ బోన్జీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 2 గంటల 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో జ్వెరెవ్ ఐదు ఏస్‌లు సంధించాడు. తొలి సర్వీస్‌లో 37 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 23 పాయింట్లు స్కోరు చేశాడు.
తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి... ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. 38 విన్నర్స్ కొట్టిన అతను 31 అనవసర తప్పిదాలు చేశాడు. కెరీర్‌లో 41 గ్రాండ్ స్లామ్ టోర్నీలు ఆడిన జ్వెరెవ్ కు ఇంకా గ్రాండ్ స్లామ్ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. మూడుసార్లు (2025 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్, 2020 యూఎస్ ఓపెన్) గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించే అవకాశం వచ్చినా జ్వెరెవ్ వాటిని సద్వినియోగం చేసుకోలేదు. ఫైనల్లో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నాడు.
మహిళల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా), బెలిండా బెన్ చిచ్ (స్విట్జర్లాండ్) కూడా తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. బెన్ చిచ్ 6–2, 6–3 తో క్వాలిఫయర్ సింజా క్రాస్ (ఆస్ట్రియా)పై, ఆండ్రీవా 6–3, 6–3తో ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్)పై విజయాలు సాధించారు.


